Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముమ్మరంగా ఉద్యోగ బదీలల కసరత్తు

ఎవరు ఎక్కడికో అన్న ఉత్కంఠలో ఉద్యోగులు

తమకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అంటూ టీచర్ల డిమాండ్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీ పక్రియతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎవరు ఏ జిల్లాకు వెళ్తారోననే దానిపై ఇంకా ఎడతెగని ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జవో 317 ప్రకారం జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన తుది జాబితా దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీసు, విద్యశాఖ జాబితాలపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటన్నారు.

దాదాపుగా అన్ని శాఖలపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా.. ఉపాధ్యాయుల జాబితాపై మాత్రం జాప్యం జరుగుతూనే వస్తుంది.  బదిలీ పక్రియపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రోజుకో అభ్యంతరం చెప్పడంతో ప్రభుత్వం మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయుల బదిలీ పక్రియ కొలిక్కి రావడం లేదని తెలుస్తుంది. స్పెషల్‌ కేటగిరి, హెల్త్‌ 70శాతం కన్న ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు, ధీర్ఘకాలిక వ్యాధులు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరిల పరిశీలన అనంతరమే సీనియార్టీ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కాని కొన్ని సాంకేతిక కారణాలు, రిజర్వేషన్‌ పక్రియపై ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయుల తుది జాబితా పై గందరగోళం ఏర్పడుతుంది.జిల్లాల వారిగా ఎంతమంది ఏయే విభాగాల్లో పని చేస్తున్నదీ అధికారిక లెక్క తీసారు. ఉద్యోగుల సమాచారాన్ని ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో పొందుపరిచారు. మిగితా శాఖల ఉద్యోగుల జాబితా వివరాలను జిల్లా కలెక్టర్ల ఆమోదం అనంతరం ఆన్‌లైన్‌ చేసే అవకాశం ఉంది. సీనియార్టీ ప్రకారం కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఉద్యోగులకు ఆదేశాలు అందాయి. ఇందులో నాల్గో తరగతి ఉద్యోగులు, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, వాచ్‌మన్లు, ఆఫీసు సబార్డినెట్లు, తదితర ఉద్యోగులున్నారు.

సీనియర్‌ ఉద్యోగులకు సొంత జిల్లా అవకాశాలు దక్కడంతో ఆనందం కనిపిస్తున్నా.. జూనియర్‌ ఉద్యోగుల్లో మాత్రం కొంత ఆందోళన మొదలయ్యింది. సీనియర్‌ల రాకతో బదిలీ తప్పదనే టెన్షన్‌కు గురవుతున్నారు. కుటుంబ సమేతంగా ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువులు, ఇతరాత్ర సమస్యలతో సతమతమవుతున్నారు. ఉపాధ్యాయులను జిల్లాలకు అలట్‌మెంట్‌ చేసేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. అలాగే నూతన జోనల్‌ విధానం ద్వారా ఉపాధ్యాయుల కేటాయింపుపై సమగ్రమైన సీనియార్టీ లిస్టును ప్రదర్శించాలని నేతలు కోరారు. దీంతో  తుది జాబితా విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించాలని కోరుకుంటున్నారు.