ధాన్యం సేకరణలో తిరోగమన విధానంతో నష్టం కెసిఆర్‌కే

బిజెపిని ఢీకొనే క్రమంలో రైతులను విస్మరిస్తున్న టిఆర్‌ఎస్
మరోవైపు బిజెపి, కాంగ్రెస్, షర్మిలల ఎదురుదాడి
రాష్ట్రంలో ఇప్పుడు కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదగడంతో రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను ఢీకొనడం ప్రస్తుతం ఉన్న పార్టీలకు సాధ్యం కాకపోవచ్చు. అయితే దుబ్బాక, హుజూరాబాద్‌ల ఫలితాల తరవాత టిఆర్‌ఎస్‌కు కొంత ఎదురుగాలి మొదలయ్యింది. దీంతో అప్రమత్తం అయిన కెసిఆర్ బిజెపిని ఢీకొనేందుకు ధాన్యం సేకరణ అంశాన్ని చేసుకుని పోరాటానికి దిగారు. బిజెపికి చావుడప్పుకొట్టారు.
మంత్రుల బృందాన్ని ఢల్లీికి పంపారు. అదే సమయంలో తాను ఇచ్చిన హావిూలపైనా దృష్టి సారించి ఉంటే ప్రజల మద్దతు పూర్తిగా దక్కి ఉండేది కానీ అలాంటి అవకాశం లేకుండా కేవలం బిజెపిని ఎదరించడమే లక్ష్యంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం సేకరణ అన్నది అయోమయంలో పడిరది. ఈ సమస్యను పరిష్కరించి ఉంటే కెసిఆర్‌కు రైతులు అండగా నిలిచేవారు. ఇంతకాలం అనేకానేక పథకాలతో అన్ని వర్గాలను చేరదీస్తూ, అన్నివర్గాలతో భేష్ అనిపించుకునేలా కెసిఆర్ కార్యక్రమాల కార్యాచరణ సాగింది.
రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా మంచి నిర్ణయమే తీసుకున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటా మంచినీటి సమస్య తీరింది. కరెంట్ సమస్య ఎలాగూ లేదు. అలాగే మైనార్టీ పథకాలతో అటు క్రిస్టియన్లు, ఇటు ముస్లింలు కూడా కెసిఆర్ పట్ల ఫిదా అయ్యారు. వారు తమకు కావలసిన విధంగా సిఎం కెసిఆర్ చేయూత ను ఇస్తున్నారని ధీమాగా ఉన్నారు. బిసిలకు మేలు చేసే విధంగా కసపరత్తు సాగుతోంది. ఈ దశలో బిజెపికి చెప్పుకోవడానికి, విమర్శించడానిక పెద్దగా సమస్యలు లేవు. కనీసంగా విభజన సమస్యలు పరిష్కరించేలా కేంద్రంతో పోరాడి ఉంటే బిజెపికి మైలేజీ వచ్చేది.
మోడీ పేరు చెప్పి అహో ఒహో అంటూ పోవడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరగదని గ్రహించడం లేదు. అందుకే బిజెపి గ్రాఫ్ మరింతగా పడిపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో బిజెపి బూచితో కెసిఆర్ తను అనుకున్న విధంగా కాకుండా బిజెపి ట్రాప్‌లో పడి విమర్శలకు పోవడం, పోరాటాలకు దిగడం, ధాన్యంసేకరణ చేయకపోవడం, వచ్చే యాసంగిలో ధాన్యం కొనబోమని ప్రకటించడం అంతా తనకుతాను వ్యతిరేకతను తెచ్చుకున్నారు.
రాష్ట్రంలోని సామాజిక శక్తులను ఏకం చేయడమే కాకుండా వారిని ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వాములను చేయాలని బిజెపి చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాల్లో పేరుమోసిన వ్యక్తులను ప్లాట్‌ఫాం విూదకు తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా బరిలో నిలవాలని మరోవైపు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అలాగే కెసిఆర్ వ్యతిరేక శక్తులను చేరదీయడం ద్వారా బలం పెంచుకోవాలని బిజెపి నేతలు చూస్తున్నారు.
పార్టీ బలోపేతానికి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కార్యాచరణ ఒకటి సిద్దం చేసి రాహుల్‌కు సమర్పించి, ఆమేరకు ముందుకు సాగాలని చూస్తున్నారు. ఇకపోతే టిడిపిలో ఉన్న నేతలు ఐతే టిఆర్‌ఎస్, లేకుంటే కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ టిడిపి ప్రభావం పెద్దగా లేకుండా పోయింది. దీంతో టిడిపి క్యాడర్ ఇప్పటికే టిఆర్‌ఎస్ వెంట నడుస్తోంది. అలాకుండా తటస్థంగా ఉన్నవారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రణాళికలు సిద్దం చేయబోతున్నారు. అలాగే మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు బిజెపిలో చేరి తరవాత టిఆర్‌ఎస్ లో చేరారు.
రమణకు ఎమ్మెల్సీ లభించినా..పెద్దిరెడ్డి, మోత్కుపల్లిలకు ప్రయోజనం కలగలేదు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తోంది. ఓట్ల చీలికలను నివారించే క్రమంలో తెలంగాణలోని సామాజిక శక్తులన్నింటినీ ఒక్కతాటిపై తేవాలని భావిస్తోంది. ఈ క్రమంలో షర్మిల పార్టీ పెట్టి టిఆర్‌ఎస్, కెసిఆర్‌పైనే యుద్దం ప్రకటించి పోరాడుతున్నారు. ఈ క్రమంలో శతృవులను పెంచుకోవడం కెసిఆర్‌కు తగదు. దీంతో ఆయన అనవసరంగా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ధాన్యం సేకరణలో కేంద్ర విధానాల మేరకు ముందుకు సాగడం ఉత్తమం. అలాకాకుండా పట్టుదలకు పోతే రైతుల్లో ఉన్న ప్రతిష్టను కోల్పోతారు. దీనిపై కెసిఆర్ ఇకముందు ఎలా వెళతారన్నది చూడాలి.