పార్లమెంట్ సమావేశాలు సాధించిందేమిటి ?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఎలాంటి చర్చ లేకుండా ముగించేశారు. ఉభయసభలు నిరవధికంగా ఒకరోజు ముందుగానే వాయిదా పడ్డాయి. ప్రజల సమస్యలపై చర్చించాలన్న లక్ష్యం లేకుండా సమావేశాలు ముగించడం దురదృష్టకరం. ప్రధాన సమస్యలపై చర్చ లేకుండా పోయింది. నిరంతరం సభను స్తంభింపచేయడమే తమ విజయమని విపక్షాలు భావిస్తున్న ట్లుగా ఉంది.
విపక్షాలకు సమాధానం ఇవ్వ కుండా అనుకున్న బిల్లులను ప్రవేశ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రధాని మోడీ సభకు రాకుండా రాజకీయ సభల్లో పాల్గొంటున్న తీరు గర్హనీయం. అనేకానేక కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటూ యూపి ఎన్నికలపై దృష్టి సారించారు. నిజానికి పార్లమెంటులో ఉండి సమస్యలపై చర్చిం, సమాధానం ఇవ్వాల్సిన పెద్దాయన ఇంత బాధ్యతారహితంగా ఉండడడం సరైనదేనా అన్నది ప్రజలు ఆలోచించాలి.
ప్రజాసమస్యలు చర్చించడానికి అత్యున్నత వేదిక అయిన పార్లమెంట్ ఇలా వృధాగా ముగియడం వల్ల నస్టపోతున్నది ప్రజలే. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి వీలు కల్పించే అవకాశం ఉన్నా..ఆందోళనలతో సభా సమయాన్ని వృధా చేసుకున్న విపక్షాలను కూడా క్షమించరాదు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా విపక్షాలు చర్చలకు అవకాశం ఉన్న అంశాలను, అవకాశాలను వదులుకున్నారు. సమస్య లను చర్చించడమే చట్టసభలకు, సభ్యులకు మహోన్నత లక్ష్యం కావాల్సి ఉండగా గందనగోళం సృష్టించి సభలను వాయిదా వేయించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగాయి.
పార్లమెంట్ శీతకాల సమావేశాలు తీరు చూసినప్పుడు ఆవేదన కలగక మానదు. సమస్యలను చర్చించకుండా.. చట్టాలపైనా చర్చించకుండా ఎవరికి వారు తమ వ్యక్తిగత ఎజెండాతో సాగితీరు బాధ కలిగిస్తోంది. మొత్తంగా సమస్యలను చర్చించాల్సిన అత్యున్నత వేదిక తన బాధ్యతను చేపట్టడంలో విఫలమవు తోందా అని ఆలోచించే సమయం వచ్చింది.
వివాదం లేపిన నూతన సాగుచట్టాలను రద్దు చేసే బిల్లును చర్చ లేకుండా పార్లమెంట్ ఆమోదించడంతో మొదలైన రభస చివరి వరకు సాగింది. మరోపక్క గడచిన వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించా రంటూ 12 మంది రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేయడం సైతం చర్చనీ యాంశమైంది.
సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఏకతాటి విూదకు వచ్చాయే తప్ప ఒక్క క్షమాపణతో ప్రబుత్వాన్ని నిలదీసేలా సమస్యల పై చర్చకు ముందుకు రాలేదు. క్షమాపణలు చెప్పడం నామోషీగా ఫీలయినట్లుగా ఉన్నారు. క్షమాపణ చెబితే తప్ప, సస్పెన్షన్ ఎత్తివేయమన్నట్లు ప్రభుత్వం కూడా భీష్మించుకోవడం వెనక వారి ప్రయోజనాలు వారికి ఉన్నాయన్నది కూడా ఆలోచించాల్సిందే. మొత్తంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఎలాంటి ఫలితాలన్ని చూపకుండా పోయాయి.
చట్టసభల్లో చర్చల కన్నా వాదోప వాదాలు, గందరగోళాలే ఎక్కువ సమయం వృధా జరుగుతోంది. పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నది ఇందుకకేనా అన్న ఆవేదన ప్రజలకు కలుగుతోంది.అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుంª`డా ఎవరికి వారు తమకు తోచిన విధంగా పార్లమెంట్ సమావేశాలను సాగకుండా దోహదపడ్డారు. తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా ఎవరికి వారు సమస్యలపై చర్చకు ముందుకు రాలేదు.
గత సమావేశాల్లో ఏదో చేశారన్న కారణంగా 12మంది ని రాజ్యసభ నుంచి బహిష్కరించడం రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. అధికార బిజెపికి సభలో సమస్యలను చర్చించే ధైర్యం లేకుండా పోయింది. సమస్యలపై విపక్షాల చర్చను ఆహ్వానించాల్సిన అధికార పక్షం ఇలా నిర్వీర్యంగా, నిస్తేజంగా ఉండడం దారుణం. ఈ వ్యవహారంలో పార్లమెంటరీ నిబంధనలను పాటించలేదన్న విపక్షాల ఆరోపణలకు
అధికార పక్షం వద్ద జవాబు లేదు. ఇదంతా ఒక ఎత్తయితే ప్రధాని సమావేశాల సందర్భంగా సభకు రాకుండా రాజకీయాల కోసం యాత్రలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఘనత వహించిన బిజెపి నేతలు, పెద్దలు చెప్పాలి. సాగుచట్టాలను రూపొందించినప్పుడు, ఆమోదించి నప్పుడు, రద్దు చేసినప్పుడు కూడా చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకున్న తీరు అధికార పార్టీ డొల్లతనాన్ని బయటపెట్టింది.
ఏడాది పాటు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు దిగడానికి కారణంకొత్త సాగు చట్టాలు అన్నది అందరికీ తెలిసిందే. వాటిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమోది స్తున్నప్పుడు కూడా పార్లమెంటులో కనీసంగా చర్చించలేదు. ఇప్పుడా చట్టాల్ని రద్దు చేస్తూ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడూ చర్చించలేదు. దాదాపు 750 మంది దాకా రైతుల బలిదానానికి కారణమైన చట్టాలపై చర్చ లేకుండా, మరణాలపై సమాధానం చెప్పకుండా ముగించారు.
రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టం, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన లాంటి వాటిపై చర్చించాలన్న డిమాండ్లను కూడా కేంద్రం పట్టించుకోలేదు. జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ క్షమాపణలు చెప్పడం, ట్వీట్లు పెట్టిన ప్రధాని మోడీ పార్లమెంటులో జరగా ల్సిన చర్చకు మాత్రం ముందుకు రాలేదు.ఎలాంటి చట్టమైనా చేసే ముందు దానిపై క్షుణ్ణంగా చర్చించే అవకాశం ఉండాలి.
ఓటరు నమోదుకు ఆధార్ అనుసంధానం చట్టంపైనా సమగ్ర చర్చ చేయలేదు. పార్లమెంటును దేవాలయంగా పోల్చిన నేతలు దానిని అభాసుపాలు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం విపక్షాల బాధ్యత. దానిపై చర్చించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ రెండూ నెరవేరకుండానపే పార్లమెంట్ సమావే శాలు సాగిన తీరు దరాఉణం కాక మరోటి కాదు. అది బాధ్యతను విస్మరించడమే తప్ప మరోటి కాదు. అలాగే, చట్టసభలో అనుచిత ప్రవర్తనను ఎవరూ సమర్థించ రాదు. అలాంటివారిపై ప్రభుత్వం చర్య తీసుకో వాల్సిందే. అలాగని కక్ష సాధించే రీతిలో కూడా ప్రభుత్వం తీరు ఉండరాదు.
అధికారంలో ఉన్నవారే పెద్ద మనసుతో, పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇరు పక్షాలూ భీష్మించుకొని పార్లమెంటరీ ప్రతిష్టంభనకు కారణమైతే అందుకు ప్రజలు ఏమనుకోవాలి. ఎందుకు ఓటేసామని అనుకోవాలి. ఇలాంటి వారిని తాము చట్టసభలకు పంపామా అని అనుకోవాలి. ఇలాంటి అవకాశం ప్రజలకు ఇవ్వడం సబబా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.