Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుమారుడిని ఖననం చేసిన చోటే ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

*హార్వెస్ట్ స్కూల్ ఘటనలో మరో విషాదం కుమారుడి మృతి ఖననం చేసిన చోటే ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య*

ఖమ్మం జిల్లా డిసెంబర్ 19 నిజం న్యూస్ :
కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఈ నెల 15న కుమారుడు సాయి భాను ప్రకాశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా తండ్రి ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే……….
రాంబాబు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటోంది. ఖమ్మం లోని మమత హాస్పిటల్ లో ఉన్న హార్వెస్ట్ స్కూలు లో భాను ప్రకాష్ పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల విషయమై భాను ప్రకాష్ పాఠశాల యాజమాన్యం, మందలించారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసింది.
ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న సాయి మృతిచెందాడు. స్వగ్రామం సత్తుపల్లిలో కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం రాంబాబు నిన్న రాత్రి 11గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు.
ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఈ ఉదయం కుమారుడిని ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో సత్తుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి కొడుకుల మరణానికి కారణమైన హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్కూల్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.