Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ ఏర్పాటు

హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ ఏర్పాటు
లాంఛనంగా ప్రారంభించిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ
స్వల్ప వ్యవధిలో కేసుల పరిష్కారం లక్ష్యమన్న జస్టిస్‌ రమణ
సిఎం కెసిఆర్‌ ప్రోత్సాహం మరువలేనిదని అభినందన
హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటు కావడం గర్వకారణమన్న కెసిఆర్‌

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల కేసుల్లో ఐఏఎంసీ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అతి తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో కేసుల పరిష్కారమే ఐఏఎంసీ లక్ష్యమన్నారు.

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడ లోని ఫోనిక్స్‌ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ విూడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సిజె రమణ మాట్లాడుతూ దేశంలో ఆర్బిట్రేషన్‌, విూడియేషన్‌ పక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఆర్బిట్రేషన్‌, విూడియేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందన్నారు. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్‌ వారధి లాంటిదని తెలిపారు.

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఏఎంసీ ఏర్పాటు చేశామని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయి. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టం కలుగుతుందన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసులను పరిష్కారం చేయొచ్చు అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్పగించారు.

ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్‌ అంగీకరించారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైంది. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు, మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ’ఇది నా నగరం. అందుకే ఈ సిటీపై నాకు అభిమానం ఎక్కువ. దేశంలో అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. వ్యాపారం, వాణిజ్యంలో ఇండియాలోని టాప్‌ డెస్టినేషన్స్‌ లో ఒకటిగా ఈ నగరం ఎదుగుతోంది. ఐఏఎంసీ ఏర్పాటులో భాగం పంచుకోవడం ద్వారా ఈ నగర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాననే సంతోషం ఉంది.

ఈ సెంటర్‌ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు హైదరాబాద్‌ కు ఉన్నాయి. దీంట్లో నేను కొత్తగా చేసిందేవిూ లేదు. ఉత్తర, దక్షిణాది రాష్టాల్రకు మధ్య వారధిలా ఉంటుందీ నగరం. వివిధ ప్రాంతాలు, వేర్వేరు మతాలు, కులాల ప్రజలు ఇక్కడ కలసిమెలసి ఉంటున్నారు. కాబట్టి ఐఏఎంసీ ఏర్పాటుకు ఇంతకుమించిన బెస్ట్‌ ప్లేస్‌ లేదు’ అని ఎన్వీ రమణ చెప్పారు.

భారతదేశంలో పప్రథమంగా హైదరాబాద్‌ లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకార ణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడి౦చి అభినందిస్తున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒకరు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారు. నిజానికి ఇటీవలి కాలంలో విూరు హైదరాబాద్‌లో చాలా చేస్తున్నారు. సరైన ప్రాపగండా చేస్తలేరు అని విదేశీ స్నేహితులు తనతో చెప్పారు.

నిన్న కూడా ఇద్దరు ముగ్గరు ఫ్రెండ్స్‌ సింగపూర్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. విూరు అసలు ప్రమోట్‌ చేయట్లేదు. హైదరాబాద్‌ సింగపూర్‌ కన్నా బాగుంది అని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్‌ పురోగమిస్తోంది. అనేక రంగాల్లో హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారుతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్‌ సెంటర్లలో పరిష్కారాలు లభ్యమవుతుండటం అనేది ఈరోజు ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌.

అట్లాంటి సౌకర్యం భారతదేశంలో పప్రథమంగా హైదరాబాద్‌లో రావడం, రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణం. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్టాన్రికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సెంటర్‌ అన్నివిధాలుగా ముందుకు పురోగమిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

కంపెనీలు, పెట్టుబడిదారుల మధ్య వివాదాలను పరిష్కరించడం ఈ సెంటర్‌ లక్ష్యం. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా చట్టాలు తీసుకొస్తా మన్నారు. మంచి ఉత్తమమైన సెంటర్‌ను ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వర రావు, జస్టిస్‌ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహముద్‌ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.