Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టిడిపికి కలసి వస్తున్న అమరావతి ఉద్యమం

భారీ బహిరంగ సభలో అంతా టిడిపిపైనే చర్చ

తిరుపతి సభ విజయంతో టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

న్యాయస్థానం’తో మొదలైన అమరావతి రైతుల పాదయాత్ర… తిరుపతి ’దేవస్థానం’ వద్ద ముగిసిన తీరు రైతుల్లో కన్నా టిడిపిలోనే ఆత్మస్థయిర్యం నింపిందని చెప్పాలి. టిడిపి అనుకున్న మేరకు యాత్ర సక్సెస్‌ అయ్యిందనుకోవాలి. అన్ని వైపుల నుంచి రైతులకు మద్దతు రావడం.. జగన్‌పై వ్యతరిఏకత రావడంతో టిడిపి ఇక మున్ముందు మరింత ఉత్సాహంగా సాగనుంది.  పాదయాత్రకు ముగింపుగా శుక్రవారం నిర్వహించిన మహోద్యమ సభ విజయవంతం కావడంతో టిడిపి శ్రేణుల్లోనూ ధైర్యాన్ని, భరోసాను నింపింది.

తిరుపతిలో ’జై అమరావతి’ నినాదం ప్రతిధ్వనించింది. చంద్రబాబు ప్రసంగంపైనే అంతా ఆసక్తిగా చూశారు. రాజధాని పోరాటంలో అన్ని పార్టీలు సంఫీుభావ గళం వినిపించారు. జగన్‌ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీతో కలిసి వేదిక పంచుకోకున్నా సీపీఎం… అమరావతి రైతులకు తన మద్దతు ప్రకటించింది. మొత్తంగా అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ సభకు వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి.

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, జనసేన పార్టీల ముఖ్యనేతలు స్వయంగా హాజరయ్యారు. సీపీఎం నేతలు హాజరు కాకున్నా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం జరిగిన బహిరంగ సభకు చిత్తూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం పోటెత్తగా ఈ వ్యవహారమంతా టిడిపి వెనక ఉండి నడిపించిందనే సమాచారం ఉంది. అమరావతి రైతు ఉద్యమాన్ని టిడిపి నడిపిస్తోందిన వైసిపి ముందునుంచీ ఆరోపిస్తుంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రాక కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

సభా ప్రాంగణానికి వచ్చినపుడు కేరింతలతో ఆయనకు స్వాగతం పలికారు. సభకు  ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇతర జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యారు.  జిల్లా పోలీసు యంత్రాంగం పలు చోట్ల సభకు వెళుతున్న వాహనాలను ఆపడం, అడ్డుకోవడం, టీడీపీకి చెందిన నాయకులను అడ్డుకోవడం వంటి చర్యలకు దిగారు. బహిరంగ సభకు ఇతర పార్టీల కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. చంద్రబాబు సభా ప్రాంగణానికి వచ్చినపుడు, ప్రసంగించిన సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.

అమరావతి రాజధానికి భూములిచ్చిన కొందరు రైతులు వేదికపై మాట్లాడారు. వారి ప్రసంగం సభికులను కదిలించింది. తమ కుటుంబాల నేపథ్యం, భూములిచ్చిన తీరు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు, పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లడం.. ఇలా తమ కష్టాలను వివరించినపుడు సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. వారి కష్టాలు విని చలించిపోయారు. పార్టీలతో, స్థాయితో నిమిత్తం లేకుండా వేదిక నుంచి ఎవరు మాట్లాడినా జనం విశేషంగా స్పందించారు. మొత్తంగా ఇప్పుడు అమరావతి హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్‌ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ప్రజలకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో తీర్చిదిద్దుతానని హావిూ ఇచ్చారు.

అమరావతిని రాజధానిగా చేస్తూ ప్రకటించారు. రాజధాని అభివృద్ధి కోసం రైతుల నుంచి ఎన్నో ఎకరాల భూములను సేకరించారు. అయితే ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏపీలో 3 రాజధానులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. వైసీపీ ప్రకటనతో ఒక్కసారిగా ఏపీలో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రకటన కొందరు తీపి కబురుగా తోచినా.. కొందరి చెవికి మాత్రం వినసొంపుగా వినిపించలేదు.

ఏపీలో ఒకేఒక్క రాజధాని ఉండాలని.. అదికూడా అమరావతి మాత్రమే ఉండాలంటూ అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా 45 రోజుల పాటు మహాపాదయాత్ర నిర్వహించి తిరుపతిలో భార బహిరంగ సభ నిర్వహించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థులు సత్తాచాటి విజయభేరి మోగించారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా విజయోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ నేతలు సీఎం జగన్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని.. అందుకే వైసీపీని గెలిపించారంటూ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ వైసీపీ విజయపతాకం ఎగురవేసింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వివాదస్పద ఘటనతో ఇక నేను ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానని చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి నిష్కమ్రించారు. అంతేకాకుండా 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం చేసుకొని ఆయన భవిష్యత్‌ కార్యచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వైసీపీపై పోరుకు చంద్రబాబు ఈ పార్టీలతో కూడిన మహాకూటమి తయారు చేసుకొని వచ్చి ఎన్నికల్లో దండయాత్ర చేస్తారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అమరావతి రైతుల మహాసభను చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. మొత్తంగా అమరావతి టిడిపికి కలసి వచ్చేలా చేస్తోంది.