Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

 ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని పాలకులు  

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తు న్నారు. తామంతా బ్రహ్మాండగా ప్రజా సేవ చేస్తున్నామని భ్రమల్లో ఉన్నారు. కేంద్రమ్లో మోడీ, తెలుగు రాష్టాల్ల్రో జగన్‌, కెసిఆర్‌ల పాలనా తీరుపట్ట తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా సరిదిద్దుకునే ప్రయత్నాలు సాగడం లేదు.

జిఎస్టీ, పెట్రో ధరలు, పెరిగిన నిత్యాసవర ధరలపై  ప్రజలు మండిపడు తున్నారు. ఎపిలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, డబ్బుల పందేరంతో బొక్కసం ఖాళీ అయ్యింది. మూడు రాజధానుల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు. రైతు ఉద్యమాన్ని టిడిపి ఉద్యమంగా చూపి ప్రతి ఉద్యమం చేయిస్తున్నారు. ఇది తీవ్ర వ్యతిరేకతను చాటుతున్నా.. తామంతా మంచే చేస్తున్నామని జగన్‌ ఆయన అనుయాయులు చంకలు గుద్దుకుంటున్నారు.

తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోళ్లు మొదలు, నిరుద్యోగం వరకు అనేక సమస్యల ను పరిష్కరించడంలో  సిఎంక కెసిఆర్‌ నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. సమస్యలన్నీ కేంద్రం తీరువల్లనే అన్న ధోరణిలో కేంద్రంపై విరుచుకు పడుతున్నారు కేంద్రంతో యుద్దం అంటూ సమయాన్ని అటువైపు వృధా చేస్తున్నారు. తమ పరిధిలో పరిష్కరించాల్సిన వాటి గురించి పట్టించుకోవడం లేదు. అలాగే తెలంగాణ ఆకాంక్షల మేరకు పాలిస్తున్నామా లేదా అన్న ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు.

విపక్షాలను మాట్లాడ నీయకుండా ఎదురుదాడి చేయడం వల్ల లాభం లేదని గుర్తించడం లేదు. ఇకపోతే బిజెపి నేతల తీరు కూడా సక్రమంగా లేదు. సమస్య లపై కేంద్రంతో మాట్లాడాల్సింది పోయి అధికారంలో ఉన్న కెసిఆర్‌, జగన్‌లపై విమర్శలతో కాలయాపన చేస్తోంది. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తు న్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతుందో  తెలుసుకోలేని  ప్రధాని మోడీ కేవలం తాను అనుసరిం చిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారంటూ ఆత్మస్థుతి చేసుకుంటున్నారు.

పార్లమెంటుకు రాకుండా.. విపక్షాలకు చర్చలకు అవకాశం ఇవ్వకుండా మొండిగా ముందుకు సాగుతున్నారు. కేవలం కార్పోరేట్‌ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద,సామాన్య ప్రజలు ఎంతగా చితకి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు పాలనలో ఎక్కడ తప్పిదం జరిగిందో పరిశీలన చేయడం లేదు. విమర్శలను సహించడం లేదు. ఎదురుదాడితో సాగాలన్న పెడధోరణిలో ఉన్నారు. దివంగత మాజీప్రధాని పివి నరసింహా రావు పుణ్యమా అని ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు దేశ ప్రజలను గడపదాటి బయటకు వెళ్లేలా చేశాయి. ప్రజలు ప్రపంచాన్ని చూసేలా చేశాయి. ప్రపంచం భారత్‌ వైపు చేశాయి. మన మార్కెట్లు జోరందు కున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు సామాన్యుడికి కడుపునిండా భోజనం పెట్టేలా చేశాయి. ప్రతి వస్తు వును కొనుగోలు చేసేలా చేశాయి.

కానీ మోడీ కావచ్చు..అంతకు ముందు ఉన్న మన్మోహన్‌ కావచ్చు సంస్కరణలను సక్రమంగా మరింత బలంగా అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రజల జీవన పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. తాముపట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా ఉన్నారే తప్ప ప్రల్లో వస్తున్న వ్యతిరేకతను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించడంలేదు. ప్రజా నాయకులైతే ఇలాంటి విధానాలు పరిశీలన చేసుకోవాలి. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే బిచాణా ఎత్తేయాల్సి ఉంటుందని గుర్తించడం లేదు.

ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేక పోతున్నామని  గమనించాలి. ఎన్నో ఏళ్లుగా అధికారంలో లేక, రాష్ట్రస్థాయిలో బలమైన నాయకులు లేక బలహీనంగా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇచ్చి సీట్ల సంఖ్యను పెంచుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారంటే కేవలం వ్యతిరేకతతోనే అని బిజెపి నేతాగణం ఆలోచన చేయాలి.

పలు రాష్టాల్ల్రో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడే చెప్పలేక పోయినా అధికార బిజెపికి అంత ఈజీ కాదని గుర్తించాలి.  కేవలం రాహుల్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదని ప్రధాని మోడీ గుర్తించాలి. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేలా సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. సంస్క రణలంటే ఇవే తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాలి.

2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్‌ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి.  ఇకముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్‌ గొప్పతనం కాకుండా మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి.

కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందనడానికి తాజా పరిణామాలే ప్రత్యక్ష నిదర్శనం.  పివి నరసింహారావు లాగా సంస్కరణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేక పోతున్నా యో పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు, జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలుచేసే సంస్కరణలను అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు. లేకుంటే 19 రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నా మన్న అహంకారంతో ఉంటే అది ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదు.

ఇకపోతే తెలంగాణలో సిఎం కెసిఆర్‌, ఎపిలో సిఎం జగన్‌ తాము చేస్తున్న పనులపట్ల వస్తున్న వ్యతిరేకతను గుర్తించాలి. లేకుంటే వీరికి కూడా ప్రజల్లో ఆదరణ దక్కక పోవచ్చు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగకపోతే మున్ముందు మరింత తీవ్ర వ్యతిరేకత రావచ్చు. ప్రజలను విస్మరిస్తే జరిగే పరిణామాలను గుర్తు చేసుకుని ముందుకు సాగితే మంచిది. ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది పాటిస్తే మంచిది.