Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివాహ వయస్సును పెంచడాన్ని స్వాగతించాల్సిందే! 

టీనేజ్‌ అన్నది ఉరకలెత్తించే జవనాశ్వం లాంటిది. దానికి మంచీచెడూ అన్న ఆలోచన కన్నా తలచిన పని చేయాలన్న పట్టుదల.. అహంకారం..ఆలోచనారహితం ఎక్కువ. అందుకే పెద్దలు టీనేజీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వారిని అదుపులో పెడుతూ వచ్చేవారు. దానినే యుక్త వయస్సు అని కూడా అంటారు. ఈ వయసులో ఆలోచన కన్నా ఆవేశమే ఎక్కువ. పట్టుదలా ఎక్కువే.

కొత్తగా యవ్వనంలోకి అడుగిడుగుతున్న వస్తున్న సమయంలో కోరికలు కూడా గుర్రాల్లా దౌడు తీస్తుంటాయి. ఇక వివాహ విషయంలో పట్టుదలలు ఎక్కువ. తాము కోరుకున్న అబ్బాయి కోసం అమ్మాయిలు మొండిగా ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా అంతే మొండిగా ఉంటారు. ఈ విషయంలో మంచీచెడులను ఆలోచించరు. కారనం వయసు అలాంటి.

చదువుకునే సమయంలో కాలేజీలోకి ఎంటర్‌ కాగానే మనస్సు ప్రేమవైపు పరుగుపెట్టడానికి కారణం కూడా అదే.. అందుకే అనేక ప్రేమ వివాహాలన్నీ టీనేజీలో జరుగుతున్నావే. చదువుకుంటారని ధైర్యం చేసి  పిల్లలను కాలేజీలకు పంపిస్తే ప్రేమ పేరుతో తల్లిదండ్రులను ఎదరించడం అనేక సందర్బాల్లో చూసాం.

జీవితం విూద ఓ అభిప్రాయం లేకుండానే కన్నవారిని ఎదరించి తరవాత ఆత్మ హత్యలు చేసుకున్న ఘటనలు కూడా చూసాం. ఈ క్రమంలో ఆడపిల్లల వివాహ వయస్సును 21ఏళ్లకు తీసుకుని రావాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం నిజంగా అభినందనీయం. దౌడుతీసే ప్రేమ ఆలోచనలకు ఈ చర్య కళ్లెం వేయగలదు. అలాగే చదువు కూడా కొనసాగగలదు.

21ఏళ్లు అంటే టీనేజ్‌ దాటుతుంది. అప్పుడు కొంత ఆలోచించే శక్తి వస్తుంది. మంచీచెడులను విశ్లేషించుకునే అవకాశం వస్తుంది. ఆడపిల్లలు కూడా ప్రేమ కోసం తల్లి దండ్రులను ఎదరించే అవకాశం ఉండదు. అప్పుడు వారికి ఆలోచన..జీవితం విూద ఓ అభిప్రాయం వస్తుంది. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా పట్టుదలగా తాముకోరుకున్న పనిచేయా లన్న సంకల్పంతో ఉండే టీనేజ్‌ దశ దాటిపోతుంది.

నిజానికి చాలాకుటుంబాల్లో ఇప్పటికే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రలు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువు,జీవితం తరవాతనే పెళ్లిల్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర నిర్ణయం ముమ్మాటికీ ఓ మంచినిర్ణయంగా పరిగణించాలి. అయితే ఇది 20 ఏళ్లు దాటగానే ..అంటారా లేక 21 ఏళ్లు పూర్తిగా నిండాలా అన్నది స్పష్టత రావాలి. దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంత కాలంగా చర్చ సాగుతూనే ఉంది.

గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుని, అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర కూడా వేసినట్టు గా చెబుతున్నారు..  దీనికోసం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఓమారు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను కాపాడా లంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని ప్రధాని సూచించారు.. త్వరగా పెళ్లిళ్లు కావడం, టీనేజీలో గర్భం దాల్చడం వల్ల ఆడపిల్లల్లో ఆరోగ్య  సమస్యలు కూడా వస్తున్నాయి. 30 ఏళ్లకే ముసలి వారు అవుతున్నారు. సత్తువ కోల్పోతున్నారు.

చట్టాలు ఉన్నా వాటిని కఠినంగా అమలు చేసే యంత్రాంగం అచేత నంగా ఉండడంతో  ఇప్పటికీ 18 ఏళ్లు నిండకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఎన్నో బాల్య వివాహాలు జరుగుతున్నాయి..  ఇప్పుడు 21 ఏళ్లకు పెంచాలన్న ప్రభుత్వం నిర్ణయం మంచిదే అయినా దానిని కఠినంగా అమలు చేసే బాధ్యతను క్షేత్రస్తాయి నుంచే అమలు చేయాలి. ఇకపోతే 21 ఏళ్లకు వివాహ వయస్సు పెంచడం వల్ల ఆడ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి కూడా ఓ రూపం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఇక పార్లమెంట్‌ ఆమోదం పొందటమే తరువాయి చట్టంగా రూపొందుతుంది. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్‌ వివాహాలకు ఛాన్స్‌ లేదు.

బాల్య వివాహాలకు పూర్తిగా చెక్‌ పెట్టటంతో పాటు మహిళా సాధికారతకు ఈ సవరణలు దోహదం చేస్తాయి. ఆడ పిల్లలు పెరుగుతుందంటేనే.. ఎంతో భారంగా భావించే తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల చదువులపై దృష్టి సారించాలి. బేటీపడావో బేటీ బచావో అంటున్న ప్రధాని మోడీ ఇందుకు కూడా పథకాలు తీసుకుని రావాలి. ఆడపిల్లలకు ఉచిత విద్య అందించేలా చూడాలి. చదువులకు ఉచితంగా వడ్డీలేని రుణాలు అందించాలి.

నలబై ఏళ్ల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. అబ్బాయిలతో పాటు అమ్మాయి వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచుతామని గత ఏడాది ప్రధాని మోడీ స్వాతంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ ప్రతిపాదన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. ఇందులో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, మ్యారేజ్‌ యాక్ట్‌తో పాటు హిందూ వివాహ చట్టం`1955 వంటి వ్యక్తిగత చట్టాలను సవరిస్తారు.

స్త్రీ మాతృత్వ వయస్సు, మ్యాటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌ తగ్గించటం, మెరుగైన పోషకాహార స్థాయి వంటి పలు అంశాలను జయ జైట్లీ నేతృత్వంలోని కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేసింది. పలు సిఫార్సులతో కూడిన తన నివేదికను గత డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా బాలికల వివాహ వయస్సు 21కి పెంచుతూ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సిఫార్సు వెనక ఏ ఇతర కారణాలు లేవని కేవలం మహిళల సాధికారత మాత్రమే ఉందని జయా జైట్లీ స్పష్టం చేశారు.

బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లు చేయటం వల్ల మైనర్‌ పెళ్లిళ్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఆడపిల్లలు ఉన్నత చదువుల అవకాశాలు కూడా మెరుగవుతాయి.ఈ సిఫార్సులు చేయటానికి కమిటీ అనేక మంది నిపుణులతో పాటు దేశ వ్యాప్తంగా యువతీ యువకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. వారితో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. వివాహ వయస్సు పెంపు నిర్ణయం యవతపై నేరుగా ప్రభావం చూపుతుంది.

వివాహ వయస్సు పెంపు విషయాన్ని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలను చైతన్య వంతులను చేసే కార్యక్రమాలను రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. అమ్మాయిలకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాల సందర్బంగానే వివాహ వయస్సు తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్దం చేయాలి. బాలికా విద్యను ఉచితవిద్యగా అమలు చేయాలి. ఆడపిల్లలు తల్లిదండ్రలుకు భారం కారని ప్రభుత్వం నిరూపించాలి.