Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మద్యం వ్యాపారులపై కొందరు సార్ ల జులుం..?

నియోజకవర్గాల్లో షాపులు తెరవాలంటే వాటాలు ఇవ్వాలని డిమాండ్

కోట్ల పెట్టుబడి పెట్టాం ..వాటా ఇస్తే నష్టపోతామంటున్న వ్యాపారులు

హైదరాబాద్ లో మద్యం కంపెనీల ప్రతినిధులతోనూ రాయబేరాలు
లిక్కర్ వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పర్సెంటేజ్ లు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…ఇపుడో కొత్త రకం దందా ..!

ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లోని కొందరు ముఖ్య నాయకులు మద్యం అమ్మకాల్లో పర్సెంటేజ్ లు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

లిక్కర్ అమ్మకాల కోసం రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాలకు  ప్రభుత్యం  టెండర్ల ను  పిలుస్తున్నది. మద్యం దుకాణాల కోసం వ్యాపారులు కలిసి సిండికేట్ లు గా మారి 10 నుంచి 100 వరకు టెండర్లు వేశారు .ఒక్కొక్క టెండర్ కు రెండు లక్షలు ఖర్చు చేశారు.కనీసం 20 నుండి 50 మంది కలిసి రెండు లక్షల చొప్పున సుమారు కోటి రూపాయల వరకు టెండర్ల కొరకు డి డి లు తీశారు. ఆ టెండర్ల లో అదృష్టం బాగుండి వచ్చిన 1 లేదా2 దుకాణాలు రావడంతో ఆనంద పడి వ్యాపారం సంతోషంగా చేసుకుందాం అనే సమయం లో కొందరు నాయకులు ఎటువంటి పెట్టుబడి లేకుండా తమకు వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం తో వ్యాపారులు ఒక్కసారిగా అవాక్కు అయినట్లు తెలుస్తోంది. నియోజక వర్గాల్లో ఉన్న కొందరు సీనియర్ ప్రజాప్రతినిధులు వారి కార్యాలయాలో మద్యం టెండర్లు దక్కించుకున్న యజమానులను (సిండికేట్) లను పిలిపించుకొని వారి వ్యాపారంలో వచ్చే లాభాల్లో 20 శాతం వాటాలు మా సార్ కు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాం….
మద్యం కొనుగోళ్ల విషయంలో నియోజకవర్గ కేంద్రంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. మీకు కావలసిన మద్యం మా ద్వారానే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కోమద్యం దుకాణానికి నెలకు 30 వేల రూపాయల చొప్పున ఇస్తాం. మద్యం కంపెనీలు ఇచ్చే కమీషన్ల తో మీకు సంబంధం లేదు. మీకు ఒక వాట్సప్ నెంబరు ఇస్తాం . మీకు కావలసిన మద్యం నిల్వలు ఏమిటో దానికి సమాచారం అందిస్తే చాలు .  డబ్బులు కంపెనీకి డి.డి రూపంలో ఇస్తే మీకు కావలసిన సరుకు వస్తుంది అని చెప్పినట్లు సమాచారం . ఇదే తుది నిర్ణయమని ఎవరికైనా చెప్పినా చెప్పుకోండి. మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బెదిరించినట్లు సమాచారం.
ఒక్కో దుకాణానికి లక్ష నుండి రెండు లక్షల వరకు వసూలు….
ఎక్కువ మద్యం ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్ లు ఒక్కో షాపుకు దాదాపుగా లక్ష నుండి రెండు లక్షల వరకు రావచ్చు. కేవలం 30 వేలు మాత్రమే దుకాణదారులకుఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేయాలని చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని కోసం నియోజకవర్గ హెడ్ కోటర్ లో ఒక కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో నియోజకవర్గానికి లిక్కర్ ద్వారా అన్ని పర్సంటేజీ లతో నెలకు 30 నుంచి 50 లక్షల వరకు వారికి మిగిలేలా ప్లాన్ చేసినట్లు తెలిసిందని కొందరు లిక్కర్ సిండికేట్లు చెబుతున్నారు. లిక్కర్ వ్యాపారులు ఒకరిద్దరు చేసిన హుకూం ను ఎదిరించడానికి ప్రయత్నం చేసిన ఎక్సైజ్ అధికారులతో వారి వ్యాపారాలు జరగకుండా చూసేందుకు సైతం వెనకడుగు వేయబోమని హెచ్చరించినట్లు సమాచారం. మద్యం వ్యాపారాలు పై ఇంత నిరంకుశత్వం దోపిడి మునుపెన్నడూ చూడలేదని ఈ ప్రాంతంలో ఏది చేయాలన్నా కష్టంగా ఉంటుందని వ్యాపారులు ఎవరికి వారే ఎవరికి తమ వ్యధను చెప్పుకో లేక వారిలో వారే ఆవేదన చెందుతున్నారు

ఇరవై శాతం వాటా కోసం పట్టు

మరో రెండు సంవత్సరాల్లోపే శాసన సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి.. ఓటర్లపై డబ్బులు వెదజల్లి… ప్రలోభ పెట్టి.. ఓట్లు కొల్లగొట్టడానికి కొంత మూట కావాలిగా.. అందుకే ఉమ్మడి జిల్లాలోని  అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో డబ్బుల సంపాదనలో పడ్డారు. ఈ మైకంలో వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నామని కించిత్ కూడా భావిస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత రెండేళ్లలో తన నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలలో ఓ సార్ 10శాతం వాటా తీసుకున్నట్లు సమాచారం. కానీ, ఈ సారి అదే సార్  తనకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని మంకుపట్టు పడుతున్నారని కొందరు మద్యం వ్యాపారులు వాపోతున్నారు. ప్రస్తుతం సదరు నియోజకవర్గంలో సగం మద్యం దుకాణాలు కాంగ్రెస్ పార్టీ వారికి, మిగతా సగం టీఆర్ఎస్ వారి చేతుల్లో ఉన్నాయని చెబుతున్నారు. ‘ ఎమ్మార్పీ రేటుకైనా అమ్మకుంటాం కానీ.. ఆ సార్ అడిగిన 20 శాతం వాటాకు ఒప్పుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్యం వ్యాపారులు తెగేసి చెప్పారట.

ఏకంగా .. లిక్కర్ కంపెనీలతోనే డీల్..!

ఇంకో ఆయన  తన నియోజక వర్గంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలకు మద్యం కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ గురించి తానే అన్ని లిక్కర్ కంపెనీలతో మాట్లాడతానని.. ఇక ఈ విషయంలో ఎవరూ తలదూర్చవద్దని హుకుం జారీ చేశారట. అంతటితో ఆగిపోకుండా.. హైదరాబాద్ లో సదరు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కూడా జరిపారని విశ్వసనీయ సమాచారం. తానే ఒక్కో దుకాణానికి నెలకు రూ.40 వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారట. సదరు మీటింగ్ కు హాజరు కాని మద్యం దుకాణ యజమనాలు సదరు సార్  షరతులకు అంగీకరించలేదని.. వారూ తిరగబడి.. అవసరమైతే తాము కూడా ఎమ్మార్పీకే మద్యం అమ్ముతామని అప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారని ఆ నియోజకవర్గంలో చెవులు కొరుక్కుంటున్నారు.

సిండికేట్ అవుతారా..?  మా వాడే క్యాష్ మేనేజ్ మెంట్ చూస్తాడు..!

ఒక  సార్ . ఒకడుగు ముందుకేసి తన అనుచరులతో మద్యం దుకాణం కొనిపించారు. తన ఇలాఖాలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే మా వాడే.. సిండికేట్ క్యాష్ మేనేజ్ మెంట్ సీటులో కూర్చుంటాడని .. కాదూ కూడదు అంటే.. సిండికేట్ ఎలా నడుపుతారో చూస్తానని బహిరంగంగానే తెగేసి చెప్పారని సమాచారం. ఇక్కడా సదరు సార్ కు.. మద్యం దుకాణ యజమానుల నుంచి ఎదురుగాలే వీచిందని వినికిది. ఇలా.. ఓ ముగ్గురు సార్ ల వ్యవహార శైలి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ నియోజకవర్గాల్లో మద్యం వ్యాపారం ఎలా నడపాలో అర్థం కాక సదరు మద్యం దుకాణ యజమానులు ఆందోళన చెందుతున్నారని సమాచారం.