కోహ్లీపై వన్డే, టీ20 కెప్టెన్సీ భారం ఉండదు
కోహ్లీ బ్యాటింగ్‌లో రాణిస్తాడు
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించినా అతని ఆటలో ఎలాంటి మార్పు ఉండదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. బీసీసీఐ నిర్ణయంతో విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పించిన బీసీసీఐ రోహిత్ శర్మను కొత్త సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బీసీసీఐ తీరును తప్పుబడుతుండగా మరికొంతమంది సమర్థిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్‌లో రాణిస్తాడని చెప్పాడు.’సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మపై ఎలాంటి భారం లేదు. అదే తరహాలే ఇప్పుడు కోహ్లీపై వన్డే, టీ20 కెప్టెన్సీ భారం ఉండదు. ఈ నేపథ్యంలో విరాట్ మరింత నైపుణ్యంతో ఆడే అవకాశముంది. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కచ్చితంగా మెరుగైన బ్యాటింగ్ ఫామ్ను కనబరుస్తాడని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఇద్దరు మెరుగైన కెప్టెన్లు భారత జట్టుతో తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. కెప్టెన్సీ పోయినంత మాత్రాన విరాట్ కోహ్లీ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు. కోహ్లీలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తాం’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
విరాట్‌కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం కూడా ఒక విధంగా మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌హాగ్ అన్నాడు. దీంతో అతడు బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల ఆయా సారథులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. ‘కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం అనేది మంచి పరిణామమే అని నేను భావిస్తున్నా. అతడిప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని టెస్టు కెప్టెన్సీపై దృష్టిసారించాలి. ఇప్పుడు టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతల్ని రోహిత్ శర్మ చూసుకుంటాడు. అతడికి నచ్చినట్లు జట్టును ముందుకు తీసుకెళ్తాడు. కోహ్లీ మాత్రం టెస్టులను చూసుకుంటే సరిపోతుంది. దీంతో అతడిపై ఉన్న ఒత్తిడి చాలా వరకు తొలగిపోతుందని అనుకుంటున్నా. ఒక విధంగా ఇది కోహ్లీకే మంచిదని చెప్పొచ్చు.
మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం వల్ల పెరిగే ఒత్తిడి కారణంగా కోహ్లీ కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కచ్చితంగా అతడి ప్రదర్శన మెరుగవుతుంది’అని హగ్ తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు.