వన్డే జట్టులోకి వెంకటేశ్ అయ్యర్!
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ఎప్పికయ్యే అవకాశం?
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు మరో బంపరాఫర్ తగిలే అవకాశం ఉంది. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్ తాజాగా నాలుగో మ్యాచ్‌లో మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. చత్తీస్‌ఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. తాజా ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే టీమ్‌లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ త్వరలో వన్డే జట్టులోనూ ఆడే అవకాశం లభించనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై రాణిస్తే ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే.