Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ధావన్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరం

ధావన్‌పై నమ్మకం ఉంచారు

మాజీ క్రికెటర్లు సబాకరిమ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌

ఖర్‌ధావన్‌ లాంటి ఆటగాడు గాడిలో పడాలంటే ఒక్క ఇన్నింగ్స్‌ చాలని మాజీ క్రికెటర్లు సబాకరిమ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌ అంటున్నారు. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేయకపోవడంపై వారు స్పందించారు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన మాజీ ఆటగాళ్లు ధావన్‌పై నమ్మకం ఉంచారు. ‘జట్టులో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్లు ఎప్పుడు ఫామ్‌ కోల్పోయినా.. వాళ్ల ఆట అలాగే ఉంటుందని నేను భావిస్తా. ఈ క్రమంలోనే ధావన్‌లాంటి ఆటగాడు మళ్లీ పుంజుకోవాలంటే ఒక్క ఇన్నింగ్స్‌ చాలు. కొన్నిసార్లు ఎవరైనా ఫామ్‌ కోల్పోతారు. అది అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా జరిగేదే.

గవాస్కర్‌, మోహిందర్‌ అమర్‌నాథ్‌ లాంటి ఆటగాళ్లే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఉపయోగం ఉండదు. అప్పుడు ఆయా ఆటగాళ్లు వాళ్ల ఆటతీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవసరమైతే కొన్నిరోజులు విశ్రాంతి తీసుకొని.. తర్వాత తిరిగి ఆడాలి’ అని అన్షుమాన్‌ పేర్కొన్నాడు. ధావన్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలాంటి పిచ్‌లపై అతడు కీలక ఆటగాడిగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడని తెలిపాడు. అలాగే ఇంతకుముందు కూడా ధావన్‌ పరుగులు చేయలేక ఇబ్బందులు పడిన సందర్భాల్లో రాణించి తానేంటో నిరూపించుకున్నాడని గుర్తుచేశాడు. ఇక సబాకరిమ్‌ మాట్లాడుతూ.. ధావన్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలో కనీసం కొన్ని మ్యాచ్‌ల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని అన్నాడు.