మనలను ఆదుకునేందుకే భగవంతుడి అవతారం !
తిరుమల,డిసెంబర్13(ఆర్‌ఎన్‌ఎ): మనం ఏర్పర్చుకున్న కర్మ బంధం అనేది ఒక దీపానికి పట్టిన మసి వలే మన అసలు స్థితిని గుర్తించ వీలులేనట్టుగా అంటి ఉంటుంది. మనకంటూ ఒక ఆనంద స్థితి ఉందని మరచిపోయాం. దాని వల్లే ఎన్నో క్లేషాలు పొందుతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని తనంత ఆనంద స్థితికి చేర్చాలని అనుకుంటాడు. మనల్ని ఉద్ధరించడానికై భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. మనం ఉన్న ఈ కలియుగానికి భుజం భుజం రాసుకొనేంత చేరువలో ఉన్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు.
రామావతారంలో మాదిరిగాకాక తను కేవలం మానవుడిని అనే హద్దు అనేది లేకుండా దేవుడిగానే వచ్చాడు శ్రీకృష్ణావతారంలో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు, ఎన్నో ఉపదేశాలు చేసాడు. మనల్ని బాగు చేద్దాం అని కొండంత ఆశతో వచ్చాడు, కానీ మనం మనమే తప్ప మనలో మార్పు అనేది లేదు. ఎండకు ఎండం. వానకు తడవం. గాలికి చెదరం. అట్లాంటి మన ప్రవృత్తికి విసిగి ఉన్న పరమాత్మని మనల్ని ఒక చోటికి చేర్చింది అమ్మ గోదాదేవి. సమస్త వేదాల సారం అని పిలవబడే తిరుప్పావైని భగవంతుణ్ణి చేరే మెట్ల మాదిరిగా అందించింది. ముప్పైపాటల తిరుప్పావైని ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఆమె పాడిన పాటల్లో తను ఉన్నాడు. ఆమె పాటలకు శ్రీరంగనాథుడే చలించి గోదాదేవిని తనవద్దకు రప్పించుకొని వివాహమాడాడు. మనకోసం తనను తానే సమర్పించుకుంది అమ్మ గోదాదేవి. ఆమెను స్వీకరించాడు అంటే, ఆమె మాటలని ఒప్పుకున్నట్లే కదా! ఆమె పాడిన పాటల్ని మనం పాడగలిగితే చాలు.