రాహుల్ అజ్ఞానానికి పరాకాష్ట !
కాంగ్రెస్ ఎంపి రాహుల్‌కు మతి చెడినట్లు ఉంది. రాజకీయ పరిపక్వత లోపించిందని అనిపిస్తోంది. అసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. లేక ఆయన ఓట్ల కోసం ఎలాంటి గడ్డి అయినా తింటాడా అన్న అనుమానం వస్తోంది. తెలియని విషయాల్లో వేలు పెట్టడం తగదని రాహుల్ గుర్తిస్తే మంచిది. రాజకీయాల కోసం ఏదిపడితే అది మాట్లాడడం తగదని కూడా గుర్తించాలి. బిజెపిని హిందుత్వకు ముడిపెడితే మంచిది కాదని ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన సైభలో ఆయనచేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని, హిందూమతాన్ని అవహేళన చేసేలా ఉన్నాయి. ఆయన మాట్లాడిన తీరు దారుణంగా ఉంది. దీనికి కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి.
హిందుత్వపై ఆయన చేసిన వ్యాఖ్యలు భారతీయులను అవమానించేలా ..కాంగ్రెస్ నేతలు ఆయనను నేతగా ఆమోదిస్తు న్నందుకు తలదించుకునేలా ఉన్నాయి. రాహుల్ అపరిపక్వ రాజకీయాలకు..ఆయన అజ్ఞానానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా ఆయన బిజెపిని తిట్టదల్చుకుంటే నేరుగా తిట్టుకోవచ్చు. మోడీని గద్దెదించాలను కున్నా అభ్యంతరం ఉండదు. అలాగే ఆయన మోడీని కూడా రాజకీయంగా తిట్టుకున్నా..గద్దె దింపినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ హిందుత్వకు, హిందువుకు మధ్య చూపిన అంతరంతో భారత ప్రజల మనోభావలను దెబ్బతీసారు.
గాంధీజీ, తాను హిందువులమని.. నాథూరాం గాడ్సే హిందూత్వవాది అని అంటూచేసిన వ్యాఖ్యలపై దేశప్రజలు రాహుల్‌ను నిలదీయాలి.అంటే హిందువులంతా హంతకులని ఆయన అభిప్రాయపడతున్నట్లుగా ఉంది. గాంధీని హిందువుగా పోల్చి తను కూడా ఆ కోవలోకే వస్తానని చెప్పుకోవడం రాహుల్ రాజకీయ దిగజారుడుతనం తప్ప మరోటి కాదు. గాంధీతో పోల్చుకోవడం సిగ్గుచేటు. గతంలో పదేళ్ల పాటు యూపిఎ హయాంలో దేశాన్ని ఏలిన తల్లీకొడుకు, కూతుళ్లు దేశాన్ని భ్రష్టుపరచి…ఇప్పుడు తాము హిందువులమని చెప్పుకోవడం కోసం తహతహలాడడం .. కేవలం ఓట్లవేట తప్ప మరోటి కాదు. ఓట్ల కోసం ఎన్నైనా ఫీట్లు చేయవచ్చు. ఏ గడ్డయినా తినవచ్చు. కానీ హిందూమతం గురించి తెలియకుండా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కోటానుకోట్ల మంది హిందువులను అవమానపరిచేలా ఉన్నాయి.
గాంధీ అంటే హిందువు అని..గాడ్సే అంటే హిందుత్వ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన సంకుచిత రాజకీయ ధోరణిని బయటపెట్టింది. రాహుల్ ఇప్పటికే రాజకీయంగా దేశంలో విఫలమైన నేత. అతడిని నాయకుడిగా అంగీకరించడం లేదని అనేక ఎన్నికల ద్వారా స్పష్టం అయ్యింది. ఈ క్రమంలో అసలు ఈ దేశంలో 2014 నుంచి హిందూత్వవాదుల పాలన సాగుతోందని.. వారిని దించేయా లని.. హిందువుల పాలనను తీసుకురావాలని రాహుల్‌గాంధీ పిలుపునివ్వడం ద్వారా ఆయనకేమైనా మతిభ్రమించిందా అన్న భావన కలుగుతోంది.
నిజానికి ఆయన విమర్శలు చేయాలనుకున్నది బిజెపి పాలనపై. అలా అయితే ఎవరికీ అభ్యంతరం ఉండబోదు. కానీ అలా చేసే క్రమంలో హిందుత్వ గురించి చేసిన వ్యాఖ్యలు క్షంతవ్యం కాదు. ప్రధాని మోదీ, ఆయన స్నేహితులైన ముగ్గురు నలుగురు పారిశ్రామిక వేత్తలు దేశాన్ని నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. ఆయన లక్ష్యం కూడా అదే. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన భారీ కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ..’హిందువు, హిందూత్వవాది అన్న పదాలకు వేర్వేరు అర్థాలున్నాయంటూ బ్రహ్మసూతాలను ప్రవచించిన స్థాయిలో మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అసలైన హిందువు సత్యం కోసం నిరంతరం అన్వేషిస్తాడని.. మహాత్మాగాంధీ మాదిరిగా ఈ అన్వేషణతో తన జీవితమంతా గడుపుతాడని.. హిందూత్వవాది తన జీవితమంతా అధికారం కోసమే గడుపుతాడని చెప్పడమే పెద్ద అజ్ఞానం.
హిందువు సత్యం కోసం చేసే అన్వేషణ హిందుత్వం కిందకే వస్తుంది. గాడ్సే ఘటనను ఆధారం చేసుకుని హిందుత్వ నిర్వచనాన్ని మార్చేసి లబ్ది పొందాలను కోవడం కేవలం ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరోటి కాదు. హిందుత్వ వాది మార్గం సత్తాగ్రప్‌ా.. సత్యాగ్రప్‌ా కాదంటూ విశ్లేషించడం ద్వారా ఆయన మరోమారు రాజకీయంగా తన అజ్ఞాన్ని బయట పెట్టుకున్నారు. హిందువు భయాలను ఎదుర్కొంటాడట. భయం హిందూత్వవాదిని పతనం చేస్తుందట. అదే భయం అతడి హృదయంలో విద్వేషాన్ని సృష్టిస్తుందట. హిందువు గుండె మాత్రం ప్రేమ, దృఢత్వంతో నిండి ఉంటుందని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన హిందుత్వ గురించి ఏం చెప్పదల్చుకున్నారో చర్చకు నిలబడాలి. కాంగ్రెస్ వాదులు దీనిని ఎలా సమర్థిస్తారో చెప్పాలి. తాను హిందువునని.. హిందూత్వవాదిని కానని చెప్పడం కేవలం అల్పసంఖ్యాక వర్గాల ఓట్లు దండుకునే యత్నమే తప్ప మరోటి కాదు.
ఈ దేశం హిందువులదే కానీ హిందుత్వవాదులది కాదని కూడా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనకున్న అపరిపక్వ పరిజ్ఞానంతో వ్యాఖ్యానించారు. హిందుత్వ వాదులకు అధికారం మాత్రమే కావాలని, అధికారం కోసం వారు ఏమైనా చేస్తారన్నారని ఆరోపించారు. అందరినీ గౌరవిస్తూ, ఎవరికీ భయపడకుండా, అన్ని మతాల ను గౌరవించేవారే హిందువులని రాహుల్ సూత్రీకరించారు. నిజానికి మోడీని విమర్శించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువులను అవమానించేలా ఉన్నాయి. ఇవే వ్యాఖ్యలు ఇతర మతాల వారిపై చేసి వ్యాఖ్యానించి ఉంటే అయన పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.
హిందువులు విని వాడో అజ్ఞాని అని ఊరుకుంటారని తెలిసే రాహుల్ ఈ సాహసం చేసి ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది అన్న రెండు పదాల మధ్య పోటీ నడుస్తోందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని చెప్పారు. హిందుత్వ వాదులకు సత్యాగ్రహం అంటే పట్టదని, వాళ్లకు కేవలం అధికారమే కావాలని, దాని కోసం ఏం చేయడాని కైనా వెనుకాడరని చెప్పడం ద్వారా కోట్లాది హిందుత్వ వాదులను ఘోరంగా అవమానించారు. రాహుల్ రాజకీయాలను మిగతా పార్టీలు ఎండగట్టాలి.అప్పుడే ఆయనకు విషయమేమిటో తెలుస్తుంది.