Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రావత్‌ మరణంపై నోరు పారేసుకున్న చైనా

హెలికాప్టర్‌ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలు
భారత్‌కు రక్షణ సన్నద్దత లేదంటూ అవాకులు చవాకులు
చైనా కనీస మానవత్వం మర్చిపోయి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించవలసిన సందర్భంలో అవాకులు చవాకులు పేలింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంపై ఎగతాళి వ్యాఖ్యలు చేస్తోంది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. జనరల్‌ రావత్‌ మరణం వల్ల భారతదేశ సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొంది. చైనాలోని నిపుణులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ టైమ్స్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. క్రమశిక్షణరాహిత్య సంస్కృతికి భారతీయ సైన్యం పెట్టింది పేరు అని ఎగతాళి చేసింది. ప్రామాణిక నిర్వహణ విధానాలను, నిబంధనలను భారతీయ దళాలు తరచూ పాటించబోవని పేర్కొంది. 2013లో ఓ జలాంతర్గామిలో పేలుడు జరిగిందని, 2019లో ఓ విమాన వాహక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించిందని, వీటన్నిటికీ కారణాలు మానవ తప్పిదాలేనని వ్యాఖ్యానించింది.

జనరల్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం నివారించదగినదేనని చెప్తూ, వాతావరణం మెరుగయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేయడం, పైలట్‌ మరింత నైపుణ్యంతో, జాగ్రత్తగా నడపటం, గ్రౌండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వంటివాటిలో ఏది జరిగినా, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పేర్కొంది. ఈ ప్రమాదం వల్ల భారత సైన్యానికి పోరాట సన్నద్ధత లేదని మరోసారి తేటతెల్లమైందని పేర్కొంది. చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేసే అత్యున్నత స్థాయి భారతీయ నేత మరణించినప్పటికీ, చైనా పట్ల భారత దేశ దూకుడు వైఖరి మారే అవకాశం లేదని చైనా విశ్లేషకులు చెప్తున్నారని పేర్కొంది.

భారతీయ విూడియా చెప్తున్న కారణాలను పరిశీలించినపుడు ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని వెల్లడవుతోందని పేర్కొంది. రష్యాలో తయారైన ఎంఐ`17 సిరీస్‌ హెలికాప్టర్లను ఇతర దేశాల్లో కూడా విస్తృతంగా వాడుతున్నారని గుర్తు చేసింది. ఈ సాధారణ సమస్య యావత్తు భారత సైన్యానికి ఉందని, చైనా`భారత్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైన్యానికి కూడా ఇదే సమస్య ఉందని వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లోని సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉంటుందని, నిజంగా పోరాటం ప్రారంభమైతే చైనా సైన్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండబోదని పేర్కొంది. భారత సైన్యం, నావికా దళం, వాయు సేన మధ్య వైరుద్ద్యాలను తొలగించడం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి జనరల్‌ రావత్‌ను సీడీఎస్‌గా భారత ప్రభుత్వం నియమించిందని పేర్కొంది.

సైన్యాన్ని ఆధునికీకరించేందుకు ఈ మూడు దళాలను సమైక్యపరడం సీడీఎస్‌ లక్ష్యమని తెలిపింది. జనరల్‌ రావత్‌ మరణం వల్ల భారత సైన్యం ఆధునికీకరణ ప్రణాళిక అస్తవ్యస్తమైపోయిందని వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా, చైనాకు తైవాన్‌, భారత దేశాలతో ఘర్షణ, వివాదాలు ఉన్నాయి. జనరల్‌ రావత్‌ మాదిరిగానే తైవాన్‌ మిలిటరీ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్‌ షెన్‌ యి`మింగ్‌ (62) కూడా గత ఏడాది జనవరిలో హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యూహెచ్‌`60ఎం హెలికాప్టర్‌ బయల్దేరిన కాసేపటికే న్యూ తైపేయి సిటీ సవిూపంలో రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. ఈ హెలికాప్టర్లో సిబ్బందితో సహా 13 మంది ప్రయాణించారు. ఫెన్‌, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.