మన సేనానికి ఇచ్చే గౌరవం ఇదేనా ? 

భారత త్రిదళ సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌ దుర్మరణం చెందితే మనం ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ఆందోళన, ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ తొలుస్తోంది. దేశంలో అత్యున్నత పదవి కలిగిన త్రివిధ దళాధిపతి, మరికొందరు సైనికాధికారులు మృత్యువాత పడితే వారికి ఇచ్చే గౌరవం ఎలా ఉండాలో ఇప్పుడు మనం చర్చించాలి. వారి గురించి దేశం యావత్తూ కన్నీరు కారుస్తోంది. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం పెద్దగా పట్టింపు ఉన్నట్లుగా కానరావడం లేదు. పార్లమెంట్‌లో కనీసం సమగ్ర చర్చ చేయలేక పోయింది. అలాగే ఆయన మరణానికి సంతాప సూచకంగా సభ వాయిదా పడలేదు. మొక్కుబడిగా సంతాప ప్రకటన చేయడం.. అర నిముషం మౌనం పాటించడం..తిరిగి సభా కార్యక్రమాలను కొనసాగించడం ..అన్నవి ఎక్కడి సంప్రదాయమో అర్థం కావడం లేదు.

ఇలాగేనే మన సర్వసన్నాహక సత్తా కలిగిన సైన్యాధ్యక్షుడికి ఇచ్చే గౌరవం. ఇలాగేనా జాతి ఆయనకు నివాళి అర్పించే విధానం.. నిజానికి పార్లమెంట్‌ జరుగుతున్న వేళ బుధవారమే ప్రమాదం జరిగింది. అప్పటికే ఆయన మరణించినట్లు తెలుసు. ఆనాడు కూడా వెంటనే పార్లమెంటును వాయిదా వేయలేదు. అలాగే పార్లమెంటులో కనీసం ప్రమాద ఘటనపై ప్రకటనా చేయలేదు. త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక..మరికొందరు ఉన్నతస్థాయి సైనికాధి కారులు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణిస్తే జాతి స్పందించాల్సిన తీరు ఇదేనా అన్న భావన కలుగుతోంది. పార్లమెంటులో గురువారం కేవలం ఓ ప్రకటన చేశారు. దానిపై కనీస చర్చా జరగలేదు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దేశం ఆయన గురించి తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు.

రాజ్యసభలో చర్చించడానికి అవకాశం కూడా ఇవ్వలేదని విపక్షనేత మల్లికార్జున ఖర్గే కూడా ఆవేదన చెందారు. రావత్‌ గురించి..ఆయన ప్రస్థానం గురించి..అలాగే ప్రమాదంలో మరణించిన మిగతా అధికారుల గురించి చర్చకు అవకాశం లేకుండా పార్లమెంట్‌ ఉభయ సభల్లో మొక్కుబడి తంతు ముగించిన తీరు పాలకుల దౌర్భాగ్యానికి నిదర్శనంగా చూడాలి. జాతిని ఇంతగా బాధించిన ఘటనపై ఇదేనా స్పందన.. పార్లమెంటులో కనీసం ప్రధాని మోడీ ప్రకటన చేయలేదు. ఆయన సభలో చర్చించి ఉంటే బాగుండేది. విపక్షాలు కూడా దీనిని ఎత్తిచూపలేదు. మరోవైపే హెలికాప్టర్‌ ప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఈ విషాదానికి కారణ మేంటనే ప్రశ్న ప్రతి పౌరుడినీ వేధిస్తోంది. మహా దళాధిపతి బిపిన్‌ రావత్‌ దంపతులు సహా పలువురు రక్షణ సిబ్బందిని బలి తీసుకున్న ప్రమాదంపై కేంద్రం త్రివిధ దళాల బృందంతో విచారణకు ఆదేశించింది.

అమరులైన 13 మంది భౌతిక కాయాలను తొలుత సూలూరు ఎయిర్‌బేస్‌కు తరలించారు. వీరులకు వందనం.. భారత్‌ మాతాకు జై’ అని తమిళులు నినదించారు. దారిపొడవునా పూలుచల్లి తమ భక్తిని చాటారు. నిజంగా తమిళ ప్రజలను అభినందించాలి. సూలూరు నుంచి భౌతిక కాయాలను ఢల్లీికి తరలిం చారు. అక్కడ ప్రధాని సహా పలువురు ప్రభుత్వ పెద్దలు అమరులకు నివాళులర్పించారు. ఇంతవరకు మాత్రమే జరిగింది. రక్షణ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ను బలిగొన్న సైనిక హెలికాప్టర్‌ దుర్ఘటనపై త్రివిధ దళాల బృందంతో విచారణకు ఆదేశించినట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. తమిళనాడు లోని నీలగిరి పర్వతాల్లో ఆర్మీ హెలికాప్టర్‌ కూలి జనరల్‌ రావత్‌, ఆయన భార్య మధూలిక సహా 13 మంది దుర్మరణం పాలైన ఘటన వివరాలను రక్షణమంత్రి గురువారం పార్లమెంటుకు నివేదించారు. పూర్తి సైనిక లాంఛనాలతో రావత్‌ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. చనిపోయిన మిగతా మిలిటరీ సిబ్బందికి కూడా తగు మిలిటరీ గౌరవాలతో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

నిజానికి ఈ విషయంలో రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించినా ప్రధాని సభలో లేకపోవడం అత్యంత విషాదకరం. రావత్‌ పుట్టుపూర్వోత్తరాలు..ఆయన ప్రస్థానం, దేశానికి, సైన్యానికి చేసిన సేవలను పార్లమెంటులో చర్చించి ఉంటే బాగుండేది. పార్లమెంట్‌ సభ్యలుంతా చర్చింది సభనుమరునాటికి వాయిదా వేసి ఉంటే మరీ బాగుండేది. కానీ ఉభయసభల్లోనూ మొక్కుబడి ప్రకటనచేసి..మమ అనిపించిన తీరు బాధ కలిగించక మానదు. దేశం కోసం శ్రమించిన వీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్న భావన కలుగుతోంది. అలాగే వెంటనే పార్లమెంట్‌ కార్యకలాపాలు కొనసాగిం చారు. ఒక్కరోజు సభ జరగకుంటే కొంపలు మునిగేవి కావు. చనిపోయినవారిలో జనరల్‌ రావత్‌, ఆయన భార్య మధూలిక రావత్‌, ఆయన రక్షణ సలహాదారు బ్రిగేడి యర్‌ లఖ్బీందర్‌సింగ్‌ లిద్దర్‌, స్టాఫ్‌ ఆఫీసర్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ హర్జీందర్‌సింగ్‌, వాయుసేన హెలికాప్టర్‌ సిబ్బంది సహా మరో 9 మంది రక్షణ బలగాల సిబ్బంది ఉన్నారు. వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. లైఫ్‌ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్న ఆయన ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధురి బుధవారమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిని కూడా సందర్శించి పరిస్థితిని సవిూక్షించారు.

ఈ దుర్ఘటనపై త్రివిధ దళాల బృందంతో ఎంక్వైరీకి వాయుసేన ఆదేశించింది. విచారణ బృందం బుధవారమే అక్కడకు చేరుకుని తమ పని ప్రారంభించిందని రాజ్‌నాథ్‌ తొలుత లోక్‌సభలో ప్రకటన చేశారు. అనంతరం ఇదే ప్రకటనను రాజ్యసభలోనూ చదివారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన ఉన్నతి గురించి చర్చించే అవకాశం విపక్షాలకు కూడా ఇవ్వలేదు. రావత్‌ దంపతులు, ఇతర అమరులకు ఉభయ సభలూ ఘననివాళులు అర్పించాయి. వారి గౌరవార్థం నిమిషం పాటు మౌనం పాటించాయు.

అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభలో మాట్లాడుతూ.. జనరల్‌ రావత్‌ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప యుద్ధనిపుణుడిని, అద్భుత వ్యూహకర్తను, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పో యిందని తెలిపారు. జనరల్‌ రావత్‌ అసాధారణ, ప్రతిభావంతుడైన సైనిక నాయకుడని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల మిలిటరీ కెరీర్‌లో ఎన్నో కీలక పదవులు నిర్వహించి.. అత్యున్నతమైన రక్షణ బలగాల తొలి చీఫ్‌గా నియమితులయ్యారని తెలిపారు. గత రెండేళ్లలో భారత భద్రతా వ్యవస్థలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించారని మాత్రమే కొనియాడారు. ఓ వ్యక్తిగా దేశం, బలగాల పట్ల ఆయన అంకిత భావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని అంటూ ముగించారు. అనంతరం సభ యధావిధిగా సాగింది. సభా సమావేశాలు సాగుతున్న వేళ ఇంతకన్నా ఘనంగా రావత్‌ తదితరులకు నివాళి అర్పించివుంటే బాగుండేది. దేశవ్యాప్తంగా ఆయనకు నివాళిగా సభలూ సమావేశాలు,సంతాప కార్యక్రమాలు చేపట్టి ఉంటే యోధులను స్మరించుకునే అవకాశం ఏర్పడేది. అధికారంలో బిజెపి ఉన్నా అలాంటి అవకాశం రాకపోవడం దేశ ప్రజల దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు.