Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిపిన్‌ రావత్‌ మంచి వ్యూహకర్త

సరిహద్దుల్లో పనిచేయడం వల్ల అనుభవాలు

 శతృదేశాల కుట్రలను పసిగట్టడంలో దిట్ట

ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టించిన దిట్ట

ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం…తను తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా జనరల్‌ బిపిన్‌ రావత్‌ అత్యున్నత సైనికాధికారిగా ఎదిగారు. మనసులో మాట కఠినంగా చెప్పడం ద్వారా రావత్‌ పలుమార్లు విమర్శలకు గురయ్యారు. ఆర్మీచీఫ్‌గా ఉన్నప్పుడే ఆయన పాలకపక్షం మనసెరిగి మాట్లాడుతు న్నారన్న విమర్శలకు గురయ్యారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలను తప్పు బట్టారు. ఆ తరువాత కశ్మీర్‌లో రాళ్ళురువ్వే పిల్లలపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు కూడా వివాదాస్పద మైనాయి. వాటన్నింటినీ అటుంచితే, సైనికుడి నుంచి మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారివరకూ అందరి తోనూ సఖ్యతగా ఉంటూ వారిని ఉత్సాహపరచే బిపిన్‌ రావత్‌ మంచి వ్యూహకర్తగా పేరు సంపాదించారు. కెరీర్‌లో ఆయన ఎక్కువగా చైనా సరిహద్దుల్లో, జమ్మూకశ్మీర్లోనే పనిచేయడం కారణంగా సరిహద్దు దేశాల కుట్రలను బాగా పసిగట్టగలిగే అవకాశం ఏర్పడిరది.

2016లో నియంత్రణ రేఖను దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం చొరబడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయాలన్న వ్యూహాన్ని రూపొందించిన వారిలో రావత్‌ కూడా ఉన్నారు. సదరు ఆపరేషన్‌ను ఆయనే పర్యవేక్షించారు. అలాగే 2019 ఫిబ్రవరిలో భారత యుద్ధవిమానాలు పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహమ్మద్‌ శిక్షణ శిబిరాన్ని కూల్చివేయడం లోనూ ఆయనదే కీలక పాత్ర. డిల్లీ లోని రక్షణ కార్యాలయంలో ఉండి ఈ దాడిని పర్యవేక్షించారు. ఈ దాడి తర్వాత ఆయన పేరు దేశమంతా మార్మోగింది.

మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందాక.. ఆయన 19వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ (ఉరి) జనరల్‌ ఆఫీసర్‌ కమాండిరగ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి 1న సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండిరగ్‌`ఇన్‌`చీఫ్‌ పదవి చేపట్టారు. తర్వాత ఏడునెలలకే సెప్టెంబరు 1న ఆర్మీ వైస్‌చీఫ్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది డిసెంబరు 17న భారత ప్రభుత్వం రావత్‌ కంటే సీనియర్ల యిన లెప్టినెంట్‌ జనరళ్లు ప్రవీణ్‌ బక్షీ, పీఎం హారిజ్‌లను కాదని.. ఆయన్ను 27వ ఆర్మీచీఫ్‌గా నియమిం చింది. ఇదంతా కూడా ఆయన శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. సైనిక దళాల ప్రధాన అధిపతిగా ఆయన ఆ ఏడాది డిసెంబరు 31న నాటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌సింగ్‌ సుహాగ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గూర్ఖా బ్రిగేడ్‌ నుంచి ఈ అత్యన్నత పదవి చేపట్టిన మూడో వ్యక్తి రావత్‌. ఆయనకు ముందు జనరల్‌ సుహాగ్‌, శామ్‌ మానెక్‌ షా మాత్రమే ఆర్మీ చీఫ్‌ అయ్యారు.

2019 డిసెంబరు 31న కేంద్రం ఆయన్ను మొట్టమొదటి మహాదళాధిపతిగా నియమించింది. డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ కాంగోలో వివిధ దేశాల సైనికులతో కూడిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో ఆయన లీడర్‌గా పనిచేసి తన సమర్థతను చాటారు. కాంగోలో ఐరాస శాంతి పరిరక్షక దళంలో రావత్‌ కీలక పాత్ర పోషించారు. ప్రాంతీయ రాజధాని ఉత్తర కివులో మోహరించిన రెండు వారాల్లోనే తన యుద్ధ నైపుణ్యాన్ని చాటారు. రెబెల్స్‌కు మద్దతివ్వ కుండా స్థానికుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన నాలుగు నెలల అవిశ్రాంత పోరాటం ఫలించింది. కాంగో సుస్థిరత సాధించింది. తిరుగుబాటుదారులు ఆయుధాలు వదిలేశారు. వారిని సైన్యంలో చేరేందుకు అంగీకరింపజేయడంలో రావత్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యానికి మెచ్చి.. ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధులు, ఐరాస మిషన్ల ఫోర్స్‌ కమాండర్లకు సంబంధించిన శాంతిపరిరక్షక దళం తీరుతెన్నులపై చార్టర్‌ను సవరించే బాధ్యతలను 2009 మే 16న లండన్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఐరాస అప్పగించింది.

అలాగే.. ఈశాన్య భారతంలో ఉగ్రవాదం నియంత్రణలో రావత్‌ది కీలక పాత్ర. మణిపూర్‌లో 2015 జూన్‌లో ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడిచేశారు. ఈ సందర్భంగా 18 మంది జవాన్లు అమరులయ్యారు. అప్పుడు రావత్‌ సారథ్యంలో పారాచూట్‌ రెజిమెంట్‌ 21వ బెటాలియన్‌ మియన్మార్‌ సరిహద్దుల్లోని ఎన్‌ఎస్‌సీఎన్‌`కే స్థావరంపై మెరుపుదాడులు చేసి నేలమట్టం చేసింది. ఇరవై మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 39 ఏళ్ల సైనిక కెరీర్‌లో రావత్‌ ఎన్నో సాహస, ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పథకం , ఉత్తమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం , యుద్ధ సేవా పతకం, సేనా పతకం, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ప్రశంసాపత్రాలు రెండు సార్లు, ఆర్మీ కమాండర్‌ ప్రశంసాపత్రం లభించాయి.