అత్యుత్తమ కెప్టెన్‌ కోహ్లీ: పఠాన్‌ కితాబు

భారత జట్టుకు దక్కిన అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటూ కితాబిచ్చాడు మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 1`0తో కైవసం చేసుకున్న సందర్భంగా పఠాన్‌ మాట్లాడాడు. అత్యధిక విజయాలు సాధించిన భారత టెస్టు కెప్టెన్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ’ఈ జాబితాలో 59.09 శాతంతో కోహ్లీ తొలి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో ఉన్న కెప్టెన్‌ విజయాల శాతం 45 శాతమే’ అని పఠాన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ క్రమంలోనే అత్యుత్తమ భారత టెస్టు కెప్టెన్‌ అతనేనని కితాబిచ్చాడు. కాగా, న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఏకంగా 372 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.