హనుమ విహారికి అవకాశం దక్కేనా ?

న్యూజిల్యాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టులో చేరాల్సిన బ్యాటర్‌ హనుమ విహారి.. ఇండియా ఎ తరఫున సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. కేఎల్‌ రాహుల్‌ గాయం ప్రకటన ఒక్క రోజు ముందుగా వస్తే.. అతని స్థానంలో భారత జట్టులో విహారినే చేరేవాడేమో. కానీ అతన్ని ఇండియా ఎ జట్టు కోసం ఎంపిక చేసిన తర్వాత రాహుల్‌ గాయం తెరవిూదకొచ్చింది. దీంతో రాహుల్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయతే అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అయ్యర్‌.. కాన్పూర్‌ టెస్టులో అదరగొట్టి ’మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికా టూర్‌కు హనుమ విహారిని ఎంపిక చేస్తారా? చేస్తే అతను ఎవరి స్థానంలో ఆడే అవకాశం ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై వికెట్‌ కీపింగ్‌ బ్యాటర్‌ దినేష్‌ కార్తీక్‌ స్పందించాడు. భారత జట్టులో ప్రస్తుతం విహారికి చోటు లేకపోవచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ’రాహుల్‌, రోహిత్‌, మయాంక్‌తో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. ఆ తర్వాత పుజారా, కోహ్లీ, రహానే, గిల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు మిడిలార్డర్‌ బ్యాటర్లు. ఇక విహారికి స్థానం ఏది?’ అని కార్తీక్‌ ప్రశ్నించాడు. రహానేకు ఆడే పదకొండు మందిలో చోటు ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ.. ద్రవిడ్‌ కొత్తగా ప్రయోగాలు చేస్తాడని తాను అనుకోవడం లేదని కార్తీక్‌ అన్నాడు. ఇంతకాలం సక్సెస్‌ఫుల్‌గా ఫలితాలు అందించిన జట్టునే ద్రవిడ్‌ కోరుకునే అవకాశం ఉంటుందని, మహా అయితే ఏదో ఒక్క కొత్త ఆటగాడికి చోటు దక్కొచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, న్యూజిల్యాండ్‌ టెస్టులకు తనను ఎంపిక చేయకపోవడంతో ట్విట్టర్‌లో హనుమ విహారి స్పందించిన సంగతి తెలిసిందే. అతను పెట్టిన క్రిప్టిక్‌ ట్వీట్‌ కొన్ని రోజుల క్రితం బాగా వైరల్‌ అయింది.