‘భీమ్లానాయక్’లో బ్రహ్మానందం

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లానాయక్. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. నిత్యావిూనన్, సంయుక్త విూనన్ కథానాయికలుగా నటిస్తుండగా.. మురళీ శర్మ, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రను కామెడీ కింగ్ బ్రహ్మానందం చేయబోతుండడం విశేషంగా మారింది. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ’ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్‌కు గెస్ట్ గా వచ్చిన బ్రహ్మానందం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సూపర్ హిట్ మలయాళ చిత్రానికి ఈ సినిమా అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో ఎలాంటి కామెడీ కేరక్టర్స్ ఉండవు. సినిమా అంతా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. మరి తెలుగు వెర్షన్ లో బ్రహ్మానందం చేసిన పాత్ర ఏంటనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తుండడంతో.. ఇందులో బ్రహ్మీ కోసం ఆయన ప్రత్యేకించి ఓ పాత్రను క్రియేట్ చేసి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అలాగే.. బ్రహ్మీ కోసం త్రివిక్రమ్ సీరియస్ పాత్రనే డిజైన్ చేసి ఉండవచ్చని కూడా ఊహిస్తున్నారు.