ఎర్ర టోపీలతో యూపికి డేంజరన్ బెల్స్..ప్రధాని మోడీ
వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం
వారు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు దగ్గరవుతారు
ఎస్పీ నేతలపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ
గోరఖ్‌పూర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు మోడీ శ్రీకారం
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎర్రటోపీలు ఎదురుచూస్తున్నాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులతో దోస్తీ చేస్తారని, ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడిచిపెడుతారని ఆరోపించారు.
ఎర్రటోపీలే యూపీకి రెడ్ అలర్ట్ అని, ప్రమాద ఘంటికలని ప్రధాని విమర్శించారు. ఎర్రటోపీలు అధికారంలోకి వస్తే ఎర్రబుగ్గలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని బుగ్గకార్లలో తిరిగే రాజకీయ నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల సమస్యలు, బాధలు వారికి పట్టవని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడటానికి, ఖజానా నింపుకోవడానికి, దొరికింది దోచుకోవడానికి, మాఫియా శక్తులకు స్వేచ్ఛనివ్వడానికే సమాజ్‌వాది పార్టీ అధికారంపై కన్నేసిందని ఆరోపించారు.సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ వంటివని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు.
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోందని, ఉగ్రవాదుల పట్ల అలసత్వం ప్రదర్శించడానికి ఆ పార్టీ ఇలా కోరుకుంటోందని చెప్పారు. ఎర్రటోపీలు యూపీకి రెడ్ అలర్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారు ప్రమాద ఘంటికలు మోగిస్తారని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండం ద్వారా జోడు ఇంజన్ల ప్రభుత్వంతో అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రధాని మోడీ అన్నారు. గోరఖ్‌పూర్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులే ’నవీన భారతం’నిర్మాణం ఏమాత్రం అసాధ్యం కాదనే విషయాన్ని చాటుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజక వర్గమైన గోరఖ్‌పూర్‌లో రూ.10,000 కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారం నాడు ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్`రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎంఆర్`ఆర్‌ఎంఆర్‌సీ) కు చెందిన హై`టెక్ ల్యాబ్‌ను ప్రధాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గోరఖ్‌పూర్‌లో ఎరువుల ప్లాంట్, ఎయిమ్స్ ప్రారంభం కావడం ఎన్నో సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకువెళ్తుం దన్నారు. యూపీ అభివృద్ధిలో యోగి ఆదిత్యనాథ్ పాత్రను ప్రధాని మోదీ ప్రశంసిచారు. ఆరోగ్య సేవలనేవి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఆ దిశంగా యోగి సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. గతంలో గోరఖ్‌పూర్‌లో మెదడువాపు పేషెంట్ల శాంపుల్స్ సైతం పుణెకు పంపాల్సి వచ్చేదని, ఫలితాలు వచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోవడంతో, పక్షవాతం బారిన పడటమో జరిగేదని అన్నారు.
ఈరోజు కరోనా వైరస్, మెదడువాపు, ఇతర వ్యాధుల పరీక్షలు గోరఖ్‌పూర్‌ని ప్రాంతీయ వైరల్ రీసెర్చ్ సెంటర్‌లోనే చేయించు కోవచ్చని చెప్పారు. 2014కు ముందు యూరియా కొరత అనేది పతాక శీర్షికల్లో కనిపించేదదని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిరదని చెప్పారు. యూరియా దుర్వినియోగం అరికట్టామని, కోట్లాది మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజల ఆకాంక్ష దీనితో నెరవేరిందని, 1990లో మూతపడిన ఫ్యాక్టరీని 2014 వరకూ తిరిగి ప్రారంభించేందుకు ఎవరూ సాహసం చేయలేదని, బీజేపీకే అది చెల్లిందని పేర్కొన్నారు.