సిరివెన్నెలను పంచిన కలం యోధుడు

సీతారామశాస్త్రి అస్తమయం
కిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
అపారమైన భాషా పాండిత్య స్రష్టగా పేరు
వేటూరి తరవాత అంతటి గొప్ప గేయరచయిత
తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన మరణవార్త
జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..అన్న సీతారామాశాస్త్రి కలం వాలిపోయింది. ఇక పాటలను విూకందించలేను..ఉన్నపాటలతోనే ఆస్వాదించుకోండి అంటూ ..ఈ కరోనాకష్టాలను ఇక నేను చూడలేను అన్నట్లుగా ..తన రచనలకు గాత్రం అందించిన మన ఎస్పీని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. శ్రీవారి సేవలో అలసరించి గుండెపోటుతో హఠాన్మరణంచెందిన డాలర్ శేషాద్రి మరణానికి మరుసటి రోజే ఈ ఘటన జరగడం తెలుగు వారికి కోలుకోలేని దెబ్బ.
ఎన్నో మంచి పాటలతో మన హృదయాలను కదలించిన అమోఘ భాషా శక్తిని ఇక మనకు మిగిల్చి తను దారి వెతుక్కుంటూ పోయారు. నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని లోకాన్ని అంటూ నినదించిన ఆయన కలం ఆగింది. ఆనాటి కవులకు..ఈ నాటి కవులకు అందనంతగా ఆయన భాషా సాహిత్యం సాగిందనడంలో సందేహం లేదు. సముద్రమంత లోతైన తత్వాన్ని.. ఆకాశమంత భావాన్నీ.. అతి తక్కు పదాల్లో …రంగరించి మనకందించిన మహాకవిగా మనకు సుపరిచితుడు. సామాన్య భావమైనా అనంత పదభూయిష్టమైన పాటలైనా ఆయన కలంలో జాలువారేవి. ఆయన కలం నుంచి ఆలోచింపజేసే పాటలు ఆవిర్భించారు.
సిరివెన్నెల చిత్రంతో కలానికి సానపెట్టిన సీతారామశాస్త్రి పాటల రచయితగా మన నిత్యజీవితంలో పరిచయమున్న మన నిత్య బంధువు. జగమంత కుటుంబం అని రాసినా… నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని అని ఆక్రోశించినా అది ఆయనకే సొంతం. ఒకప్పుడు బలపం పట్టి భామ ఒళ్లో అనే పాట రాసిన ఆయన ఈ తరం సినిమాలకు అవసరమైన అనేక పాటలురాసి మనహృదయాలను కదిలించారు. ఇంతటి సాహితీ వారసత్వాన్నిమనకు పాటల రూపంలో అందించి..అవి విని ఆనందించే అదృష్టం కలిగించిన అపర సరస్వతీ పుత్రుడు..ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆయన 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
చెంబోలు సీతారామశాస్త్రిగా ఆయనెవరికీ తెలియదు. కానీ సిరివెన్నలగా చిత్రప్రసిద్దుడు. 1955 మే 20న అనకాపల్లిలో జన్మించిన ఆయన 1986లో గేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన సాహిత్యం అందించిన తొలి చిత్రం ’సిరివెన్నెల’. అందులో అన్ని పాటలు రాసింది ఆయనే! ’సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భార్రతికి లోనైంది. ఇటీవల అస్వస్థతకు గురైన ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక కోలుకుని మరింత పదునైన పాటలను మనకు అందిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిల్చారు. ఇలా సంగీత సినీ వినీలాకాశంలో మూడున్నర దశాబ్దాలపైగా వేలాది పాటలు రాసిన కలం మూగబోయింది. వేటూరి సుందర రామ్మూర్తి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటకు గౌరవం తీసుకొచ్చిన కవి సీతారామశాస్త్రి. అత్యంత సరళమైన పదాలతో వాడుకభాషలో ఈయన రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచి పోయాయి. ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏవిూ లేదని.. త్వరగానే కోరుకుంటున్నారని రెండు రోజుల కింద కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి సిరివెన్నెల ఆరోగ్య ఒక్కసారిగా విషమించింది. వైద్య బృందం ప్రతిక్షణం ఆయనను కాపాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆయన కోలుకోవాలని అభిమానుల దేవుడిని ప్రార్థించినా కూడా కనికరించలేదు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కిమ్స్ హాస్పిటల్ కు బయల్దేరారు. ప్రస్తుతం అక్కడ గంభీరమైన వాతావరణం ఉంది. ఎలాగైనా ఆయన కోలుకొని రావాలని కోట్లాది మంది చేసిన ప్రార్థనలు వృధా అయిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి సీవీ యోగి వేదపండితుడు, తల్లి అమ్మాజి గృహిణి. సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.
1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసే అవకాశం సీతారామశాస్త్రికి దక్కింది. ఆ సమయంలో సీతారామశాస్త్రిని ప్రతిభను కె.విశ్వనాథ్ గుర్తించారు. ఆయన చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అలా తొలిసారి సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని సీతారామశాస్త్రి దక్కించుకున్నారు. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి. దీంతో ఆ సినిమా పేరే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారింది. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో సిరివెన్నెల మూడు వేలకు పైగా పాటలు రాశారు. విధాత తలపున ప్రభవించినది.. సిరివెన్నెల రాసిన తొలి పాట. చివరిసారిగా.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాట రాశారు. సినీ సాహిత్యరంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన సినీ కెరీర్‌లో మొత్తం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.