Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హిందూ ఉగ్రవాదం పేరుతో లెఫ్ట్‌ ఆత్మవంచన

ఇస్లామిక్‌ ఉగ్రవాద చర్యలపై ఉదారవాదం

ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో తీవ్ర వైఫల్యం

విపక్షాల ఐక్యత సాధనలోనూ కానరాని యత్నాలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతుల్లో కేంద్రం కీలుబొమ్మగా మారిందనీ.. మోదీ సర్కారు నియంతృత్వ విధానాలను అవలంబిస్తోందని వామపక్ష నేతలు దుయ్యబడుతున్న తీరు విమర్శలకు గురవుతోంది. కేవలం హిందువలను మాత్రమే మతోన్మాదులుగా చూస్తున్న దుస్థితోల లెఫ్ట్‌ నేతలు ఉన్నారు. అయితే మతోన్మాదం విషయంలో లెఫ్ట్‌ రెండు నాల్కల ధోరణితో ఉంది. హిందువులు ఏదైనా చేస్తే దానిని తీవ్రంగా పరిగణించి హిందూ మతోన్మాదం అన్న ముద్ర వేస్తున్నారు. ఈ జాడ్యం నుంచి వారు బయటపడక పోవడంతో హిందువుల్లో లెఫ్ట్‌ పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ టెర్రరిజం విషయంలో కఠినంగా లెఫ్ట్‌ ఉండలేక పోతోంది. మతోన్మాద రాజకీయాలను భాజపా సర్కారు ప్రోత్సహిస్తోందని.. మహిళలు, దళితులు, మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని అంటున్న వారు ఐఎస్‌ ఉగ్రవాదుల ఊచకోతను తీవ్రంగా వ్యతిరేకించి అందుకు అనుగుణంగా ఉద్యమించలేక పోతున్నారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకు లెఫ్ట్‌ పార్టీలు విభేదాలు పక్కకు పెట్టి కనీసం కూటమిగా అయినా ముందుకు సాగాలి. విలీనం కావాలన్న ఆశ ఎలాగూ నెరవేరనప్పుడు కూటమిగా ముందుకు సాగాలన్న గట్టి నిర్ణయం తీసుకోవాలి.

ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితు లను ఎదుర్కొంటోందనీ.. ఈ దశలో వామపక్షాల ఐక్యత అత్యవసరమని పలు వామపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో వామపక్షాలు ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించి పోరాడడంలో నీరసించాయి. రైతుల ఉద్యమంలో కేవలం వారి పాత్ర నామమాత్రంగానే ఉంది. ఎపిలో అమరావతి ఉద్యమాన్ని కూడా పెద్దగా ప్రభావితం చేయలేక పోతున్నారు. వామపక్షాల ఐక్యత అన్నది నినాదంగా మారుతోంది. ఏళ్లుగా ఈ విషయంలో తర్జనభర్జనలే తప్ప కార్యాచరణ లేకుండా పోతోంది. కలసి పోరాడాలన్న ఆకాంక్ష ఉన్నా ముందరి కాళ్లకు బంధం పడుతోంది. ఇతర పార్టీలతో పొత్తులకు వెంపర్లాడుతున్న లెఫ్ట్‌ నేతలు సంస్థాగతంగా బలహీనం అవుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోకపోవడం కూడా ఒక కారణంగా చూడాలి. వీరు ఎంతసేపూ మరో పార్టీకి తోకపార్టీగా మారడం మినహా గట్టిగా చేస్తున్న ప్రయత్నాలు శూన్యం.

గతంలో కమ్మూనిస్టులకు ఉన్న ప్రజాదరణ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. అయినా ఆ పార్టీల్లో ఆత్మవిమర్శ అన్నది మచ్చుకైనా కానరావడం లేదు. పోరాటాల్లో ఆరితేరిన లెఫ్ట్‌ పార్టీలు ఎందుకనో ప్రజల్లో స్థానం సంపాదించుకోలేక పోతున్నారు. లెఫ్ట్‌ బలహీనం కారణంగా ఇతర రాజకీయ పార్టీలు తమ స్థానాలను పదిలం చేసుకోవడంతో పాటు బలపడుతున్నాయి.  విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, బ్యాంకు ఉద్యోగులు, మేధావులు వేర్వేరు రూపాల్లో నిరసన గళం వినిపిస్తున్నా.. వాటిని తమకు అనుకూలంగా మలచుకుని ఉద్యమించలేక పోతున్నాయి.  భాజపా వ్యతిరేక గళాలు ఒకే తాటి విూదికి రావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తున్నా దానికి పునాది పడడం లేదు.

లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు, మేధావులు, సిద్ధాంతకర్తలు, మైనారిటీలు, దళితులందరూ ఒకే వేదిక విూదకు రావడంపై తక్షణం దృష్టిపెట్టాల్సి ఉంది. ఇక లెఫ్ట్‌ ఐక్యత లేదా విలీనం విషయంలో సిపిఐ ఎప్పుడూ ఉదారంగా మాట్లాడుతుంటుంది. నిజానికి దేశంలో ధనిక, పేద వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. కేవలం కొన్ని  కుటుంబాలే సంపద ఫలాలు అనుభ విస్తున్నాయి. మోడీ సర్కార్‌ వచ్చాయక ఆయన తీసుకున్న నిర్ణయాలు కేవలం ధనికవర్గాలకే  మేలు చేశాయి. ఆర్థిక మాంధ్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, కుల, మత, వర్ణ వివక్ష తీవ్ర రూపం దాల్చాయి.

మోదీ ప్రభుత్వం దేశాన్ని విపత్తులోకి నెట్టేసింది. కార్పొరేట్‌ శక్తుల అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య ప్రజల్లో కష్టాల్లో మగ్గుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తానన్న మోదీ.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టలేదు. మహిళలు, దళితులు, మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు పెరిగిపోయాయి. నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ విఫలమయ్యారు. భాజపా ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోంది. ఈ ప్రభుత్వ వైఖరితో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం ఏర్పడిరది. రైతులు, కార్మికులు, మహిళలు, మైనారిటీలు, యువత.. ఇలా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొంది.

దేశ స్ఫూర్తిని పరిరక్షించుకోవడానికి, భాజపా వ్యతిరేక శక్తులను ఐక్యం చేయడానికి ఇదే సరైన సమయం అంటున్న నేతలు అందుకు కార్యాచరణ గురించి చర్చించి ఉంటే బాగుండేది. ప్రతిసారీ జరిగే లెఫ్ట్‌ సమావేశాల్లో ఐక్యత, ఐక్య పోరాటల గురించి చెబుతున్నా కార్యాచరణ అన్నది లేకపోవడం కారణంగా కమ్యూనిస్టులు ముందుకు సాగడం లేదు. అందుకే ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నారు. సత్వర రాజకీయ అవసరాలపైనా చర్చించి ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తే తప్ప లెఫ్ట్‌కు  అవకాశాలు లేవనే చెప్పాలి.  ఈ క్రమంలో తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలి. వామపక్ష ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి.

రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా లెఫ్ట్‌ పార్టీలు ముందుకు రావాలి. కేవలం బిజెపి హిందుత్వాన్ని ప్రోత్సహింస్తోందని చెప్పడం ద్వారా మైనార్టీ ఓట్ల కోసం వెంపర్లాడే రాజకీయాలు మానాలి. సమస్యలను అజెండగా చేసుకుని పోరాడితే తప్ప ప్రజలు నమ్మరని గుర్తించాలి. ఐక్యతా నినాదాన్ని పక్కన పెట్టి కలసి పనిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగితే తప్ప ప్రజలు నమ్మరు. సమస్యపై పోరాటం ప్రాతిపదికగా కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు.