నాగార్జునకు జోడీగా మెహ్రీన్ ?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ’బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ మూవీ ’సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు. కాగా.. తదుపరి చిత్రం ’ఘోస్ట్’ కు మాత్రం హీరోయిన్ అన్వేషణ కష్టంగా మారింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం ముందుగా కాజల్ అగర్వాల్ ను ఎంపికచేశారు మేకర్స్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మలయాళ బ్యూటీ అమలా పాల్ పేరు వినిపించింది. ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో తాజాగా హీరోయిన్ గా అందాల మెహ్రీన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
ఆమె ఈ సినిమాకి కథానాయికగా దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే మెహ్రీన్ ఎంపికపై అధికారిక ప్రకటన రానుంది. నెక్ట్స్ షెడ్యూల్ లో మెహ్రీన్ పాల్గొంటుందని సమాచారం. దీనికోసం మెహ్రీన్ కు సాధారణంగా ఇచ్చే పారితోషికం కన్నా కాస్త ఎక్కువగానే ముట్టజెప్పనున్నారట మేకర్స్. ఇంతకు ముందు ’గరుడ వేగ’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రవీణ్ సత్తారు.. ’ఘోస్ట్’ మూవీకి కూడా అదే తరహాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారట. నాగార్జున ఇంతకు ముందు చేయని పాత్రలో మెప్పిస్తారని దర్శకుడు చెబుతున్నారు. మరి ఈ సినిమాకి మెహ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ , గ్లామర్ అపీరెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.