టీమిండియా క్రికెటర్లకు హలాల్ చేసిన మాంసమే…!

టీమిండియా క్రికెటర్లకు డైట్ మెనూపై దుమారం
హలాల్ మాంసమే అంటూ ప్రచారం
మెనూలో ఎలాంటి నిబందనలు లేవన్న బిసిసిఐ ప్రతినిధి
టీమిండియా క్రికెటర్లకు హలాల్ చేసిన మాంసం మాత్రమే అందించాలనే బీసీసీఐ నిర్ణయించడం వివాదాస్పదమైంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ కోసం కాన్పూర్‌లో బస చేసిన భారత క్రికెట్ జట్టు ప్లేయర్లకు బోర్డు సూచించిన ఈ మెనూను బీజేపీ నేత గౌరవ్ గోయల్ తప్పుబట్టారు. ’ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు. హలాల్ చేసిన మాంసం మాత్రమే తినాలని చెప్పే అధికారి బీసీసీఐకు ఎవరిచ్చారు’ అని గౌరవ్ ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో ప్రశ్నించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల డైట్ ప్లాన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల డైట్‌లో ఇకపై బీఫ్, పోర్క్ ఉండబోదని, ఈ రెండిరటినీ నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఆటగాళ్ల ఆహార విషయంలో నిబంధనలేంటని నెటిజన్లు, అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. అసలు ఆటగాళ్ల ఆహార విషయాల్లో బీసీసీఐ ఎలాంటి సలహాలూ ఇవ్వబోదని స్పష్టం చేశారు. కొత్త డైట్ ప్లాన్ అనేదే ఎన్నడూ చర్చకు రాలేదని అరుణ్ పేర్కొన్నారు. ఇక చర్చకే రానీ.. ఎటువంటి నిర్ణయమూ జరగనప్పుడు దాన్ని అమలు చేయడం కూడా సాధ్యపడదన్నారు. ఆటగాళ్ల ఆహార విషయంలో బీసీసీఐ ఎన్నడూ జోక్యం చేసుకోదని… అది వారి వారి వ్యక్తిగత అభిరుచుల మేరకే ఉంటుందని అరుణ్ స్పష్టం చేశారు.