బ్యాండ్ సౌండ్‌తో కోళ్లు మృతి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి
పెళ్లి బరాత్‌లో పెట్టిన డీజే సౌండ్‌కే తన కోళ్లు చనిపోయాయంటూ కేసు పెట్టాడు ఓ కోళ్ల వ్యాపారి. ఈ విచిత్రమైన ఘటన ఒడిశాలోని నీలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాసోర్ లోని కందరడిగ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటలకు గ్రామంలో డీజే సౌండ్ తో పెళ్లి ఊరేగింపు తీశారు. అంతేగాకుండా బరాత్ లో టపాసులు కాల్చారు. బరాత్ కు దగ్గర్లోని పొలంలో రంజిత్ పరిదా అనే వ్యక్తి కోళ్ల ఫారమ్ ఉంది. అందులో రెండు వేల బాయిలర్ కోళ్లు ఉన్నాయి. బరాత్ లోని భారీ డీజే సౌండ్ కు, టపాసుల శబ్దాలకు తట్టుకోలేక తన 63 కోళ్లు చనిపోయాయని మరుసటి రోజు రంజిత్ పరిదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీజే సౌండ్ తగ్గించమని పెళ్లి బరాత్ వ్యక్తులను కోరినా వినిపించుకోలేదని .. అంతేగాకుండా మద్యం మత్తులో ఉన్న వాళ్లు తనను తిట్టారని చెప్పాడు. అధిక డీజే సౌండ్, టాపాసుల సౌండ్ కు తట్టుకోలేక కోళ్లు చనిపోయాయని వెటర్నరీ డాక్టర్లు నిర్దారించారని చెప్పాడు. దీంతో చనిపోయిన 63 కోళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని.. పెళ్లి వారిని కోరినా అందుకు నిరాకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పరిదా.