బంగ్లాతో టీ ట్వంటీలో పాక్‌ క్లీన్‌ స్వీప్‌

కెప్టెన్‌ బాబర్‌ వైఫల్యంపై నెటిజన్ల ట్రోల్‌

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్‌ 3`0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఆఖరి, మూడో టీ20లో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ నయీమ్‌ (47) టాప్‌ స్కోరర్‌. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 127/5 స్కోరు చేసి గెలిచింది. హైదర్‌ అలీ (45), ఓపెనర్‌ రిజ్వాన్‌ (40) రాణించారు. ఆఖరి బంతికి నవాజ్‌ (4 నాటౌట్‌) ఫోర్‌ కొట్టి గెలిపించాడు.  కుల్‌దిష్‌ షా, ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ నవాజ్‌ అంచనాలకు మించి రాణించడంతో పాకిస్తాన్‌ మూడు టి20ల్లోనూ మంచి విజయాలు సాధించింది. అయితే కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చే బాబర్‌ అజమ్‌ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 7,1,19 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సందర్భంగా బాబార్‌ అజమ్‌ చెత్త ప్రదర్శనపై అభిమానులు ట్రోల్‌ చేశారు. వరల్డ్‌కప్‌ గెలవలేకపోయామనే బాధ ఇంకా ఉన్నట్లుంది.. మత్తు దిగలేనట్టుంది.. అందుకే బంగ్లాతో సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక బాబర్‌ అజమ్‌ టి20 ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌లాడి 303 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఒక టి20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌ అజమ్‌ తొలి స్థానంలో నిలిచాడు. టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న పాకిస్తాన్‌ నవంబర్‌ 25 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.