Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజధాని లేని అనాధ ఆంధ్రప్రదేశ్‌ !

రాజధాని లేని అనాధ ఆంధ్రప్రదేశ్‌ !

మూడు రాజధానుల ముచ్చట ఆగలేదు. బిల్లు ఉపసంహరణతో మున్ముందు ఆగుతుందనుకున్న వారికి సిఎం జగన్‌ షాక్‌ ఇచ్చారు. అమరావతి కట్టడం సాధ్యం కాదని సిఎం జగన్‌ తన ప్రసంగంలో చెప్పనే చెప్పారు. అలాగే విశాఖపట్టణం లాంటి సిటీలో అయితే వాల్యూ ఆడెడ్‌ చేస్తే బాగుండేదన్నారు. నిజానికి విశాఖను రాజధానిగా ఎన్నుకుని ముందుకు సాగినా ..ఈ రెండున్నరేళ్లలో రాష్టాన్రికి ఓ రాజధాని అయినా ఉండేది. లేకుంటే ఇప్పుడున్న వసతులతో ఉన్న అమరావతితో కొనసాగినా కొంతయినా మర్యాద ఉండేది.

రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళయ్యింది. రాజధాని ఎక్కడో తెలియని అనిశ్చిత పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. పాలకులకు ఆటగా ఉన్నా..ప్రజలకు మాత్రం ఇదో అవమానంగా ఉంటుందన్నది సత్యం. విదేశాలకు వెళితే రాజధాని అంటే ఏం చెబుతామన్న స్పృహ ఉండాలి. అమరావతికి పునాది రాయి వేసిన ప్రధాని మోడీ కూడా చోద్యం చూడడం దారుణం కాక మరోటి కాదు. మూడు రాజధానుల వ్యవహారంతో ముడిపడిన ఈ అంశంలో కోర్టు కేసులు, విమర్శల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కూడా నిలిచిపోయిందని జగనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో యువకుడైన సిఎం జగన్‌ అద్భుతాలు సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనుభరాహిత్యం కారణంగా అన్నీ తప్పటడుగులే వేస్తున్నారు. మళ్లీ మూడు రాజధానులపై పకడ్బందీగా బిల్లు తెస్తామని ప్రకటించడం…సినిమా ముందున్నదని మంత్రులు అనడం చూస్తుంటే ఇంకా వారికి జ్ణానోదయం అయినట్లుగా లేదు.

రాజధాని వేరు..అభివృద్ది వేరన్న విషయం వారికి ఇంకా బోధపడినట్లుగా లేదు. అభివృద్ది వికేంద్రీకరణకు ఎవ్వరూ అడ్డం చెప్పడం లేదు. ఆయా ప్రాంతాలను మౌళికంగా అభివృద్ది చేసుకోవడం వేరు…మూడు రాజధానులంటూ వేలాడడం వేరని గుర్తించడం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబాటు తనాన్ని రూపుమాపడంలో ఈ రెండున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. ప్రభుత్వ బొక్కసాన్ని పంచిపెట్టడం తప్ప కనిపిస్తున్నదేదీ లేదు. రాజకీయాల్లో మంచి పనులు చేసి,కొత్తగా ఏర్పడ్డ రాష్టాన్న్రి అభివృద్ది చేసుకునే మహదవకాశాలన్నీ జగన్‌ కోల్పోయారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం..కేవలం మరో బిల్లు కోసమే అని చెప్పడం చూస్తే తాను పట్టిన కుందేటికి మూడు కొమ్ములన్నట్లుగా..తాను అధికారంలో ఉన్న ఎపికి మూడు రాజధానులు అన్న చందంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా జగన్‌ తీసుకుంటున్న చర్యలు సమర్థనీయం కాదని అర్థమవుతూనే ఉంది.

న్యాయస్థానంలో వాదనలు ఆరంభం కాగానే, బిల్లు ఉపసంహరణ నిర్ణయాన్ని ముందుగా అక్కడ తెలియ చేసి, అనంతరం శాసనసభలో ఆ పక్రియ పూర్తిచేశారు. కేవలం కోర్టు కోసం చేసిన తతంగంగా దీనిని చూడాలే తప్ప మరోటి కాదు. మరింత మెరుగైన సమగ్రమైన బిల్లుతో మళ్ళీవస్తామన్న ప్రకటనతో జగన్‌ ఏం చేయాల నుకుంటున్నరో చెప్పడం లేదు. కనీసం తను మక్కువ చూపిన విశాఖపట్టణం అయినా రాజధానిగా ప్రకటించి.. మిగతా ప్రాంతాల్లో అభివృద్దికి శ్రీకారం చుట్టినా బాగుండేది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లేకనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పడం వైఫల్యం కాక మరోటి కాదు. అసెంబ్లీలో పొంతనలేని ప్రకటనలు తప్ప వాదానికి నిలబడేవి కావు.  పాలనా వికేంద్రీకరణ పేరిట ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని, మూడు రాజధానులంటూ పట్టుకుని వేలాడడం వల్ల న్యాయస్థానాల్లో తమ వాదనలు నిలబడనంత బలహీ నంగా, అసమగ్రంగా తమ చట్టాలున్నాయని వస్తున్న విమర్శలకు వైసిపి నేతల వద్ద సమాధానం లేదు.

మూడు రాజధానులు అంటూ ప్రకటించిన నగరాల్లో లేదా ప్రాంతాల్లో రెండున్నరేళ్లలో కనీసం గుర్తుండి పోయే ఒక్క పని కూడా చేయలేకపోవడం వైఫల్యం కాక మరోటి కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకూ బహుళ రాజధానులకూ మధ్య అర్థంలేని వాదనను జతచేయడం చూస్తే బుర్ర ఉన్నవారి పని కాదని అనిపించేలా ఉంది.  హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ ఆరంభమై, వాదనలు జోరుగా సాగుతున్న తరుణంలో తాము చేసిన చట్టాలు సరిగా లేవని ఒప్పుకున్నట్లు అయ్యింది. ప్రజలకు అండగా ఉంటానని, గతంలోనే అమరావతికి మద్దతు పలికిన జగన్‌ దానిని కాదని నెపాన్ని చంద్రబాబు విూదకు నెట్టేయడం కూడా వైఫల్యంగానే చూడాలి.

అమరావతి రైతుల పాదయాత్రను ఇప్పటికీ చులకన చేస్తూ వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులంటూ చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుమాలినవి తప్ప మరోటి కాదు. అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేసి చూడడం కూడా సరికాదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత రాలేదు. నిజంగా జగన్‌కు అలాంటి భావనే ఉండివుంటే ఆనాడే అమరావతిపై తన అసంతృప్తిని, వ్యతిరేక తను వ్యక్తం చేసే అవకాశం ఉండేది. కానీ ఆనాడు మద్దతు ఇచ్చి ఇప్పుడు కాదని చెప్పుకోవడం ఎంతో భవిష్యత్‌ఉన్న రాజకీయ యువనేతకు తగదు. రాజకీయాల్లో కొంత పరిణతి, నిబద్దత,నిజాయితీ కూడా ఉండాలి. చంద్రబాబు తీసుకున్న అమరావతి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకించారనీ, అందుకే 2019 ఎన్నికల్లో తమకు భారీగా ఓట్లు వేసి మరీ ఆశీర్వదించారన్న వ్యాఖ్యలు తనకు అనుకూలంగా సమర్థిం చుకోవడానికి పనికి  వస్తాయి తప్ప..వాదనలో నిలవవని గుర్తించాలి. తాను అమరావతికి వ్యతిరేకమనీ, అధికారంలోకి వస్తే ఆ నిర్ణయాన్ని తిరగదోడతానని ఎన్నికల ముందు జగన్‌ ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పివుంటే ఇవ్వాళ్ల మూడు రాజధానుల మాటలకు అర్థం ఉండేది.

ఆనాడు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల దగ్గర్నుంచి 34,281 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం సవిూకరించింది. భూమినిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లే`అవుట్లలో ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. రైతులిచ్చిన భూమిని అభివృద్ధిచేసి, సుమారు 130 కంపెనీలకు 1293 ఎకరాల భూమిని ఇచ్చేశారు. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కింద సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు 1691 ఎకరాలను కేటాయించారు. కొంత భాగాన్ని స్వాధీనం చేయడమూ జరిగింది. ఇదంతా జరుగుతున్న ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. ప్రధానిమోడీ వచ్చి శంకుస్థాపన చేసినా అభ్యతరం రాలేదు. ఇన్నాళ్ల తరవాత ఇప్పుడు మూడు రాజధానలంటూ చెప్పడం వెనక స్వార్థ ప్రయోజనాలు తప్ప మరోటి కానరావు.