మరో మూవీకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్..!

ఆరు పదుల వయస్సులోను కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ’శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి మళ్లీ 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అనంతరం 2019లో సైరా నర్సింహా రెడ్డితో ఆకట్టుకున్న చిరు కరోనా వలన కొద్ది గ్యాప్ తీసుకున్నారు.
ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ’ఆచార్య’ చిత్రంతో పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ’గాడ్‌ఫాదర్’, ’బోళాశంకర్’, దర్శకుడు బాబీతో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం చిరు మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ’ఛలో’, ’భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ కుడుముల చిరుకు ఓ కథ వినిపించాడని, దానికి చిరు కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం. ఇందులో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.