Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గృహనిర్మాణ రంగానికి గడ్డుకాలం

పెరుగుతున్న నిర్మాణరంగ ఖర్చులు

సామాన్యుడికి దూరంగా ఇంటికల

గృహనిర్మాన రంగం మరింత భారంగా మారుతోంది. సామాన్యుల ఇంటికల చెదరి పోతుంది. తాజాగా కరోనా సంక్షోభం తరవాత ఈ రంగం మరింత ప్రియంగా మారింది. ఇల్లు అన్నది మధ్యతరగతికి భారంగా మారింది. దీనికితోడు సిమెంట్‌, ఇసుక, స్టీల్‌తో పాటు  ఇతర సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. వీటికి తోడు కూలీల రేట్లు కూడా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఇల్లు కొనుక్కోవడం అన్నది సామాన్యులకు అందుబాటులో లేని వస్తువుగా మారింది. కేంద్రం కూడా  జిఎస్టీపై తీసుకుంటున్న కంటితుడుపు చర్యల కారణంగా నిర్మాణరంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడిరది.

పేదలు, మధ్యతరగతి వారికి గృహనిర్మాణం భారం కానుందన్న ఆందోళనలను కేంద్రం పక్కన పెట్టింది. నిర్మాణ సామాగ్రి ధరలు ఎరగకుండా కట్టడి చర్యలు తీసుకోవడం లేదు. జిఎస్టీ పన్నుఅధిక శాతం ఉండకూడదని, పన్ను అధికమయితే నల్లబజారు బెడద కూడా పెరుగుతుందని వస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ రంగ వస్తువుల పైభారీగా జిఎస్టీ పన్ను వేయడం వల్ల దాని భారం నేరుగా ప్రజలపై పడుతుంది. ఇల్లు కొనుక్కోవాలన్న తపనలో ఉన్న వారికి మరింత భారం కానుంది. పన్ను చెల్లింపు విధానాన్ని మరింత సరళతరం చేయాలని, జీఎస్టీ నెట్‌వర్క్‌లో ఉన్న ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నా పట్టించుకోకుండా మండలి తనపెడ ధోరణిలోనే ముందుకు సాగడం కారణంగా విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

పెట్రోలు, డీజిల్‌, సహజవాయువు, విమాన ఇంధనం, ముడి చమురును కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రజలు కూడా దీనినే అభిలషిస్తున్నారు. స్థిరాస్తి రంగాన్ని, పెట్రోలియం ఉత్పత్తులను, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక విధానం ఉండాలని అభిప్రాయడుతున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా మూడు రకాల రిటర్నులు సమర్పించే బదులు, మూడు నెలలకు ఒకసారి సమర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే గృహనిర్మాణంపై పన్నులు తగ్గించకపోవడం సరికాదు. దీనిపై తక్షణం పునరాలోచన చేయాలి. దీనిపై ఆదాయాన్ని ఆశిస్తే గృహనిర్మాణ రంగం కుదేలు కానుంది. ఇకపోతే చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై భారం మోపకూడదని, అసంఘటిత రంగాన్ని తొక్కిపెట్టకూడదని పలువురు  పేర్కొంటున్నారు.

నిర్మాణరంగంతో పాటు, అనుబంధ రంగాల్లో 5శాతం పన్ను మాత్రమే ఉంటే సామాన్యులకు మేలుకలుగుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటికైన కొన్ని వస్తువులపై పన్ను తగ్గించడం చూస్తుంటే, భయాందోళనలో చిక్కుకున్న మోదీ ప్రభుత్వానికి పన్ను తగ్గించడం మినహా మార్గం లేదని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యా నించారు. కేంద్రం అహంకారాన్ని విడిచిపెట్టి తప్పు దిద్దుకోవాలని, దేశ ప్రజలు చెబుతున్న విషయాన్ని వినాలని హితవు పలికారు. ప్రభుత్వం చిన్న మధ్య తరహా వ్యాపారాల వెన్ను విరిచిందని, లక్షలాది ఉద్యోగాలను పోగొట్టిందని వ్యాఖ్యానించారు