కార్తీక పౌర్ణమి పరమపవిత్రం

శివుడికి అభిషేకాలు..విష్ణువుకు వ్రతాలు

రుద్రాభిషేకాలకు ఆలయాలు సిద్దం

కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావడంతో కార్తీకంలో ఆయనకు అభిషేకాలు నిర్వహిస్తే మంచిదని శివపురాణం చెబుతోంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు వ్రతాలు, అభిషేకాలు నిర్వహిస్తే మరీ మంచిదని పురాణాలు చెబుతున్నాయి. అలాగ విష్ణువు అలంకార ప్రియుడు. ఈ మాసంలో ఆయనకు నిత్యం పూజలు, అలంకారాలు చేసి ఆరగింపులు చేయాలి. చాలామంది కార్తీకంలో సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరిస్తారు. అందుకే కార్తీకం పౌర్ణమి నాడు అటు శివాలయాలు, ఇటు వైష్ణవాలయాలు కిటకిటలాడుతాయి.  కార్తీకం అంటేనే వ్రతాలు,నోములు, అభిషేకాలకు ప్రత్యేక మాసంగా గుర్తుంచుకోవాలి. ఈ  మాసం పరమ పవిత్రంగా పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీకంలో అన్నిరోజులు పవిత్రమే కనుక సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో అభిషేకాలు నిర్వహించాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది.  సముద్రా, నదీ స్నానాలకు కూడా ఇది పరమ పవిత్రమైన మాసం. కార్తీకమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్టాల్రు శివనామస్మరణంతో మార్మోగుతున్నాయి. శివుడిని అభిషేకిస్తే పాపాలు హరిస్తాయని పురాణ ప్రవచనం. అందుకే కార్తీకంలో అభిషేకంతో శివుడిని ప్రసన్నం  చేసుకోవాలని మన రుషులు ఆదేశించారు. ఈ మాసంలోల చేసే పూజల వల్ల జీవితాంతం చేసిన పాపాలను హరించుకోవచ్చని చెబుతారు.  యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించి మనకు సన్మార్గం ఉపదేశించాడని కూడా చెబుతారు. శివ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడిని  ఉపవాసంతో అభిషేకించి ఫలమో, ప్రాదమో సమర్పించుకుంటే సకల పాపాలు హరిస్తాయి.  ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే  కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం ఒక విశిష్టత. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షమవుతాడు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు రుద్రాక్ష స్వరూపుడు. అందుకే రుద్రాక్షలు కూడా  సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. రుద్రాక్షలకు అంత మహత్యమెలా వచ్చిందన్న దానిపై దేవీ భాగవతంలో పూర్తిగా పొందుపరిచారు. త్రిలోక సంచారి నారద మునీంద్రునికి నారాయణ మహర్షి రుద్రాక్షల పవిత్రత గురించి విశదీకరించాడు. రాక్షస సంహారం అనంతరం త్రినేత్రాలను మూసివేసి ఈశ్వరుడు ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే స్వామి మూడు కన్నుల నుంచి కన్నీటి బిందువులు రాలాయి. శంభుని నేత్రాల నుంచి వచ్చిన కన్నీటి ధారలతో ఏర్పడిన వృక్షాలు కనుకే రుద్రాక్షలకు అంత పవిత్రత ఏర్పడిరది. ఇక విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో పాటు, ఆరాధానా ప్రియుడుకూడా. అందుకే కార్తీకంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వ్రతాలునిర్వహిస్తే అష్టయిశ్వర్యాలు

పొందుతారని ఐతిహ్య. అందుకే కార్తీకంలో స్వామిని సత్యానారాయణుడి రూపంలో పూజిస్తారు.