Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దీపం జ్ఞానానికి ప్రతీక

శివకేశవులకు ప్రీతిపాత్రం కార్తీకం

కార్తీక దీపాలకు అందుకే ప్రత్యేకత

శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం. క్షీరసాగర మధన సమయంలో వెలువడిన హాలహలాన్ని పరమేశ్వరుడు సేవించి తన గొంతులో వుంచుకున్నాడు. అయితే ఆ విష ప్రభావానికి శివుడు అస్వస్థతకు గురయ్యాడు. అగ్ని స్వభావం గలిగిన ఆ విషం నుంచి మహేశ్వరుడిని కాపాడమని అమ్మవారు అగ్నిదేవున్ని ప్రార్థించింది. అనేక సపర్యల అనంతరం శివుడు కోలుకున్నాడు. అగ్నిస్వభావం వున్న కృతికానక్షత్రానికి పార్వతీదేవి కృతజ్ఞతగా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటుచేసింది. అందుకనే ఈ పౌర్ణమిని అత్యంత విశిష్టమైనదిగా పేర్కొంటారు.

ఈ రోజున మహిళలు పగలంతా ఉపవాస దీక్షలో వుండి రాత్రి దీపారాధన చేయాలి. ఇంటి ముందు వాకిట్లలో, పుణ్యతీర్థాల్లో, దేవాలయప్రాంగణాల్లో , నదీతీరాల్లో, పుష్కరిణుల్లో దీపాలను వెలిగిస్తారు.ఇదో అద్భుతఘట్టం. కార్తీక మాసం ఆధ్యాత్మికపరంగా విశిష్టమైన నెల. ఈ మాసంలో అత్యంత పవిత్రమైనది కార్తీకపౌర్ణమి కావడంతో భగవంతుని కృపకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రోజున తమ శక్తికొలది దానాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మార్కండేయ పురాణగ్రంథం దానం చేస్తే మంచిదని ధర్మగ్రంథాలు పేర్కొంటున్నాయి. సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.

అన్ని మాసాల్లోనూ కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. వీరిద్దరి ఆరాధన అంటే` మనం చరించే ’స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలనిచ్చేదిగానూ ఉండాలన్న ఆశయసిద్ధికై అంతర్ముఖయానం గావించుకోవాలన్న దానికి ప్రతీక ఈ మాసమని చెబుతారు. కార్తికస్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తితత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. కార్తిక సోమవారాలు మరింత ప్రత్యేకం.  మాసంలో ప్రాతఃకాలపు స్నానాలకు ఎంతో ప్రాముఖ్యమిస్తారు. ప్రాతఃకాలంలో చేసే స్నానం రుషీస్నానం, ఉత్తమమైంది.

ఈ మాసం ప్రవేశించేనాటికి వర్షరుతువు సమాప్తమవుతుంది.  వర్షజలధారలు సమస్తమూలికల సారాన్ని, భూపొరల్లోని ధాతువుల సారాన్ని కలగలుపుకొని నదుల్లోకి అంతర్వాహినిగా వచ్చిచేరతాయి. షధజలంలా జలప్రవాహాలు పరిఢవిల్లుతాయి. ప్రవాహవేగానికి ఎదురుగా నిలబడి స్నానమాచరిస్తే` జలప్రవాహాల్లో ఔషధీయగుణాలు, విద్యుత్‌ తరంగాలు దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. స్నానానంతరం రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల వద్ద దీపారాధన, దైవారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వృక్షసంపద ఆరోగ్య భాగ్యాన్ని కలుగజేస్తుంది. యజ్ఞ  ద్రవ్యంగానూ ఉపయోగపడుతుంది.

జ్ఞానానికి చిహ్నం దీపం. సర్వసంపదలు జ్ఞానంవల్ల లభిస్తాయి. ఈ మాసంలో దీపదానం ప్రాశస్త్యం చాలా ఉంటుంది. ఈ మాసం ఆసాంతం దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానంచేస్తే` అనంతపుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయంటారు. జ్ఞానం సకల సంపదలకు నెలవు కాబట్టి, ఆ జ్ఞానాన్ని పదుగురికీ పంచి ప్రకాశవంతమైన జీవనవిధానాన్ని సమాజంలో నెలకొల్పాలన్న సందేశం ఇందులో ఉంది.

మానవాతావరం దృష్ట్యా ఏక భుక్తమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. ఈ కాలంలో జఠరాగ్ని మందంగా ఉంటుంది. దాన్ని చురుగ్గా ఉంచేందుకు ఏకభుక్తమే ఔషధం. అన్నార్తుల క్షోభ ఎటువంటిదో తెలుసుకోవాలన్నది ఉపవాసాల పరమార్థం. ఉపవాసం అంటే ఆహారంలేకుండా దినం గడపడమని కాదు` భగవస్సాన్నిధ్యంలో ఆ రోజును గడపడం.

కార్తిక సోమవారాలది పెద్ద సందడి. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. మారేడు దళాలతో పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుందని పురాణప్రవచనం. శివుడు ప్రేమ మయుడు. విశ్వప్రేమతత్వం అలవరచుకోవడమే శివసాయుజ్యం` అదే జీవన పరమార్థం.కార్తిక పౌర్ణమిరోజున శ్రీమహావిష్ణువును షోడశోపచారాలతో పూజిస్తే యశస్సును, సామ్రాజ్యవైభవాలను పొందుతారని ’పురంజయుని’ చరిత్ర తెలియజెబుతోంది. ఇది చాతు ర్మాస్యం. కార్తిక శుద్ధ ఏకాదశితో చాతుర్మాస్య వ్రతం పరిసమాప్తమవుతుంది. మానవ జీవితకాలంలో సగం ఆయుష్షు నిద్రకే సరిపోతుంది. మేల్కొని ఉండే జాగ్రదావస్థ, జీవిత స్థితిగతులను సువ్యవస్థీకృతమైన విధానంలో నడుపుకోవాలి.