Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్తీక పౌర్ణమి పరమపవిత్రం

శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది

వ్రతాలు,దానాలకు అత్యంత ముఖ్యం

మాసాలన్నింటిలోనూ పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించు కుంది. శివ`విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తిక పౌర్ణమిని శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనీ పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి, సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమనాడే. దత్తాత్రేయ జన్మదినమూ ఇదే!  దేవ దీపావళి, కుమార దర్శనమనీ ఈ పర్వడికి పేర్లున్నాయి. ఈ రోజున ’రాసలీలా మహోత్సవం’ జరుపుతారు.

క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోకసంరక్షణం చేసినందుకు సంతోషంతో ప్రజలు ’జ్వాలాతోరణోత్సవం’ ఈ శుభదినాన నిర్వహించారు. ఈ రోజున ’వృషోత్సర్జనం’ అనే ఉత్సవం జరుపుకొంటారు. పితృదేవుల ప్రీత్యర్థం ఒక కోడెదూడను ఆబోతుగా వదులుతారు. ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.  యోగసిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్రస్నానం శివారాధన, అభిషేకం, ఉసిరిక, దీపారాధనలకూ విశేషమైన ఫలితాలున్నాయి.

శంకరుడు త్రిపురాసురుణ్ని వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు 720 వత్తుల నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు. మహిషాసురవధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తిక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. శివాలయంలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ఉసిరిక చెట్టు కింద కార్తిక దామోదరుడిగా కీర్తిపొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికాయలతో పూజిస్తారు.

కొందరు ఈ రోజున తులసిని, వ్యాసుణ్ని ఆరాధిస్తారు. దీపదానం, బిళ్వదళార్చన, ఉపవాసం, జాగరణ, శతలిం గార్చన, సహస్ర లింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూ, గోదానం, అన్నదానాలకు కార్తిక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీ ఫలవ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృత్తికావ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తుం టారు. శైవ`వైష్ణవాలయాల్లో ఎంతో సభక్తికంగా జరిగే జప, తప, దీపదాన, పూజాదికాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తిక పౌర్ణమి.