Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజధాని అమరావతిపై జగన్నాటకం ! 

ఏ దేశానికైనా..అలాగే ఏ రాష్టాన్రికైనా ఒకే రాజధాని ఉండాలి. ఉంటుంది కూడా..ఎక్కడో ఒకచోట అవకా శాలను బట్టి అదికూడా వాతావరణాల కారణంగా రెండో రాజధానిని కేవలం సమావేశాల కోసం ఏర్పాటు చేసుకుంటారు. రాజధాని అంటే అది గుండెకాయ లాంటిది. కానీ ఖర్మమేంటో కానీ ఎపికి ఇప్పుడు రాజధాని అన్నది లేకుండా పోయింది. ఓ వైపు అమరావతినే కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళన 700 రోజులు దాటింది. అలాగే న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా, ప్రజల అనూహ్య మద్దతుతో ముందుకు సాగుతోంది. కానీ దానిని కూడా సహించలేక ఆనేక ఆంక్షలు విధించారు.

అడుగడుగునా నిబంధనల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్రలను చేసిన సిఎం జగన్‌ ఆనాటి సంగతుల మరచి రైతులను అడ్డుకుంటున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అలాగే రాజధానిపై రైతులు ఆవేదనను అర్థం చేసుకుని తప్పులు సరిదిద్దు కోవాల్సిన ప్రభుత్వం యాత్రను విమర్శిస్తూ..చులకన చేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రెండున్న రేళ్లుగా రాజధాని వ్యవహారం కోర్టుల్లో నడుస్తోంది. రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇది రాష్ట్ర వ్యవహారంగా చెప్పి తప్పించుకుంటోంది. అంతో ఇంతో రాజధాని కోసం కృషి చేసిన టిడిపిని అదేపనిగా విమర్శించడమే లక్ష్యంగా మంత్రులు, సిఎం పనిగా పెట్టుకున్నారు. అమరావతి ఉద్యమాన్ని టిడిపి నడిపిస్తున్న ఉద్యమంగా చూపి తప్పించుకుంటు న్నారు.

అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకుని వచ్చి..తాను పట్టిన ఎపికి మూడు రాజధానులంటూ నిప్పు రాజేశారు. ఏపీ రాజధాని విభజన వ్యవహారం ఇప్పుడు చిచ్చు రాజే స్తోంది. నిజానికి విశాఖపై మక్కువతోనే ఈ తతంగం అంతా నడుస్తోందన్నది సుస్పష్టం. మూడు రాజధానులు చేస్తున్నాం అన్న ప్రకటన చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యవహారంలో వైసిపి అభాసు పాలవుతోంది. సిఎం జగన్‌ తరును తప్పు పడుతున్నారు. మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు చూసి నవ్వుకుంటున్నారు. ఏ ప్రాంతానికి అయినా న్యాయం చేయడం వేరు..రాజధాని ఒక్కటే ఉండడం వేరన్న స్పృహలో వైకాపా నేతులు కాని, నాయకుల కానీ లేరు.

నిజానికి రాజధాని ఏర్పాటు… అభివృద్ది దానిచుట్టూ పరిభ్రమించాలి. నిరుద్యోగులకు బాసటగా నిలవాలి. కానీ ఎపిలో వైకాపా అధికారంలోకి రాగానే రాజధాని విషయంలో గందరగోళం రేపింది. దీంతో రెండేళ్లుగా దీనిపై ఆందోళనలు..కోర్టులు.. నాయకుల చుట్టూ వ్యవహారం తిరుగుతూ సమస్య మరింత జటిలంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం చోద్యం చూస్తోంది. అయోధ్య రామాలయ సమస్య తీరినా ..ఈ సమస్య తీరేలా కనిపించడం లేదు. రాజధాని ఒక్కటే…అది విశాఖ మాత్రమేనని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నాన్నే పూర్తి స్థాయి రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోనీ అలా చేసినా బగుండేది. కానీ అలా కాకుండా తప్పించుకునేందుకు మూడు రాజధానులు అంటూ మెలికలు పెడుతోంది. రాజధాని బిల్లుకు గవర్నర్‌తో ఆమోదముద్ర వేయిం చుకుంది. రాయలసీమకు న్యాయ రాజధాని ఇచ్చేశామని, కర్నూలులో అది ఉంటుందని చెప్పుకుంటున్నా రు. అలాగే అమరావతిని అక్కడే ఉంచుతున్నాం.. దాని అభివృద్దికి ఢోకా లేదంటున్నారు.

అమరావతిని కదపట్లేదు అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం మాటల గారడిగానే.. మాయ మాటలుగానే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఈ మూడు రాజధానుల ముచ్చట వెనక పెద్ద మతలబు ఉండివుంటుంది. అందుకే తాను పట్టిన కుందేటికి మూడే కొమ్ములు అన్న చందంగా మూడురాజధానుల
వ్యవహారం నడుస్తోంది. ఇకపోతే న్యాయ రాజధాని కర్నూలుకు తరలించాలంటే అదో పెద్ద తతంగం కానుంది. ఎందుకంటే ఎట్టిపరిస్థితిల్లో హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు రాష్ట్రపతి అనుమతి కావాల్సి ఉంటుంది అని కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయదగిన పనులు కాదు అని చెబుతున్నారు. దీన్ని బట్టి హైకోర్టు రాయలసీమకు వెళ్లడమనేది అంత సులువు కాదని అర్ధమవుతోంది. అలాగే అమరావతిని శాసన రాజధానికిగా ఉంచుతున్నాం…అక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు మాత్రమే గందరగోళానికి గురవుతున్నారు.

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి ప్రజామద్దతు మాకే ఉంది..ఏమైనా చేస్తాం..చెల్లుతుందన్న భావనలో పాలకులు ఉన్నారు.పేరుకు మూడు రాజధానులని చెబుతున్నప్పటికీ… అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతున్నప్ప టికీ…. రాజధానిని విశాఖకు మార్చాలన్నది ప్రభుత్వ ధృడ సంకల్పంగా కనిపిస్తోంది. అదే జరిగితే రాయల సీమ ప్రాంత ప్రజలకు కచ్చితంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపురం, చిత్తూరు లాంటి దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేందుకే దూరమవుతుందని చాలా మంది భావిస్తున్న పరిస్థితి ఉంది. సరైన రవాణా సౌకర్యం లేదు. రాజధాని అమరావతితో కలిపేందుకు భారీ రోడ్డు ప్రాజెకట్లు నిర్మించాలన్న ఆలోచన అప్పట్లో చేశారు. వీరంతా రాజధాని వైజాగ్‌ వెళ్లాలి అంటే చాలా కష్టపడక తప్పదు.

రాజధాని విశాఖ అంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టే.. మూడు రాజధానులు అనే మాటను ప్రభుత్వం తెరపైకి తీసుకుని వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం సృష్టించిన అమోయమయ సునావిూ లో పడి ఇప్పుడు రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అమరావతి అక్కడే ఉంటుందా లేకపోతే తరలిస్తున్నారా? మరోచోట దీని నిర్మాణం చేస్తారా అన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. నిజానికి రాజదాని తరలించాల్సిన అవసరం ఎందుకు అన్నదానికి సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నారు.

బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అంతా కూడా అమరావతిని తరలించవద్దని ప్రజలకు మద్దతుగా పోరాడుతున్నాయి. అయోమయ పరిస్థితిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడడం సరికాదు. మంత్రులు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలతో రాష్ట్ర ప్రజల్లోనూ, భూములిచ్చిన రైతుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఇది అబద్దమని కోర్టులో తేలింది. మొత్తంగా గందరగోళానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐదువేల ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని 2015 మార్చిలో అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పరిపాలనా కేంద్రమైన రాజధాని విషయంలో అస్పష్టత ఎప్పటికీ మంచిది కాదు. దీంతో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు వెనక్కి పోతున్నారు. రాజధాని అన్నది ఒక్కటే ఉండకపోతే జరిగే నష్టం అంతాఇంతా కాదు. దీనిపై పునరాలోచన చేయకుంటే నష్టపోయేది ప్రజలే అని గుర్తించాలి.