ఇషాన్ కిషన్, సిరాజ్, చాహర్ లకు నిరాశేనా?

టీ20 ప్రపంచకప్ లో భారత్ ప్రస్థానం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక, నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌కు అంతర్జాతీయ టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. కొత్త హెడ్ కోచ్ ద్రావిడ్ పర్యవేక్షణలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. టీ20 నయా సారథి రోహిత్ శర్మ నెట్స్‌లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. మిగతా ప్లేయర్లు కూడా వామప్స్‌తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. నెట్ సెషన్‌లో చెమటోడ్చారు. ఇక, మెగాటోర్నీలో న్యూజిలాండ్ పై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు, టీ20 వరల్డ్ కప్ ఫామ్ ను కంటిన్యూ చేయాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. ఈ జట్టులో ఎక్కువ మంది ఐపీఎల్ కుర్రాళ్లు ఉండటంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జైపూర్‌లో భారత్‌కు ఇదే తొలి టీ20 కావడం విశేషం. జైపూర్‌లో 8 ఏళ్ల తర్వాత మ్యాచ్ జరగనుంది. ఇంతకుముందు భారతజట్టు జైపూర్‌లో 12వన్డేలు, ఓ టెస్టు ఆడిరది. 12వన్డేల్లో 8మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. కాగా తొలి టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఫ్యాన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిపత్యం సాధించాలని ఉవ్విల్లూరుతోంది రోహిత్ సేన.
టీమిండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ.. టీ20 ప్రపంచకప్ లో ఆఖరి మూడు మ్యాచుల్లో మంచి భాగస్వామ్యాలు అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరే మరోసారి ఆ బాధ్యతలు మోయనున్నారు. ఈ ఇద్దరూ ఓపెనర్లుగా దిగడంతో రుతురాజ్ గైక్వాడ్ కు నిరాశ తప్పదు. ఇక, వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్ కి తుది జట్టులో చోటు దక్కనుంది. ఐపీఎల్ లో కీలక భాగస్వామ్యాలు నిర్మించడంలో శ్రేయస్ అయ్యర్ దిట్ట. ఇక, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ బ్యాటింగ్ కి రానున్నారు. ఇక, ఆల్ రౌండర్ కోటాలో వెంకటేశ్ అయ్యర్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అతన్ని తుది జట్టులో తీసుకునే ఆలోచనలో రోహిత్, ద్రావిడ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్ లు పేస్ బౌలింగ్ భారాన్ని మోసే అవకాశం ఉంది. స్పిన్నర్లు అశ్విన్, యుజువేంద్ర చాహల్ లకు చోటు ఖాయం. ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ లకు నిరాశ తప్పేలా లేదు. ఈ యంగ్ క్రికెటర్లు బెంచ్ కే పరిమితం కానున్నారు.