Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాపై దుష్ప్రచారం చేశారు…హార్ధిక్‌ పాండ్యా

నాపై దుష్ప్రచారం చేశారు

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు ముంబై ఎయిర్‌ పోర్టులో చేదు అనుభవం ఎదురైందని కథనాలు వచ్చాయి. దీనిపై పాండ్యా స్పందిస్తూ.. ఖరీదైన వాచ్‌ల వ్యవహారంపై వచ్చినవి వదంతులేనని కొట్టిపారేశాడు. అతడి వద్ద ఉన్న కోట్ల రూపాయల వాచ్‌ లను ముంబై కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారని జాతీయ మీడియాలో కథనాలు రాగా, ఆ కథనాలపై పాండ్యా వివరణ ఇచ్చుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసిన తరువాత హార్ధిక్‌ పాండ్యా ముంబైకి తిరిగొచ్చాడు. ఎయిర్‌పోర్టులో టీమిండియా ఆటగాడు పాండ్యాను అధికారులు అడ్డుకున్నారు. అతడి వద్ద రెండు ఖరీదైన వాచ్‌లున్నాయని వాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని వైరల్‌ అయింది. తన వద్ద ఉన్న ఖరీదైన వాచ్‌ ల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపాడు. రిస్ట్‌ వాచ్‌ల విలువ రూ.5 కోట్లు అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. దుబాయ్‌ నుంచి తాను సోమవారం ఉదయం ముంబైకి తిరిగి రావడం, ఎయిర్‌ పోర్టులో అధికారుల తనిఖీలు నిజమేనని ట్విట్టర్‌లో పూర్తి వివరాలు పోస్ట్‌ చేశాడు. ‘నాకు నేనుగా నాతో ఉన్న ఖరీదైన వస్తువుల వివరాలను కస్టమ్స్‌ వారికి అందించాను. కానీ కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే వాచ్‌ లను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారన్నది వదంతులు మాత్రమే. దుబాయ్‌ లో నేను కొనుగోలు చేసినట్లు చేతి వాచ్‌లతో పాటు ఇతరత్రా వస్తువుల వివరాలు ముంబై ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ వారికి తెలిపిన మాట వాస్తవం. కస్టమ్స్‌ అధికారులు నాతో ఉన్న ఖరీదైన వాచ్‌ ల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు సమర్పించాలని అడిగారు. నేను ఎంతమేర ట్యాక్స్‌ చెల్లించాలో అధికారులు చెప్పారు. వాచ్‌ ఖరీదు రూ.1.5 కోట్లు కాగా 5 కోట్ల రూపాయల వాచ్‌లు సీజ్‌ చేశారని ప్రచారం జరిగింది. ఓ బాధ్యత గల పౌరుడిగా చట్టాలను నేను గౌరవిస్తాను. ప్రభుత్వ శాఖలకు సహకరిస్తా. ముంబై కస్టమ్స్‌ అధికారులు కోరిన వివరాలు అందజేస్తాను. కానీ చట్టాలను ఉల్లంఘించారని సోషల్‌ మీడియాలో హద్దులు మీరి తనపై దుష్ప్రచారం చేశారని’ ఓ ప్రకటనలో హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.