Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యవసాయంలో జాతీయ విధానం రావాలి 

పర్యావరణ విధ్వంసంతో దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పోకడలు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా కురుస్తున్న వర్షాలకు .లమయం అవుతోంది. తాజాగా తమిళనాడు తీవ్రమైన జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎపిలో కూడా కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు తొలుత దెబ్బతినేది పంటలయితే… ఇప్పుడు సామాన్యులకు  కూడా నిలువనీడ లేకుండా పోతున్నారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ సముద్రంలోకి నీరు చేరుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కూడా అలాంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు జాతీయ జలవిధానం రూపొందించాల్సి ఉంది.

వర్షాల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబిం చాలి. మనం మన వ్యవసాయాన్ని అభిశృద్ది చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించడం, మన అవసరాలకు తగ్గ పంటలను మాత్రమే పండి౦చేలా రైతులను చైతన్యం చేయడం..అందుకు సాంకేతిక సహకారం అందించడం ద్వారా అన్నదాతలను బతికించుకోవాలి. మనకు తిండిపెట్టడానికి అతడిని కాపాడుకోవాలి. తీరా పంటలు పండిరచాక సరైన ధరలు చెల్లించకపోవడం.. పంటలను కొనుగోలు చేయలేమని చెప్పడం అలవాటుగా మారింది. ఈ పద్దతిని రూపుమాపాలి. వ్యవసాయ ఉత్పత్తులను పెంచి విదేశాలకు ఎగుమతులు చేసే విధంగా సన్నద్దం కావాలి. ఆధునిక వ్యవసాయం దిశగా పురోగమించడానికి ఉన్న అని అకాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

కరోనాతో ఇప్పుడు నిరుద్యోగం పెరిగింది. ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు రచించాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగగలవు. అలాగే వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచి వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. వ్యవసాయంపై కూడా జాతీయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, దిగు బడులు తగ్గించుకుని మన రైతులను ప్రోత్సహిచేలా చూసుకోవాలి. కరోనా నేర్పిన గుణపాఠం మనకు అనుభవం కావాలి. ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి.

వంట నూనెల, పప్పుదినుసుల దిగుమతులను తగ్గించి దేవీయంగా ఉత్పత్తి అవుతున్న పంటలపై ఆధార పడగలిగేలా విధానాలను రూపొందించాలి. వ్యవసాయరంగం పురోగమిస్తే, ధాన్యం దిగుబడులు తగ్గితే తప్ప దేశం ఆర్థికంగా పురోగమించదు. ప్రధానంగా అనేక రకాల పప్పుధాన్యాలు, వంటనూనెల దిగుమతులను పూర్తిగా నిషేధించుకుని, దేశీయంగా పండి౦చుకునేలా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కనీసం ఓ పదేళ్ల పాటు వ్యవసాయరంగ ఉత్పత్తులపై దృష్టి సారిస్తే భారతదేశం ఆర్దికంగా  మళ్లీ పుంజుకోగలదు. కరోనాతో ఇప్పుడు అనేకమంది మళ్లీ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకునేలా చేయాలి. ఈ క్రమంలో విదేశాలకు భారీగా ఎగుమతి చేసేలా పంటలు పండి౦చగలగాలి. దీంతో మనకు విదేశీ మారకం కూడా ఆదా కాగలదు. అలా పంటలు పండి౦చే సత్తా మన రైతాంగానికి ఉందని గుర్తుంచు కోవాలి.

మన రైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపడుకునేలా రైతాంగ విధానాలు వస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు. కరువులు వచ్చినా, వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ
కనిపించడం లేదు. రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలక
నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణమాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి.

విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కలిసి రైతులకిచ్చే ఋణాలలో కోత పెడుతున్నారు. అడ్తిదారులు, కవిూషన్‌ ఏజెంట్లు, మార్కెట్‌ అధికారులు, అంతిమంగా అందరూ రైతులను ముంచడానికే సిద్దంగా ఉంటున్నారు. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. ప్రతి ఎకరాకు కౌలు 10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భూమి యజమానులకు చెల్లించవలసి వస్తుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం మంచిగా అయిన ప్పటికీ ధరలు రాక నష్టపోతున్నారు.

వర్షాలు లేని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్టపోతు న్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. మార్కెట్‌లో రైతును దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. రైతులను దోచుకుంటున్న వారికి తిండి ఎలా వంటబడు తుందో అర్థం కావడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. ఇప్పుడు వారంతా కరోనా భయంతో తిరిగి గ్రామాలకు చేరారు. వారిని వ్యవసాయంలో స్థిరపడేలా చేయాలి. వ్యవసాయ భూమి లేని కూలీలు కౌలుకు తీసుకొని నష్టాల పాలయి బ్రతుకునీడ్చలేక, అవమానం భరించ లేక, చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులకి మేలు చేస్తానన్న ప్రభుత్వాల ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అంతెందుకు రైతులకు గిట్టుబాటును మించి ధరలు దక్కేలా చేస్తామన్న ప్రధాని మోడీ వాగ్దానాన్ని నెరవేర్చగలగాలి.

వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు అనేక రెట్లు పెరిగిపోవడంతో పాటు విత్తనాల దగ్గర నుంచి నకిలీలు రైతులను కుంగ దీస్తున్నాయి. చాలామంది రైతులు, కౌలుదారులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు, వడ్డీ వ్యాపారస్థుల దగ్గర అప్పు తీసుకుంటే తడిసి మోపెడవుతుంది. ఈ సమస్యలను అధిగమించి రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు రుణామాఫీ ప్రకటించి మొక్కుబడి తీర్చుకుంటున్నారు. దీంతో సమస్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తోంది తప్ప సమస్యను శాశ్వతంగా దూరం చేయడం లేదు. ఈ విధానాలకు స్వస్తి పలికి నిపుణుల సలహాతో వ్యవసాయరంగాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ది చేయాలి. నూతన జాతీయ విధానం రూపొందించాలి.