మోడీకి ప్రత్యామ్నాయం సాధ్యమేనా ..!

కీలెరిగి వాతపెట్టాలన్నది సామెత. రోగానికి తగ్గ మందు ఉంటేనే అది నయం అవుతుంది. ఆధునిక రాజకీయాలను బాగా ఔపోసన పట్టిన తెలంగాణ సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై మళ్లీ దృష్టి సారించారా అన్న చర్చసాగుతోంది. ఎందుకంటే ఇటీవల మరోమారు ఆయన రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. కేంద్రంలోని బిజెపి లక్ష్యంగా ఆయన సవాళ్లు విసురుతున్నారు. గతంలో ప్రత్యామ్నాయ వేదిక రూపొందిస్తామని ప్రకటించినా ఎందుకనో వెనక్కి తగ్గారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు, వివిధ అంశాలపై కేంద్రం నుంచి చేయూత దక్కకపోవడంతో ఆయన భగ్గుమంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు, నీటివాటాల కేటాయింపు, వివిధ రంగాలకు ఆర్థిక కేటాయింపుల విషయంలో సిఎం కెసిఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు అన్ని రాష్టాల్ల్రో ఇదే పరిస్థితి ఉన్నా ఎపిలో సిఎం జగన్ జాతీయ రాజకీయాలపట్ల విముఖంగానే ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన అనేక అవినీతి కేసుల్లో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. అయితే అనూహ్యంగా వైసిపి మాత్రం పెట్రో ధరలపై భగ్గుమంది. బిజెపిని ఏకి పారేస్తోంది. కేంద్రం తీరుపై మంత్రులు తదితరులు మండిపడుతున్నారు.
కెసిఆర్ మరో అడుగు ముందుకు వేసి ధాన్యం కొనుగోళ్లపై పార్టీ పరంగా ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. ఇదంతా టిఆర్‌ఎస్ బలం చాటడానికే. ఇప్పటివరకు జాతీయ రాజకీయాల్లో బిజెపి దూకుడును అడ్డుకునే మొనగాడే లేకుండా పోయాడు. అలాగే మోడీ నిర్ణయాలను నిగ్గదీసి ప్రజల్లో నిలబడగలిగిన నేత కూడా లేకుండా పోయాడు. కేంద్రంలో విపక్ష బాధ్యత నిర్వహించే దీటైన నేత లేకపోవడంతో బిజెపి నిర్ణయాలు ఏవైనా అమలవు తున్నాయి. అడిగే వారు లేరన్న విధంగా ప్రధాని మోడీ తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరి స్తున్నారు. అనేకానేక అంశాలపై సాధికారికంగా మాట్లాడే నేత లేడన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారు.
విపక్షాల్లో అనైతక్యత, ఉన్నవారికి ఛరిష్మా లేకపోవడం కారణంగా మోడీ దూకుడుకు కళ్లెం వేయలేక పోతు న్నారు. అంతేగాకుండా నేతలంతా అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్‌నేత రాహుల్ అయితే అస్త్ర సన్యాసం చేశారు. ప్రియాంకకు ఆదరణ ఉన్నా ఆమె తల్లి సోనియానే అడ్డుకుంటున్నారన్న భావనా ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి ప్రతిపక్షం ఏదైనా రాగలదా అని కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నకు కెసిఆర్ అన్న మూడక్షరాల సమాధానం వస్తోంది. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనీ తెలుసు. అయితే వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు రాలేదన్న ఆందోళన సర్వత్రా ఉంది.
కరోనా తదనంతర పరిస్థితుల కారణంగా ఆర్థిక స్థితి కుదేలయ్యింది. సామాన్యులు బతకడమే కష్టంగా మారింది. బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళల రక్షణకు ట్రిబుల్ తలాక్ చట్టం తేవడం, అమోధ్య సమస్యకు పరిష్కారం చూపడం, రక్షణ రంగంలో బలంగా నిలవడం వంటివన్నీ ప్రజల దృష్టిలో మోడీని హీరోగా నిలిపాయి. ఇవన్నీచూపి మోడీ తనకు నచ్చినరీతిలో దేశంలో ఉన్న ఆస్తులను అనుమాయులకు కట్టబెడుతున్నారు.లాభాల్లో ఉన్న సంస్థలతో పాటు లాభాలు తెచ్చి పెట్టే సంస్థలను కూడా తెగనమ్మేస్తు న్నారు. దీంతో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గండిపడుతోంది.ఈ కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అర్థికంగా ప్రజలు రోజురోజుకూ దిగజారుతున్నారు. డాలర్ విలువ పెరుగుతోంది. రూపాయికి విలువ లేకుండా పోయింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన విపక్షం కావాలని మోడీని మాటలతోనే బురిడీ కొట్టించే వక్త కావాలని కూడా ప్రజలు కోరుకుం టున్నారు. వీటన్నటికి సమధానం మళ్లీ కెసిఆర్ అన్న మూడక్షరాలు సమాధానంగా వస్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న రాజకీయ నేతల్లో కెసిఆర్‌కున్న రాజకీయ నిబద్దత, అవగాహన మరెవరికీ లేదు. అలాగే ఆయన భారత రాజకీయాలు, ప్రపంచరాజకీయాలను బాగా ఔపోసన పట్టారు. అయితే ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశించినా మిగతా విపక్ష పార్టీల మద్దతు అవసరం. అన్ని పార్టీలు భేషజాలు వీడి కెసిఆర్ వెన్నంటి ఉంటే కెసిఆర్ ప్రత్యామ్నాయం చూపడం ఖాయం.
కెసిఆర్ కూడా జాతీయ రాజకీయా ల్లోకి ఎంటర్ అయ్యేందకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కెసిఆర్ ఇటీవల వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో జరిగే మార్పును సూచిస్తున్నది. జాతీయరాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకు నేందుకు వ్యూహం పన్నడం ఖాయంగా కనిపిస్తోంది. సాగు చట్టాలకి వ్యతిరేకంగాదేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగడం, ఏడాదిగా రైతులు పట్టువీడకుండా ఆందోళనలు సాగిస్తున్నా మోడీ చలించడం లేదు. అందుకే ఈ సమస్యలను భుజాన వేసుకోవడం ద్వారా కెసిఆర్ జాతీయ రాజకీయాల బూజును దులపాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
అలాగే ఇప్పటికే తెలంగాణలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలు దేశ్యాప్తంగా అమలు చేస్తే దరిద్రం పోతుందన్న భావన కెసిఆర్‌లో బలంగా నాటుకుంది. తెలంగాణలో ముస్లింలు ఆయనను వ్యతిరేకించడం లేదు. జాతీయ రాజకీయాల్లోకి వస్తే ముస్లింలు కూడా కెసిఆర్ వెన్నంటి నడుస్తారు. అందుకు ఓవైసీ కూడా తోడ్పడతారు. ఇకపోతే సాగునీటి వాడకం, విద్యుత్ రంగంలో కెసిఆర్‌కు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. దీనికితోడు భారదేశ ప్రజలను ఆకట్టుకునేలా అవసర మైన పదజాలం, భావజాలం కెసిఆర్ సోంతం. అందుకే విపక్షానికి కెసిఆర్ బలం కాగలరు. బలమైన నేతగా రాణించగలరు. కెసిఆర్ బయలుదేరితే అందుకు మిగతా పక్షాలు కూడా అడుగు వేస్తేనే ఇది సాధ్యం. జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ ఇలా తలా ఓ చేయివేస్తే దేశంలో మోడీకి వ్యతిరేకంగా ఓ బలమైన విపక్షం ఆవిష్కృతం కాగలదు.