ప్రభాస్ జోడీగా కొరియన్ హీరోయిన్ ?

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ’రాధేశ్యామ్’ ను వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత ’సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ లాంటి మరో నాలుగు పాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీటిలో ’స్పిరిట్’ మూవీలో ప్రభాస్ సూపర్ కాప్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ’అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ చేయని పాత్రను ఇందులో చేయబోతున్నారు. అలాంటి ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సరికొత్త వార్త వినిపిస్తోంది.
’స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా ఓ కొరియన్ బ్యూటీని ఎంపిక చేయబోతున్నారట దర్శకుడు సందీప్ రెడ్డి. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమస్ అయిన సాంగ్ హై క్యో ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతోందట. రాజమౌళి ’ఆర్.ఆర్.ఆర్’ మూవీలో యన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ అనే బ్రిటీష్ బ్యూటీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా మూవీకి కూడా కథానాయికగా ఫారెన్ బ్యూటీని ఎంపిక చేయబోతుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మరి నిజంగానే ప్రభాస్ తో కొరియన్ గాళ్ రొమాన్స్ చేస్తుందో లేదో చూడాలి.