సమస్యలను పరిష్కరించే కెసిఆర్ కావాలి… !
త్వరలో సీఎం కేసీఆర్‌లో మునుపటి ఉద్యమ నేతను చూస్తామని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను ఎలా అర్థం చేసుకోవలో ఆయనే చెబితే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మళ్లీ ఉద్యమిద్దామని కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొడదామంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన్ని ఇలాగే చూడాలని రాష్ట్రంలోని అందరూ కోరుతు న్నారని ఆయన అన్నారు. నిజానికి కెసిఆర్ ఎలా ఉన్నా ప్రజలకు వచ్చే నష్టం లేదు. వివిధ సమస్యలపై కెసిఆర్ కోణంలో చూస్తే అంతా ఫీల్ గుడ్‌గా కనిపిస్తుంది. అలాగే కెటిఆర్ కోణంలో చూస్తే తెలంగాణ బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే కేంద్రం తప్పిదాలను లేదా ధరల పెంపు వంటి అంశాలను ఎవరైనా ఎండగట్టాల్సిందే. అలాగే తెలంగానలో ఇచ్చిన హావిూలపై వస్తున్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సిందే. ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రిగా కెటిఆర్ స్వయంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. అంతేగాని ఇక్కడ కెసిఆర్ మునుపటి మనిషిగా మారాలా వద్దా అన్నది ముఖ్యం కాదు.
తెలంగాణ ఏర్పడకముందు మనం ఇచ్చిన హావిూలు..వాటి అమలు జరిగిన తీరును సవిూక్షిం చుకుని పాలన చేయాలి. ఆత్మవిమర్శ ఎప్పటికైనా మంచి మార్గం వైపు తీసుకుని వెళుతుంది. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మన అభివృద్ధి కనిపించడం లేదని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజానికి ఎన్నికల్లో గెలవడం అన్నది కేవలం ప్రజల పూర్తి అభిప్రాయంగా చూడరాదు. రకరకాల ప్రలోభాలతో మనం ఎన్నికల్లో గెలుస్తాం. అయినంత మాత్రాన ప్రజలు పూర్తిగా మద్దతు తమకే ఉందని చెప్పుంటూ ప్రజావ్యతిరేక చర్యల కు పాల్పడరాదు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పరాజయం చెందడం కేవలం ప్రజల వ్యతిరేకత గానే చూడాలి. అక్కడ ఎందుకు ప్రజలు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించారో గమనించాలి.
దుబ్బాకలో కూడా అదే జరిగింది. రెండు ఉప ఎన్నికల్లో రెండు సీట్లు చేజార్చుకోవడం వల్ల కెసిఆర్కు ఇప్పుడే వచ్చిన నష్టం లేదా అపఖ్యాతి ఏవిూ లేదు. ఎందుకంటే స్థానిక ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంది. అయినంత మాత్రాన ఆ గెలుపును కూడా చులకనగా చూకుండా ముందు జాగ్రత్త వహించాలి. నిజానికి వరుసగా రెండు రోజుల పాటు సిఎం కెసిఆర్ విూడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కేవలం బిజెపిని టార్గెట్ చేసేవిగా మాత్రమే ఉన్నాయి. అంతేగానీ తెలంగాణ సమస్యలపై తక్షణ చర్యలపై చర్చించేవిగా లేవు. తెలంగాణ ప్రజల్లో మార్పునకు హుజూరాబాద్ ఫలితం సంకేతమని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. అలాగే ప్రజల్లో కొందరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2వేల ఓట్లు కూడా రాని బిజెపి ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్లకు పైగా సాధించడం తెలంగాణలో పార్టీ ప్రభంజనాన్ని సూచిస్తోందని బిజెపి భ్రమల్లో ఉంటే ఉండ వచ్చు.
నిజానికి హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కేవలం ఈటెల వ్యక్తిగత విజయంగానేచూడాలి. ఆరోగ్య మంత్రిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్న క్రమంలో ఈటల రాజేందర్ ప్రత్యామ్నాయ నేతగా అవతరిస్తున్నాడన్న భావనలో తొలగించిన మాట వాస్తవం. ఎక్కడ తన కుమారుడి వారసత్వావికి అడ్డుతగు లుతాడో అన్న భయంతో కేసీఆర్ ఉంటే ఉండివుండవచ్చు. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసి అధికారం నుంచి తప్పించారు. అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఆయనపై అక్రమకేసులు బనాయించారు. ఉప ఎన్నికలో అనేక ఎన్నికల అక్రమాలకు పాల్పడినా ప్రజలు చెక్కుచెదరకుండా అన్నిటినీ తిప్పిగొట్టి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌నే గెలిపించారు.
నిజానికి ఇది టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమి కాదు, కేసిఆర్ వ్యక్తిగత ఓటమి. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారనే భావిచాలి. ఒక్క ఓటమితో ఇప్పటికిప్పుడు సిఎం కేసిఆర్ కు ఏవిూ కాదని కూడా చెప్పాలి. ఈ ఒక్క ఓటమితోనే కేసిఆర్ భవిష్యత్ అంధకార బంధురం అవుతుందని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమే కాగలదు. ఎందుకంటే గతంలో కెసిఆర్ అనేకమార్లు రాజీనామాలు చేసి గెలిచారు. ఆ కోవలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గెలిచాడు. ఇది ఈటెలపై ప్రజలకు ఉన్న అభిమానంగానే చూడాలి. కాకపోతే ఈటెలను ఓడిరచాలనుకుని కెసిఆర్ భంగపడ్డారు తప్ప మరోటి కాదు. అయితే ఓడిన ప్రతిసారీ ఆత్మవిమర్శ చేసుకుని క్రీడాకారుడిలాగా ముందుకు సాగితే మరో ఓటమి ఉండదు. అలాగే ఈ గెలుపుతో బిజెపి బలపడిరదని వారు భావించినా భంగపడ్డట్లే కాగలదు. హుజూరాబాద్ ఫలితం బిజెపి పట్ల పెరుగుతున్న ప్రజల అభిమానానికి నిదర్శనం అన్న వాదనల్లో పసలేదు. కాంగ్రెస్ లాగే తెలంగాణలో కూడా టిఆర్‌ఎస్ మటుమాయమై బిజెపియే ఒక ప్రధాన పార్టీగా నిలుస్తుందని కమలనాధులు భావిస్తే అదికూడా భ్రమే కాగలదు.
కెసిఆర్ పడిలేచిన కెరటం లాంటి వాడు. ఆయనకు ప్రజల నాడి ఆగా తెలిసిన వైద్యుడు. కాకపోతే మధ్యలో కొంత ఆత్మపరిశీలన చేసుకోవడంలో వెనకబడ్డారు. అలాగే ఎదుటివారిని తక్కువ అంచనా వేసి ఉంటారు. అయినంత మాత్రాన ఒక్క హుజూరాబాద్ ఓటమితో కుంగిపోయే మనస్తత్వం కాదు. ఇది ఆయనకు కూడా తెలుసు. కెటిఆర్ అన్నట్లుగా మునుపటికెసిఆర్ ను చూస్తారని అతి విశ్వాసంతో పోరాదు. సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటి పరిష్కారానికి దృష్టి పెడితే ప్రజల్లో మళ్లీ కెసిఆర్ నంబర్‌వన్‌గా ఉంటారు. వందిమాగధులను, భజన చేసే గ్యాంగ్‌ను కెసిఆర్ పక్కకు తప్పించాలి. తమిళనాడు, ఒడిషా సిఎంలు స్టాలిన్,నవీన్ పట్నాయక్లా పక్కన భజనపరులు లేకుండా చేసుకోవాలి. ప్రతిపనికీ పొగిడే బ్యాచ్‌ను వారించాలి. సమస్యలను తెలుసు కునే ప్రయత్నం చేయాలి. తాను అనుకున్నదే కరెక్ట్ అన్న ధోరణిలో పోరాదు. తెలంగాణలో వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లు, సమస్యలపై ఆందోళనలను పాజిటివ్‌గా తీసుకుని ఉంటే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రతిదీ ప్రతిపక్షాల కుట్రగానో చూడరాదు. పోలీసుల సలహాలతో సమస్యలను పరిస్కరించడం కూడా మంచిది కాదు. నిర్బంధంగా కేసులు పెట్టడం, బెదిరింపులకు దిగడం కూడా ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు.