Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విూటర్ల బిగింపుతో…. ఉచిత విద్యుత్‌కు చెక్‌

చాపకింద నీరులా సాగుతున్న వ్యవహారం

ఆందోళనలో అన్నదాతలు

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు క్రమంగా ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయి. ఇందులో ఉచిత విద్యుత్‌ కూడా ఒకటి.  విూటర్ల బిగింపు కార్యక్రమం సాగుతోంది. తెలంగాణలో అయితే నిరంతర విద్యుత్‌ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ విూటర్లు బిగించక తప్పదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా దీనివెనుక రైతులు వాడే విద్యుత్‌పై కన్నేయడం, క్రమేపీ సంస్కరణలు అమలుచేసి ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చడానికే ఈ ప్రయత్నాలనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ సంస్థలను కేంద్రం స్వాధీనం చేసుకుంటే ఇక ఈ పథకం అటకెక్కక తప్పదని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  అర్హులైన అన్నదాతలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని అమలుచేస్తున్నాయి. వైఎస్‌ సిఎం కాగానే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎపిలో  పథకం కింద కనెక్షన్‌ ఉన్న రైతుల కు తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇలా వాడే విద్యుత్‌కు విూటర్లు చాలావరకు లేవు. ఉన్నాసరే వాటికి నెలనెలా రీడి౦గ్‌ తీయడం లేదు. దీనివల్ల విద్యుత్‌ అంతా ఉచితంగానే అందుతోంది. అయితే కస్టమర్‌ సర్వీస్‌ ఛార్జీల పేరుతో  ప్రస్తుతం నెలకు రూ.30 మాత్రమే ఈపీడీసీఎల్‌ వసూలు చేస్తోంది. అంతకుమించి అన్నదాతలపై ఏ భారం లేదు.

కానీ ఇప్పుడు నెలనెలా బిల్లులు చేతిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం  అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు వచ్చే ఏడాది ఆగస్టు నుంచి డిజిటల్‌ విూటర్లు బిగించబోతోంది. తద్వారా నెలనెలా బిల్లు అన్నదాతలకు ఇచ్చి ఆ మొత్తం చెల్లించేలా చేయనుంది. ఇప్పటివరకు రైతులంతా ఉచిత విద్యుత్‌ పొందుతున్నారు. బిల్లులు చెల్లించే బాధ లేకుండా ధీమాగా ఉన్నారు. అయితే ఈ విధానానికి మంగళం పాడి ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లంటికీ కొత్తగా డిజిటల్‌ ఎనర్జీ విూటర్లు బిగించబోతోందన్న వార్త వారిని ఆందోళనకు గురిచేస్తోంది.  పథకం అమల్లో భాగంగా జిల్లాకు అవసరమైన విూటర్ల సరఫరాకు  ఏపీ ఈపీడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. ఈ ఏడాది డిసెంబర్‌కు ఈ పక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి విూటర్ల బిగింపు చేపట్టి తీరాలని పట్టుదలతో ఉంది.

ఒకసారి విూటర్లు బిగించిన తర్వాత ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి రైతు నెలకు ఎంత విద్యుత్‌ వాడుతున్నారు? ఎన్ని యూనిట్లు కాలుతున్నాయి? అనేది ఎప్పటికప్పుడు డిజిటల్‌ విూటర్‌ ద్వారా రీడి౦గ్‌ నమోదు చేస్తారు. ఆ తర్వాత వీటికి ఛార్జీలు నిర్ణయించి రైతుకు కరెంట్‌ బిల్లు చేతిలో పెట్టనున్నారు. పథకం అమల్లో భాగంగా ఇప్పటికే ట్రాన్స్‌కో అధికారులు గ్రామాల వారీగా ఉచిత విద్యుత్‌ వాడుతున్న రైతులకు సంబంధించి వారి ఆధార్‌ నెంబర్లు కూడా సేకరిం చారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అమలుచేస్తోంది. అన్ని ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు అక్కడ విూటర్లు బిగించారు. కొందరు రైతుల చేతికి ఈపీడీసీఎల్‌ విద్యుత్‌ బిల్లులు కూడా చేతికి అందించింది.  పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కఠినం గానే వ్యవహరించనుంది. మరోపక్క ఈ పథకం అమల్లోకి వస్తే క్రమేపీ ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతారని అన్నదాతలు ఆందోళనగా ఉన్నారు.