Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్రికెట్‌ లవర్స్‌ను ఆకట్టుకున్న రిషబ్‌ పంత్‌ చేసిన పని

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఘన విజయంతో ప్రస్థానం ముగించింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై విరాట్‌ కోహ్లీ సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. కానీ సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది.

సూపర్‌ 12 మ్యాచ్‌లలో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ చేసిన పని క్రికెట్‌ లవర్స్‌ను ఆకట్టుకుంది. నమీబియా బ్యాటింగ్‌ చేస్తుండగా ఇది జరిగింది. రాహుల్‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ తొలి బంతికి పరుగు కోసం ప్రయత్నించిన నమీబియా బ్యాటర్‌ నికోల్‌ లాఫ్టీ ఈటన్‌ వికెట్‌ కాపాడుకునే క్రమంలో డైవ్‌ చేశాడు. ఆ సమయంలో బంతిని అందుకుని రనౌట్‌ చేసేందుకు రిషబ్‌ పంత్‌ ప్రయత్నించాడు. కానీ పొరపాటున నికోల్‌ లాఫ్టీ బ్యాట్‌ మీద రిషబ్‌ పంత్‌ కాలు పెట్టాడు.బ్యాట్‌ మీద పంత్‌ ఎడమ కాలు అలా పెట్టాడో లేదో ఆ మరుసటి క్షణంలో పక్కకు జంప్‌ చేశాడు. అందరూ  పుస్తకాలను ఎలాగైతే గౌరవిస్తారో.. క్రికెటర్లు బ్యాట్‌, బంతిని అలాగే గౌరవిస్తారు. కనుక బ్యాట్‌ మీద తాను కాలు పెట్టినట్లు అనిపించగానే పక్కకు జంప్‌ చేసిన పంత్‌ అంతటితో ఆగలేదు. బ్యాట్‌ను తాకి మొక్కాడు. ఓ అభిమాని ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. దటీజ్‌ రిషబ్‌ పంత్‌.

క్రికెట్‌ పట్ల భారత క్రికెట్‌ జట్టుకు ఉన్న గౌరవం, విలువ ఇది అని రోహన్‌ అంజారియా అనే నెటిజన్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. రోహన్‌ పోస్టుకు విశేష స్పందన వస్తోంది. భారత పద్ధతి, సాంప్రదాయాలు అంటే ఇలా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాట్‌ ను కాలితో తాకాడని పంత్‌ వెంటనే చేతితో బ్యాట్‌ ను తాకి తన ఛాతీకి తాకడం అందుకు నిదర్శనమని అంటున్నారు. ఆట పట్ల తనకున్న విలువ, గౌరవం అది.. ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా ఒదిగి ఉన్నాడని ట్వీట్లు చేస్తున్నారు.