ట్రోఫీలు గెలవకుంటే పరుగులు చేసినా వృధానే..రోహిత్ శర్మ
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ
వ్యక్తిగత ప్రదర్శన కన్నా.. టీమ్ వర్క్ చాలా ముఖ్యమని ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టుకు ట్రోఫీ దక్కకుంటే, అప్పుడు ఎన్ని పరుగులు చేసినా, సెంచరీలు కొట్టినా వృధాయే అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ సోషల్ మీడియా టీమ్‌తో రోహిత్ మాట్లాడుతూ.. 2016 నుంచి నేటి వరకు చాలా అనుభవాన్ని గడి౦చానని, అప్పటితో పోలిస్తే ఓ బ్యాటర్‌గా చాలా పరిణితి చెందానని, జట్టుకు అవసరమైన రీతిలో గేమ్ ఆడానని, ఏదైనా షాట్ ఆడితే, దాని వల్ల జట్టుకు ఏదైనా ప్రయోజం ఉంటుందా అని ఆలోచించేవాడినని రోహిత్ పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ఆడినప్పుడు, ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, దాని వల్ల ఎక్కువ రన్స్ వస్తాయని, అందుకే ఇక ఎక్కువ సెంచరీలు చేసేవారిలోనూ ఎక్కువ శాతం మంది టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఉంటారని రోహిత్ అన్నాడు. ఇటీవల కాలంలో చాలా మంది సెంచరీలు చేస్తున్నారని, ఎందుకంటే ఆటతీరు అలా మారిందని, ఎటువంటి జంకు లేకుండా బ్యాటర్లు ఆడుతున్నారని, ఔట్ కావడం గురించి డౌట్ పడడం లేదని, ఇది చాలా వరకు జట్లకు కలిసి వచ్చిందన్నాడు. 2019 వరల్డ్ కప్ వ్యక్తిగతంగా తనకు ప్రత్యేకమైందని, ఆ టోర్నీలో కావాల్సినన్ని రన్స్ చేశానని, ఆ ఆటతీరు తనకు సంతృప్తిని ఇచ్చిందన్నాడు. ఏదైనా టోర్నీలో ఆడుతున్నపుడు, ప్రతి ఒక్కరికీ ఓ ప్లాన్ ఉంటుందని, దాన్ని ఫాలో అవ్వాలని, అది తనకు వర్కౌట్ అయ్యిందన్నాడు. కానీ నిజం చెప్పాలంటే, ట్రోఫీ గెలవకుంటే, మనం స్కోర్ చేసిన పరుగులు, సెంచరీలు అన్నీ వృధా అయిపోతాయని రోహిత్ తెలిపాడు.