జై భీమ్ లో సినతల్లిగా డీగ్లామర్‌ రోల్‌లో లిజోమోల్‌

సినతల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో అదుర్స్‌ అనిపించిన లిజోమోల్‌

తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో తమిళనాడు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జై భీమ్‌. దీపావళి సందర్భంగా ఓటీటీ సంస్థ ఆమెజాన్‌ ప్రైంలో విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఓ కేసులో అరెస్టు అయిన తన భర్త కనిపించకపోవడంతో అతడిని కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణం తెలుసుకునేందుకు ఓ గర్భిణీ మహిళ చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. ఇది తమిళనాడుకు చెందిన గిరిజన మహిళ నిజ జీవిత కథ కూడా. ఈ చిత్రంలో భర్త కోసం పోరాటం చేసిన గిరిజన మహిళ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రలో కనిపించిన నటి సినతల్లిగా అందరి మన్ననలు అందుకుంది.  దీంతో గిరిజన మహిళగా కనిపించిన ఆ నటి ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. జై భీమ్‌లో సినతల్లిగా లీడ్‌రోల్‌ పోషించిన ఈ మలయాళ నటి పేరు లిజోమోల్‌ జోస్‌. ఆమె కేరళకు చెందిన ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె సినిమాల్లోకి రాకముందు అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఓ చానల్‌లో పని చేసింది. పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌లో లిజో మాస్టర్స్‌ చదివింది. ఈ క్రమంలో తన స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపించింది.

ఫహద్‌ ఫాజిల్‌ నటించిన మహాశింబే ప్రతీకారం మూవీతో తమిళ పరిశ్రమకు ఎన్నికైంది. ఈ మూవీతోనే లిజో వెండితెరకు పరిచమైంది. 2016లో వచ్చిన రిత్విక్‌ రోషన్‌ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హనీ బీ 2.5 సినిమాతో మలయాళ స్టార్‌ నటిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరో సిద్దార్థ్‌ నటించిన తమిళ చిత్రం సివప్పు మంజల్‌ పచ్చాయ్‌(ఒరేయ్‌ బామ్మర్ది) మూవీతో హీరోయిన్‌గా నటించింది. ఇందులో సిద్దార్థ్‌కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాల్లో ఆమె నటనను చూసి జ్ఞానవేల్‌ జై భీమ్‌లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం లీజో తనని తాను మేకోవర్‌ చేసుకని డీ గ్లామర్‌గా రోల్‌ నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో లిజో అసలు గ్లీజరిన్‌ లేకుండా ఏడుపు సన్నివేశాలు చేసినట్లు ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిజో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన బంధువు, స్నేహితుడైన అరుణ్‌ అంటోనీని అక్టోబర్‌ 5న ఆమె క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.