జస్టిస్‌ చంద్రు జీవిత కథే జైభీమ్‌

అణగారిన వర్గాల కోసం పోరాడిన లాయర్‌గా పేరు

జై భీమ్‌ అంటే అణగారిన వర్గాల నినాదం కాదని తమ అస్తిత్వం కోసం వారు చేసే పోరాటమని సినిమా చాటి చెప్పింది. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానుల మన్ననలు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్‌ విూడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ చిత్రాన్ని చూసి హీరోకు లేఖ కూడా రాశారు. టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత వారమే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అయింది.

ఈ సినిమా కథేంటంటే.. రాజన్న తమిళనాడులోని ఒక గిరిజన తెగకు చెందినవాడు. అతడి భార్య సినతల్లి. ఒక చోరీ కేసులో అమానుషంగా రాజన్నతోపాటు మరో ఇద్దరు బంధువులను పోలీసులు ఇరికిస్తారు. జైల్లో పెట్టి నేరం ఒప్పుకోమని టార్చర్‌ పెడతారు. ఆ తర్వాత వాళ్లు తప్పించుకున్నారంటూ మరో కేసు ఫైల్‌ చేసి చేతులు దులుపుకుంటారు. తన భర్త ఎక్కడ ఉన్నాడు..? ఏమయ్యాడు? అసలు బతికి ఉన్నాడా..? వీళ్లేదైనా చేశారా..? అన్నది తేల్చమంటూ, తనకు న్యాయం చేయమంటూ హైకోర్టులో లాయర్‌గా పనిచేసే చంద్రు వద్దకు సినతల్లి వెళ్తుంది. ఆ లాయర్‌ ఏం చేశారు..? మిస్టరీగా మారిన కేసును ఎలా పరిష్కరించారు..? సినతల్లికి న్యాయం జరిగిందా..? అన్నదే సినిమా స్టోరీ. అయితే ఇది రియల్‌ స్టోరీ అని.. జస్టిస్‌ చంద్రు నిజజీవిత కథ అని చాలా మందికి తెలియదు.

నెట్టింట ఈ విషయం గురించి బయటకు రావడంతో అసలు జస్టిస్‌ చంద్రు ఎవరు..? అన్నది తెలుసుకోవడానికి నెటిజన్లు ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. జస్టిస్‌ చంద్రు అనే న్యాయవాది నిజ జీవిత గాథను ఆధారంగా చేసుకుని జై భీమ్‌ చిత్రం రూపొందింది. తమిళనాడులో 1990లో అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాడారు. మానవహక్కుల కోసం పోరాడినప్పుడు కోర్టుల్లో కేసులు వాదించడానికి ఒక రూపాయి కూడా తీసుకునే వారు కాదు. కుల వివక్షను రూపుమాపడానికి, వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి గాంచాడు. మద్రాస్‌ హైకోర్టుకు 2006, జులై 31న అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే హైకోర్టుకు పూర్తిస్థాయి న్యాయమూర్తిగా 2009, నవంబర్‌ 9న నియమితులయ్యి తన సేవలను అందించారు. తను లాయర్‌గా ఉన్నప్పుడు ఎటువంటి హక్కుల కోసమైతే పోరాడారో న్యాయమూర్తిగా నియమితులయ్యాక వాటిని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆయన హైకోర్టు జడ్జీగా పనిచేసిన సమయంలో ఇచ్చిన తీర్పులు ఎంతో మంది జీవితాలను మార్చివేశాయి.

ప్రతి న్యాయమూర్తి తన కెరీర్‌లో సగటున 10వేల నుంచి 20వేల వరకు తీర్పులు వెలువరిస్తారు. కానీ, చంద్రు ఆ రికార్డులన్నింటిని తలకిందులు చేస్తూ తన కెరీర్‌లో దాదాపుగా 96వేల తీర్పులు వెలువరించారు. ఆయన ఇచ్చిన ఒక తీర్పుతోనే మధ్యాహ్న భోజన పథకంలో 25వేల మంది నిరుపేద మహిళలకు ఉపాధి లభించింది. ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైనవి. లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో లిజన్‌ టు మై కేస్‌ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకంలోని ఓ కథతోనే ప్రస్తుతం జై భీమ్‌ సినిమా తెరకెక్కింది.

ఎర్రబుగ్గ కారులో ప్రయాణించడాన్ని అందరూ హోదాగా భావిస్తారు. కానీ, జస్టిస్‌ చంద్రు తనంత తానుగా ఆ బుగ్గను తొలగించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదన్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీని కూడా సరెండర్‌ చేశారు. కోర్టుల్లో తన ముందు వాదనలు వినిపిస్తున్నప్పుడు ‘ మై లార్డ్‌  అని పిలవాల్సిన అవసరం లేదని వివరించారు. హైకోర్టు నుంచి 2013లో రిటైర్డ్‌ కాగానే ప్రభుత్వం తనకు కేటాయించిన కారును కోర్టు ఆవరణ వద్దే వదిలి డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు. ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని లోకల్‌ ట్రైన్‌ ఎక్కి తన ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి ఎవరైనా న్యాయమూర్తి రిటైర్‌ అయితే ఆయనకు ఓ స్టార్‌ హోటల్‌లో విందును ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ జస్టిస్‌ చంద్రు మాత్రం ఆ విందును తిరస్కరించి.. ఆ విందుకు అయ్యే ఖర్చును ఏదైనా మంచి పనికోసం ఉపయోగించాల్సిగా కోరారు.