ఉప ఎన్నికల దెబ్బతో పెట్రో ధరలకు కళ్లెం…!

దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లకు క్లళెం వేసేందుకు కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యలు నమ్మశక్యంగా లేవు. గతంలో ఎన్నికల ముందు ధరల జోలికి పోకుండా..ఎన్నికలు అయ్యాక ధరలు అమాంతంగా పెంచడం అనే ఎత్తుగలను మోడీ వేశారు. అందుకే తాజాగా తీసుకున్న నిర్ణయం వెనక ప్రజలను ఆదుకునే ఉద్దేశ్యం ఎక్కడా కానరావడం లేదు. కేవలం ఇటీవలి ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కనిపించడంతో తీసుకున్న ఉపశమన చర్యగా మాత్రమే అనిపిస్తోంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలకు కొంతమేర ఉపశమనాన్ని కలిగించేదే అయినా ఇది పూర్తిగా నమ్మశక్యమైన చర్యగా లేదు. కొన్ని రాష్టాల్రు సైతం కేంద్రం బాటను అనుసరించాయి. ఆయా రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పిస్తూ వ్యాట్‌ను తగ్గించాయి. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ వంటి రాష్టాల్రు వ్యాట్‌లో కోత విధించాయి.
కేంద్రం తన నిర్ణయం ప్రకటించిన కాసేపటికే అసోం, త్రిపుర తమ నిర్ణయాన్ని ప్రకటించగా.. మరికొన్ని రాష్టాల్రు గురువారం ప్రకటన వెలువరించాయి. ఒక్క ఒడిశా మినహా తగ్గింపు ప్రకటించిన రాష్టాల్రన్నీ దాదాపు భాజపా పాలిత, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్టాల్రు కావడం గమనార్హం. ఇకపోతే ఉభయ తెలుగు రాష్టాల్రు దీనిపై పట్టించుకోలేదు. నిజానికి ఇది కంటితుడుపు చర్య మాత్రమే. దీని బదులు జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చివుంటే కేంద్రం చర్యలు నమ్మదగినవిగా ఉండేవి. కానీ మోడీ ప ª`రభుత్వం ఏదో కారణం చెబుతూ..రాష్టాల్రు అంగీకరించడం లేదని చెబుతూ పెట్రో ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం తీసుకుని వచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న మోడీ ఈ విషయంలో మాత్రం రాజకీయం చేస్తున్నారు. ప్రజల ఈతి బాధలను పట్టించుకోవడం లేదు. నిజానికి ఇదంతా ప్రజలపై ప్రేమతో చేసిన నిర్ణయంగా చూడరాదు. ఇటీవల దేశ వ్యాప్తంగా వివిధ రాష్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చెంపపెట్టు లాంటివిగా పరిణమించడం తో ఈ నిర్నయం తీసుకున్నట్లుగా ఉంది. ప్రజల వ్యతిరేకతపై నీళ్లు చల్లే చర్య తప్ప మరోటి కాదు. పెట్రో, గ్యాస్ ధరలు, నిరుద్యోగం, సాగుచట్టాలు,ప్రబుత్వరంగ సంస్థల అమ్మకం తదితర విషయాల్లో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉప ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. అయితే ఈ ఆగ్రహం కొంతమేరకే ప్రస్ఫుటమయ్యింది.
బిజెపి అధికారంలో కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటకలో ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్‌లో ఇప్పుడు డిపాజిట్లను కూడా ఆ పార్టీ కోల్పోయింది. 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తరువాత లోక్‌సభలో బిజెపి సంఖ్యాబలంలో ఒకటి తగ్గింది. అనేక రాష్టాల్ల్రో శాసనసభల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఉప ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్టాల్లో వ్యక్తమైన సానుకూలత బిజెపి బలానిక న్నా స్థానిక ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరిగింది. అధికార బిజెపిపై పెరిగిన వ్యతిరేకత, ప్రతిపక్షాలకు ఆదరణతో ఖంగుతిన్న బిజెపి కొంత ఆలస్యంగా అయినా మేల్కొంది. ఉప ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మ కంగానే తీసుకుంది. విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందుబా టులో ఉన్న అన్ని వనరులను ప్రయోగించింది. అయినా ఫలితం కానరాలేదు. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అనేక హావిూలను ఎరగా వేసింది. అయితే, వీటిని ప్రజలు ఏకోన్ముఖంగా తిరస్కరించడం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఎంతోకాలంగా అనేకానేక సమస్యలపై ఆందోళన
చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్రో ,గ్యాస్ ధరలు ఇష్టం వచ్చినట్లుగా పెంచుతూ పోతున్నారు. జిఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ను పక్కన పెట్టారు. ఈ క్రమంలో వచ్చిన ఉప ఎన్నికలను ప్రజలు బాగా ఉపయోగించుకున్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా రైతాంగం చేస్తున్న పోరాట ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. దీంతో పాటు చుక్కలను దాటి దూసుకుపోతున్న పెట్రో, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రజలను ప్రభావితం చేశాయి. కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపడం, కార్పొరేట్ల విూద రాయితీల వర్షం కురిపించడం వంటివి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపాయనే చెప్పాలి. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి హర్యానాలో ఏకంగా మాజీ సైనికుడిని రంగంలోకి దించి, దేశభక్తి పేరుతో ఓట్లు చీల్చడానికి బిజెపి చేసిన ప్రయత్నం వికటిం చింది.
రైతు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన ఐఎన్‌ఎల్‌డి నేత అభరు చౌతలా వైపే అక్కడ ప్రజానీకం నిలబడి౦ది. ఒక లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సమయంలోనే అధిక ధరల అంశం ఒక ఎజెండాగా ముందుకొచ్చింది. ఘోర ఓటమి తరువాత బిజెపి నాయకత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలను చేపట్టిందనే చెప్పాలి. అయితే గతంలో ఎన్నికల ముందు పెట్రో ధరల పెంపును వాయిదా వేసుకోవడం..తరవాత మళ్లీ వరుసగా పెంచడం చూశాం. ఇదే తరహా రాజకీయాలు చేస్తూ పోతే మోడీని ప్రజలు నమ్మబోరు. మొత్తంవిూద దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉప ఎన్నికలతో నరేంద్రమోడీ విూద, బిజెపి విూద ప్రజలకు వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం స్పష్టం అవుతోంది.
మోడీకి దీటైన ప్రత్యామ్నాయం లేదు గనుక మాదే గెలుపని ప్రకటిస్తూ వచ్చారు. కానీ ప్రజలు ఎవరు విపక్షంగా వారిని గెలిపించాలన్న యోచనలో ఉన్నట్లు ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషఙస్తే అర్థం అవుతుంది. తెలంగాణలో హుజురాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపు కూడా కేవలం ఆయన వ్యక్తిగత ఛరిష్మా తప్ప బిజెపితో ఆయనకు వచ్చిన లాభం ఏవిూ లేదు. ఈ క్రమంలో పెట్రో ధరలపై సుంకాన్ని తగ్గించి ప్రజలపై ఉదారత చూపే బదులు దానిని జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చి ధరలు తగ్గించేలా చేయాలి. తాత్కాలిక ఉపశమన చర్యలతో మభ్య పెడితే ప్రజలు గట్టిగానే బుద్ది చెబుతారని గుర్తించాలి. వచ్చే యేడాది యూపి, పంజాబ్ సహా ఐదు రాష్టాల్ర ఎన్నికల్లోపు పెట్రో,గ్యాస్ ధరలపై చర్యలు తీసుకోకుంటే బిజెపికి గుణపాఠం తప్పదు.