Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్తీక మాసం పరమ పవిత్రం

నోములు వ్రతాలకు ప్రత్యేకం

కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో కార్తీకంలో ఆయనకు అభిషేకాలు నిర్వహిస్తే మంచిదని శివపురాణం చెబుతోంది. అలాగ విష్ణువు అలంకార ప్రియుడు. ఈ మాసంలో ఆయనకు నిత్యం పూజలు, అలంకారాలు చేసి ఆరగింపులు చేయాలి. చాలామంది కార్తీకంలో సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరిస్తారు. అందుకే కార్తీకంలో అటు శివాలయాలు, ఇటు వైష్ణవాలయాలు కిటకిటలాడుతాయి.  కార్తీకం అంటేనే వ్రతాలు,నోములు, అభిషేకాలకు ప్రత్యేక మాసంగా గుర్తుంచుకోవాలి. ఈ  మాసం పరమ పవిత్రంగా పురాణాలు పేర్కొంటున్నాయి.  సముద్రా, నదీ స్నానాలకు కూడా ఇది పరమ పవిత్రమైన మాసం. కార్తీకమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్టాల్రు శివనామస్మరణంతో మార్మోగుతున్నాయి.

శివుడిని అభిషేకిస్తే పాపాలు హరిస్తాయని పురాణ ప్రవచనం. అందుకే కార్తీకంలో అభిషేకంతో శివుడిని ప్రసన్నం  చేసుకోవాలని మన రుషులు ఆదేశించారు. ఈ మాసంలోల చేసే పూజల వల్ల జీవితాంతం చేసిన పాపాలను హరించుకోవచ్చని చెబుతారు. అలాచేస్తే వచ్చే జన్మకు రాహిత్యం ఉంటుందని నమ్మిక. యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించి మనకు సన్మార్గం ఉపదేశించాడని కూడా చెబుతారు. శివ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం.

కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడిని  ఉపవాసంతో అభిషేకించి ఫలమో, ప్రాదమో సమర్పించుకుంటే సకల పాపాలు హరిస్తాయి.  కార్తీకంలో అన్నిరోజులు పవిత్రమే కనుక సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో అభిషేకాలు నిర్వహించాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే  కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం ఒక విశిష్టత. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షమవుతాడు.

సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు రుద్రాక్ష స్వరూపుడు. అందుకే రుద్రాక్షలు కూడా  సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. రుద్రాక్షలకు అంత మహత్యమెలా వచ్చిందన్న దానిపై దేవీ భాగవతంలో పూర్తిగా పొందుపరిచారు. త్రిలోక సంచారి నారద మునీంద్రునికి నారాయణ మహర్షి రుద్రాక్షల పవిత్రత గురించి విశదీకరించాడు. రాక్షస సంహారం అనంతరం త్రినేత్రాలను మూసివేసి ఈశ్వరుడు ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే స్వామి మూడు కన్నుల నుంచి కన్నీటి బిందువులు రాలాయి. శంభుని నేత్రాల నుంచి వచ్చిన కన్నీటి ధారలతో ఏర్పడిన వృక్షాలు కనుకే రుద్రాక్షలకు అంత పవిత్రత ఏర్పడి౦ది. ఇక విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో పాటు, ఆరాధానా ప్రియుడుకూడా. అందుకే కార్తీకంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వ్రతాలునిర్వహిస్తే అష్టయిశ్వర్యాలు పొందుతారని ఐతిహ్య. అందుకే కార్తీకంలో స్వామిని సత్యానారాయణుడి రూపంలో పూజిస్తారు.

దేశంలో శివాలయాల్లో, విష్ణ్వాలయాల్లో ఈ మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సముద్ర,నదీ తీరాల్లో స్నానాలు ఆచరించి పుణ్యతీర్థాలను దర్శించుకోవడం ఆనవాయితీ. అన్నవరం సత్యనారాయణస్వామి, యాదగిరి నృసింహస్వామి ఆలయాల్లో విశేషంగా వ్రతాలునిర్వహిస్తారు. వీటి ద్వారా ప్రజలు ఈతిబాధల నుంచి బయటపడతారనే నమ్మిక. నమ్మకాన్ని మించింది లేదు. అందుకే కార్తీకంలో ఆచరించే వ్రతాలకు,పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాశి, శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం తదితర ఆలయాల్లో దర్శనాలకు ఈ మాసం అనుకూలం. శివార్చకులు ఈ మాసంలో అభిషేకాలతో శివుడికి ప్రీతికరమైన అభిషేకాలు నిర్వహిస్తారు.

సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు. భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఈశ్వరుడు భక్తులకు కోరిన వరాలు ఇస్తుంటాడు. కొందరు శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్టిస్తుంటారు. అలా చేసే వారు నిత్యం అభిషేకంతో పాటు ఆరాధనలు, ఆరగింపులు చేయాలి. పరమేశ్వరుడికి ప్రతీకగా ఉన్న శివలింగం సర్వ సుభప్రదమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.  ఇంట్లో ఉన్న శివలింగానికి నిత్య పూజ జరగాల్సిందే.ఈ మాసంలో అభిషేకాలు నిర్వహించి నిత్యం ఆ పరమశివుడికి ఏదైనా తీపి పదార్థం లేదా ఫలం ప్రసాదంగా ఉంచి పూజ చేయాలి. అలా నిత్యం పూజ చేసే శక్తి ఉన్న వారే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలని పురాణాలు సూచిస్తున్నాయి. స్కందపురాణం ప్రకారం

శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చని సూచిస్తోంది. బుద్ధి కర్మానుసారిణీ… అంటారు. అంటే గతజన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు.కానీ పైజన్మకు మోయలేనంత

పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించు కోగలరు. మనం చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత మనదే.