లక్ష్మీపూజలు దీపావళి ప్రత్యేకం

కొత్త వ్యాపారాలకు ఇదే అదను

హైదరాబాద్‌,నవంబర్‌3(ఆర్‌ఎన్‌ఎ): దీపావళి రోజు లక్ష్మీపూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మన వ్యాపారాలు బాగా వృద్ది చెందాలని, అష్టయిష్వర్యాలు కలగాలని దీపావళి రోజు ధనపూజలు చేస్తుంటాం. ధనానికి అధిదేవత లక్ష్మి కావడంతో ఆమె ప్రసన్నం కోసం ధనపూజలు చేస్తారు.

కొందరు సత్యనారాయణస్వామి వ్రతం, మరికొందరు కేదార వ్రతాలను కూడా ఆచరిస్తారు.  దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని ఐతిహ్యం. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు ’ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడనీ పురాణ గాథలు చెబుతాయి.  బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి` దీపాలు ఉంచి పూజలు చచేయడం, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ, గానం చేయడం ఉత్తరాదిలో బహుళ ప్రచారంలో ఉంది.మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగ దొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. ధనత్రయోదశి పేరుతో చతుర్దశికి ముందే పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ధన త్రయోదశిని మూడురోజుల పండుగగా ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ధనాధిదేవతగా విష్ణువు ప్రకటించడాన్ని నరకాసురుడు భరించలేక పోతాడు. ఆమెను బంధిస్తాడు. అతడి ఆగడాల్ని అరికట్టడానికి అప్పటికే సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు బయలుదేరతాడు. నరకుణ్ని వారు సంహరించి, లోకానికి ఆ రాక్షస బాధ లేకుండా చేస్తారు. లక్ష్మీదేవి బంధవిముక్తురాలవుతుంది. అందువల్ల అందరూ ఆమెను ఘనంగా అర్చిస్తారు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య. భక్తులు ముందుగా లక్ష్మీపూజ చేయడంలోని ఆంతర్యం ఇదే! గుజరాత్‌, మహారాష్ట్రలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాన్ని విశేషంగా జరుపుతారు. సూర్యాస్తమయ సమయంలో, మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.  ఈ రోజున చేసే దానాలు, జపాలు, పూజలు అనేక ఉత్తమ ఫలితాలనిస్తాయని భక్తుల విశ్వాసం.దీపావళి ఆనందదాయకమైన పర్వదినం. లోకాల్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు, తన సతీమణి సత్యభామతో కలిసి సంహారం చేశాడు. నరకాసురుడి బాధలు తీరినందుకు గుర్తుగా టపాసులు పేలుస్తాం. చిచ్చుబుడ్డీల వెలుగుల్లో పండుగను ఆనందంగా జరుపుకొంటాం. ఈ పండగకు అన్నలు చెల్లెలి ఇంటికెళ్లి భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళికి తులాసంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే చలి, చీకటి కలిసిన కాలం అన్నమాట. పితృదేవతలకు దారి చూపడం కోసం ప్రాచీన కాలంలో దీపాలు పెట్టేవారు. కాలక్రమేణా టపాసులు కూడా వచ్చాయి. నరకాసురుడు వరాహస్వామికి భూదేవికి జన్మించినవాడు. అయితే లోకకంటకుడైన పుత్రుడిని లోకకల్యాణం కోసం సత్యభామ హతమార్చుతుంది. ఆమె భూదేవి స్వరూపం. ధర్మకంటకుడిగా ఎవరు మారినా వారిని అణచేందుకు పరంధాముడు, మహాలక్ష్మి  ఎలా వ్యవహరించారన్న అంశాన్ని ఈ ఘట్టం మనకు వివరిస్తుంది. త్రయోదశి రోజు రాత్రి వెలిగించే దీపం అపమృత్యువును నివారిస్తుంది. చతుర్దశి నాడు యముడికి తర్పణం వదిలి అనంతరం దీపం వెలిగించాలి. ఇలా చేస్తే నరకభయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.