Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూరాబాద్‌పై టిఆర్‌ఎస్‌ కుంటి సాకులు

కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యిందంటూ విమర్శలు

ఓటమిని హుందాగా స్వీకరించలేని స్థితిలో నేతలు

హైదరాబాద్‌,నవంబర్‌3(ఆర్‌ఎన్‌ఎ): హుజూరాబాద్‌ ఓటమిని హుందాగా అంగీకరించే స్థితిలో అధికార టిఆర్‌ఎస్‌ ఉన్నట్లుగా కనిపించడం లేదు. నిజానికి ఉద్యమనేత ఈటెల రాజేందర్‌ను అక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. గతంలో కెసిఆర్‌ అనేక పర్యాయాలు రాజీనామా చేసిన సందర్బంలో ప్రజలు ఇలాంటి తీర్పునే ఇచ్చారు. కానీ తనకో న్యాయం, ఈటెలకో న్యాయం అన్న విధంగా టిఆర్‌ఎస్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. మంత్రి కెటిఆర్‌ వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. హుజూరాబాద్‌ ఓటమితో ఒరిగేదేవిూ లేదని అనడం ద్వారా ప్రజా తీర్పును అపహాస్యం చేసే ధోరణి కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్‌, బిజెపి కుమ్మక్కు అయ్యా యని ఆరోపించడం ద్వారా ప్రజల తీర్పును తక్కువగా చేసి చూస్తున్నారు. కాంగ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్‌ అంతా బిజెపికి పోయిందన్న చర్చను ముందుకు తేవడం దాని దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు.

బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్‌ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయని, తద్వారా కాంగ్రెస్‌ ఓట్లు  బీజేపీకి పడ్డాయని టిఆర్‌ఎస్‌ మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఉభయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారని ఎన్నికలకు  ముందు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముందే వారికి ఓటమి అర్థం అయ్యిందని గ్రహించాలి. నిజానికి హుజూరాబాద్‌లో ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈటెలను అవమానకరంగా బయటకు పంపడం వల్ల ఈ ఎన్నిక అనివార్యమయ్యిందని వారికి తెలియంది కాదు. అలాగే కాంగ్రెస్‌లో బలంగా ఉన్న కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఆశ చూపి టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అలాగే దళితబంధు పేరుతో మోత్కుపల్లిని, మరో కారణంతో ఎల్‌. రమణను, పెద్దిరెడ్డిలను కూడా చేర్చుకున్నారు. అయినా అక్కడ కాంగ్రెస్‌ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ 2767 ఓట్లు మాత్రమే రావడం అన్నది కుమ్మక్కు రాజకీయాలకు కారణం కాదు. మార్జిన్‌ ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్‌ కోల్పోయారు. తన అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించడానికి అక్కడ పోటీకి ఎవరు కూడా ముందుకు రాలేకపోవడమే కారణం. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ లాంటి వారు పోటీకి విముఖత చూపారు. ఎందుకంటే అది ఈటెల రాజేందర్‌కు పట్టున్న స్థానం అని వారికి తెలుసు. హుజూరాబాద్‌లో బిజెపి, టిఆర్‌ఎస్‌ పార్టీలు వాడివేడిగా ప్రచారం చేస్తున్న సమయంలో పీసీసీ  అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆలస్యంగానే అక్కడ ప్రచారంలోకి దిగారు. ఈ విషయాన్ని ఆయన ముందే ప్రకటించారు. అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో కెసిఆర్‌, ఈటెల మధ్య పోటీగా మారిందని అందరికీ తెలుసు.  ఈ కారణాలను పక్కన పెట్టిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఓడిపోగానే…నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీ అభ్యర్థికి ఓటెయ్యాలని బాహాటంగానే ప్రచారం నిర్వహించారని చెప్పుకోవడం దాని దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా చూడాలి.

నిజానికి గత ఎన్నికల్లో బిజెపికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. కారణం అక్కడ బిజెపి బలంగా లేకపోవడమే. ఇప్పుడు కూడా బిజెపి బలంగా లేదు. కేవలం ఈటెల బలం వల్లనే బిజెపి గెలిచిందన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువైన బీజేపీ గెలుపునకు మా పార్టీలోనే కొందరు పరోక్షంగా సహకరించారని కోమటిరెడ్డి లాంటి వారు చేస్తున్న వాదన అర్థరహితం. దానిని పట్టుకుని టిఆర్‌ఎస్‌ ఈకలు పీకాలని చూడడం ఆత్మహత్యా సదృశం. హుజూరాబాద్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఈటల రాజేందర్‌కు మద్దతిచ్చిందన్న కారణంతో ఓటమిని కూడా అంగీకరించ లేని దౌర్భాగ్యస్థితిలో పార్టీ ఉంది. ఈటెల టిఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఈటెల బలం వల్ల్నే టిఆర్‌ఎస్‌ గెలిచిందన్న నిజాన్ని గులాబీనేతలు ఒప్పుకునేందుకు సిద్దంగా లేదు.

దుబ్బాక, హుజూరాబాద్‌లలో ప్రత్యేక పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌ ఓటమి చెందక తప్పలేదు. ప్రజలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా గట్టి నాయకులను అక్కున చేర్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించకుండా హరీష్‌ రావు సరిగా పనిచేయలేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిజానికి బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆయన గట్టిగా ప్రయత్నించారు. వ్యూహాలు రచించారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే వ్యక్తికి లేదా పార్టీకి ప్రజలు అంటకాగి ఉండరు.  టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి హరీశ్‌రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు.. తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. అన్నీ తామై వ్యవహరించినా ఓటమి తప్పలేదు.

అది పరిస్థితితులకు ఎదురీదాల్సిన ఎన్నిక కావడంతో ఓటమి తప్పలేదు.  గతంలో కూడా  దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరు విూద నడకే అనుకున్నారు. కానీ బిజెపి బలమైన అభ్యర్థిగా, గతంలో పోటీ చేసి ఓడిన వ్యక్తిగా రఘునందన్‌ రావు మరోమారు బరిలో నిలిచారు. అలాగే  జితేందర్‌ రెడ్డి తన వ్యూహాలతో చక్రం తిప్పారు. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో తొలిసారిగా మంత్రి హరీశ్‌రావుకు భంగపాటు ఎదురైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం ఈటల రాజేందర్‌ విజయం సాధించడంలో జితేందర్‌ మరోసారి హరీశ్‌పై పైచేయి సాధించారు. 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. చివరికి ప్రజలు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 191ఓట్ల ఆధిక్యం రావడం అన్నద ఇకేవలం ఈటలపై ఉన్న అభిమానం తప్ప మరోటి కాదు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ఇదే పరిస్తితి ఎదురయ్యింది. దీంతో ఇక్కడ ప్రచారం చేసిన టిఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల్లో ఆదరణ లేదనే అనుకోవాలా? స్థానిక టిఆర్‌ఎస్‌ నేతలు తమతమ గ్రామాల్లో బలంగా ప్రయత్నించినా ఈటెల వ్యక్తిత్వం ముందు నిలవలేక పోయారు. ఇవన్నీ గమనించి ఇకముందు నేతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. తాను చెప్పినట్లే ఓట్లు పడతాయని మంత్రి హరీష్‌ రావు కూడా అనుకోవడానికి లేదు. తాను గెలిచిన సిద్దిపేటలో కూడా ఎదురీదే పరిస్థితి రావచ్చు.