Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోహ్లీ సేనకు  ఏమయ్యిందో.. ! 

మన క్రికెటర్లకు ఏమయ్యింది..? ఎందుకింత పేలవంగా నిర్లక్ష్యంగా ఆడుతున్నారు. కనీసం పోటీ కూడా ఇవ్వడం లేదు. టాస్‌ ఓడిపోతే ఓడిపోతామన్న లెవల్లో రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేశారు. ఊరించి  ఉసూరుమనిపించారు. గతంలో ఎప్పుడూ ఇంత దౌర్భాగ్యంగా ఆడిన సందర్భాలు లేవు. పాక్‌, న్యూజిలాండ్‌ లతో ఆడిన రెండు మ్యాచు ల్లోనూ కనీసీ పోటీ కూడా ఇవ్వక టపటపా వికెట్లు పారేసుకోవడం సగటు ప్రేక్షకులను, క్రికెట్‌ ప్రేమికులను నిరాశకు గురిచేసింది. ఈ ఒక్క మ్యాచ్‌ ఓడితే ప్రపంచం ఏం మునిగిపోదు. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇది కూడా. ప్రపంచకప్‌ ఇప్పుడే మొదలైంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. లోపాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌లో సత్తాచాటుతామని పాకిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యానించాడు. కానీ ఏంజరిగింది. మళ్లీ అదే జరిగింది.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అసలు  వీరు మన ఆటగాళ్లేనా అన్న లేవల్లో ఆడారు. ఐపీఎల్‌లో భారీ సిక్సర్లతో విజృంభించే మనవాళ్లు.. అసలు పోరులో మాత్రం బౌండ్రీ హద్దుల్లో కివీస్‌ ఫీల్డర్లకు క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేయించారు. హార్డ్‌ హిట్టర్లుగా గుర్తింపు ఉన్న రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా భారీ షాట్‌లు ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడగా.. కాస్తలో కాస్త రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌ లైన్‌ అప్‌  పెంచేందుకు జట్టులోకి తీసుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ ఇలా వచ్చి అలా వెళ్లగా.. బౌలింగ్‌ లో మనవాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరిగిన చోట.. మనవాళ్లు రెండు వికెట్‌లతో సరిపెట్టుకున్నారు!

వారం రోజుల విశ్రాంతి అనంతరం అదే మైదానంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న భారత జట్టు ఆటతీరులో మాత్రం ఏ మార్పు కనిపించలేదు. సరైన సన్నద్ధత లేకుండా బరిలోకి దిగారా అన్న తీరుగా కనిపించారు. నిజానికి ఆటగాళ్లందరికీ ఐపీఎల్‌తో మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది! పరిస్థితులకు అలవాటు పడ్డారు.  దాదాపు రెండు నెలలుగా మనవాళ్లు యూఏఈలోనే ఉండి అక్కడే టి ట్వంటీలు ఆడుతున్నారు. అయినా లోపం ఎక్కడ ఉందనేది అర్థం కావడం లేదు. న్యూజిలాండ్‌తో ఆటగాళ్లను మార్చి, ఆర్డర్‌ను మార్చినా ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టిగా నిలబడలేకపోయారు. పాక్‌తో పోరులో మిగిలినవాళ్లంతా పెద్దగా ప్రభావం చూపక పోయినా.. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆదు కోవడంతో కనీసం పోరాడే స్కోరు చేసిన భారత్‌.. కివీస్‌తో పోరులో మరీ గల్లీ టీమ్‌ను తలపించింది. ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత టాపార్డర్‌ను కూలుస్తానన్న న్యూజిలాండ్‌ మాటలకు తలగ్గినట్లుగానే క్యూ కట్టారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు బదులు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా దింపడమే భారత మేనేజ్‌మెంట్‌ మైండ్‌సెట్‌ను స్పష్టం చేసింది. పవర్‌ప్లేలో ధాటిగా ఆడగలడనే ఉద్దేశంతో అతడిని బరిలోకి దింపినా.. ఇది ప్రత్యర్థికి తప్పుడు సంకేతాలిచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మూడో ఓవర్‌లో ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. కాసేపటి కే రాహుల్‌, రోహిత్‌, విరాట్‌ కూడా పెవిలియన్‌ చేరిపోయారు. ఈ నలుగురు క్యాచౌట్‌ కావడం గమనార్హం. పెద్దగా అంచనాల్లేకుండా టీ20 వరల్డ్‌ కప్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ మరోసారి భారత్‌కు షాకిచ్చిన తీరు ఆట చూసిన వారికి చిర్రెత్తి పోయి ఉంటుంది. ఇలా ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీలలో కివీస్‌ మన ఆశలకు గండికొట్టడం ఇది ముచ్చటగా మూడోసారి. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెవిూ ఫైనల్లో తొలిసారి మనోళ్లను ఆ జట్టు అడ్డుకుంది. టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్లోనూ ఓడించి రెండోసారి టీమిండియాపై పైచేయి సాధించింది. పోనీ ఆ రెండు ఓటములకు పొట్టి ప్రపంచ కప్‌లో బదులు తీర్చుకుని ఊరటనిస్తారనుకుంటే.. కోహ్లీసేన దారుణంగా ఓడిపోయింది.

ఇక సాంకేతికంగా చూస్తే ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు సెవిూస్‌ దారులు మూసుకు పోలేదు. సెవిూస్‌ చేరే చాన్సులున్నా..అందుకు పరిస్థితులు అనుకూలించాల్సి ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌ మూడిటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో గ్రూప్‌`2లో టాప్‌లో నిలిచింది. నవిూబియా, స్కాట్లాండ్‌లతో ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఆ రెండి౦టిలో గెలిస్తే పాకిస్థాన్‌ టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది. ఈ గ్రూప్‌ నుంచి సెవిూస్‌కి చేరే రెండో జట్టుపైనే ఒకింత ఉత్కంఠగా ఉంది. అయితే ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్‌ రెండు పాయింట్లతో అఫ్ఘాన్‌ తరవాతి స్థానంలో ఉంది. మనం అఫ్ఘాన్‌ కన్నా దారుణ మైన స్థితిలో ఉన్నాం.  మరోవైపు భారత్‌ ఆడిన రెండి౦టిలో ఘోర పరాజయం చవిచూడడంతో మన రన్‌రేట్‌ కూడా దారుణంగా ఉంది. భారత్‌ ఇంకా అఫ్ఘానిస్థాన్‌, స్కాట్లాండ్‌, నవిూబియా తో ఆడాలి. ఈ మూడి౦టిలో మనోళ్లు గెలుపొందుతారనే అనుకుందాం. నెగ్గడమంటే నెగ్గడం కాదు.. భారీ తేడాతో విజయం సాధిస్తేనే మన రన్‌రేట్‌ మైనస్‌ నుంచి ప్లస్‌కు చేరుతుంది. అప్పుడు ఆరు పాయింట్ల మన ఖాతాలో ఉంటాయి. మరోవైపు నవిూబియా, స్కాట్లాండ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లతో న్యూజిలాండ్‌ కూడా తలపడాల్సి ఉంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న కివీస్‌ నెట్‌రన్‌రేట్‌ మనకంటే మెరుగ్గా ఉంది. ఇక ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్‌ విజయం సాధిస్తే.. టీమిండియా సెవిూస్‌ అవకాశాలు గల్లంతే. అలా జరగకూడద నుకుంటే.. న్యూజిలాండ్‌ను ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోఉన్న అఫ్ఘానిస్థాన్‌ ఓడి౦చాల్సి ఉంటుంది. అప్పుడు భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్ఘాన్‌ తలా ఆరు పాయింట్లతో పట్టికలో సమంగా ఉంటాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల రెండు వరుస పరాజయాల భారం నుంచి కోలుకొని తదుపరి మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ అదిరిపోయేలా ఆడాలి.

కాగా, రెండు మ్యాచ్‌లు నెగ్గిన అఫ్ఘాన్‌.. పాక్‌ చేతిలో ఓడి౦ది. అయితే అఫ్ఘాన్‌ జట్టు అంత సులువుగా బాబర్‌ సేనకు లొంగలేదు. ఈ నేపథ్యంలో భారత్‌, కివీస్‌లకు ఆ జట్టుతో మ్యాచ్‌లు నల్లేరుపై నడక కాబోదు. ఏదేమైనా టీమిండియా సెవిూస్‌ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయనే చెప్పాలి.  ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమవగా, భువనేశ్వర్‌పై వేటు పడిరది. వీరి స్థానాల్లో ఇషాన్‌ కిషన్‌, శార్దుల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చారు. వీరిద్దరికీ ఇదే తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌. అయితే ఇద్దరు కూడా మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడున్న బ్యాటింగ్‌, బౌలింగ్‌ తీరుపైనా సవిూక్షించుకుని గట్టిగా ప్రయత్నిస్తే తప్ప భారత్‌ నిలదొక్కుకోవడం కష్టమే.